పోలీసు కుటుంబాలకు రూ.3 కోట్ల బీమా అందజేత

– ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున చెక్కులు అందజేసిన డీజీపీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : విధి నిర్వహణలో వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన పోలీసు సిబ్బందికి సంబంధించి వారి కుటుంబాలకు డిజిపి సి.వి.ఆనంద్ అండగా నిలిచారు. ముగ్గురు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.3 కోట్లను సోమవారం తన కార్యాలయంలో మృతుల కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను ఆయన అందజేశారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ముత్తంగి శ్రీనివాస్ శంకర్‌పల్లి పరిధిలో వెలిమడ తండా తెల్లపుర వద్ద 2025 ఫిబ్రవరి 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆయన తండ్రి ముత్తంగి యాదయ్యకు డీజీపీ ఆనంద్ రూ. కోటి బీమా చెక్కును అందజేశారు. నల్లగొండ జిల్లా కనగల్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న 2004 బ్యాచ్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ బోలెపల్లి సైదులు 2025 జూన్ 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. వరంగల్‌కు చెందిన మరో పోలీసు కానిస్టేబుల్ కె.వెంకటరెడ్డి 2026 మార్చి 10న లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతిచెందారు. వెంకట్‌రెడ్డి వరంగల్ లోని ఏఆర్పీసీగా హెడ్‌క్వార్టర్స్‌లో విధిని నిర్వహిర్తిస్తుండగా వెనుక నుంచి లారీ తగలడంతో ఆయన మృతిచెందారు. ఈ మృతులందరికీ ఎస్బీఐలో ఇన్సూరెన్స్ అకౌంట్ ఉండటం వల్ల బ్యాంకు అధికారులతో సంప్రదించి డీజీపీ వీరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున బీమా పరిహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు డీజీపీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబాల సంక్షేమానికి శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *