అర్థంలేని ప్ర‌యోగాల‌తో విద్యారంగంలో సంక్షోభం

  • బాహ్య మూల్యాంకన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి
  • డిటిఎఫ్ (DTF) డిమాండ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30: ప్రభుత్వ విద్యారంగాన్ని అర్థంలేని అనేక రకాల ప్రయోగాలతో మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. సోమయ్య, టి. లింగారెడ్డి విమ‌ర్శించారు. ఒక‌టో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు సమ్మేటివ్ పరీక్షల జవాబు పత్రాలను మండల వనరుల కేంద్రాల్లో బాహ్య మూల్యాంకనం చేయించాలన్న ప్రభుత్వ నిర్ణయం అనాలోచితమైనదని అన్నారు. ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంవరించుకోవాలని సోమయ్య, లింగారెడ్డి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఒక‌టో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు నాన్-డిటెన్షన్ విధానం అమలులో ఉన్నందున, సమ్మేటివ్ పరీక్షల్లో విద్యార్థుల ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికాదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా సమయం వివిధ శిక్షణలు, ప్రాజెక్టులు, రాత పనులు, ఇతర కార్యక్రమాల వల్ల తగ్గిపోతోందని పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేక ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనే అన్ని సబ్జెక్టులు బోధించాల్సి వస్తోందని తెలిపారు. విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఎల్‌ఐపీ, ఎల్‌ఈపీ వంటి కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తోందని చెప్పారు. సిలబస్ పూర్తి చేయడమే కష్టంగా మారిన ఇలాంటి ప‌రిస్థితుల్లో బాహ్య మూల్యాంకనం పేరుతో ఉపాధ్యాయులను బోధనకు మరింత దూరం చేయడం విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధమన్నారు.

జవాబు పత్రాల మూల్యాంకనాన్ని సంబంధిత ఉపాధ్యాయులు తమకు లభించే సమయానుసారం నిర్వహించగలరని, బాహ్య మూల్యాంకనం వల్ల అదనపు పని భారం పెరగడంతో పాటు బోధనాభ్యసన ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు అదనపు బాధ్యతలు, ఎంఈవో బాధ్యతలతో తీవ్ర పని భారాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో ఇటువంటి అనవసరమైన విధానాలను ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థుల అభ్యసనపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని డీటీఎఫ్ నాయకులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్ పరీక్షల జవాబు పత్రాల బాహ్య మూల్యాంకనానికి సంబంధించిన ఉత్తర్వులను వెంటనే ఉప‌సంహ‌రించుకోవాల‌ని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *