– ఆదివాసీల, వలస కార్మికుల ఓట్లు పోకూడదు
– పీసీసీ కమిటీల సమావేశాల్లో రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) అంశం లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులకు పెద్ద సమస్య కావచ్చునని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కొన్ని నియోజకవర్గాల్లో చాలామంది వలస వెళ్లారని, వారి ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ అంశంపై పార్టీ నాయకులంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం గాంధీ భవన్‌లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌పై అందరూ పెంచుకుని దాని వల్ల సామాన్యులు, పేదలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయో నాయకులు గుర్తించడం మంచి పరిణామమన్నారు. మహిళలకు కూడా ఎస్‌ఐఆర్ వల్ల సమస్యలు ఎదురుకావచ్చునన్నారు. దళితులు, మైనారిటీలు, మహిళల ఓట్లు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్‌పై అసెంబ్లీల వారీగా సమావేశాలు పెట్టాలని, మహిళా కాంగ్రెస్ తరపున క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఎస్‌ఐఆర్ వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారంపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. బూత్ ఎన్‌రోలర్ సాయంతో గతంలో 90 రోజుల్లో 45 లక్షల డిజిటల్ సభ్యత్వాలు చేయించామని, ఎక్కువ సభ్యత్వం నమోదు చేయించిన వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయించామని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ సభ్యత్వంలో కీలక పాత్ర పోషించిన ఎన్‌రోలర్స్‌ను ఎస్‌ఐఆర్ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలని రేవంత్‌రెడ్డి కోరారు. ఎసఐఆర్ కోసం 119 నియోజకవర్గాలు, 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించాలన్నారు. అసెంబ్లీ ఇన్‌చార్జిలు తప్పనిసరిగా నియోజకవర్గాల్లో ఉండాల్సిందేనన్నారు. ఇన్‌చార్జిలు సరిగా పనిచేస్తే ఒక్క ఓటు కూడా తొలగింపునకు గురికాకుండా చూడొచ్చునన్నారు. ఇన్‌చార్జి మంత్రులు ప్రతి పది రోజులకొకసారి పార్టీ కార్యక్రమాల కోసం పూర్తిగా పనిచేయాలని, క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను కలవాలని సూచించారు. తాను కూడా పది రోజులకోసారి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుస్తానని, నెలలో మూడు రోజులు కార్యకర్తల కోసం సమయం ఇస్తానని వెల్లడించారు.
పార్టీ కోసం పనిచేయాల్సిందే
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు.. ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనతోపాటు ఎవరికీì మినహాయింపు లేదన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. దాదాపుగా నామినేటేడ్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. పార్టీ తరపున ఇప్పుడు వేలాదిమంది సర్పంచ్‌లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఉన్నారంటూ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో బాధ్యత అప్పగించాలని కోరారు. సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్కలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





