అంచనాను మించి ధాన్యం ఉత్పత్తి

– అయినా చివరి గింజ వరకు కొంటూనే ఉన్నాం
– తడిసిన ధాన్యం సైతం కొని రైతులను ఆదుకున్నాం
– అదనపు కొనుగోళ్లకు రూ.16,479 కోట్లు ఖర్చు చేశాం
– మీడియా సమావేశంలో మంత్రులు వెల్లడి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29: దేశంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, ఈ మాట కేంద్రమే చెప్పిందని  పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గతంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొనుగోళ్ల కంటే ఇప్ప్పుడు ఎక్కువ కొంటున్నామన్నారు. సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఆయన  మీడియాతో శుక్రవారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు పాటిస్తూ చెప్పిన దానికంటే అదనంగా కొనుగోలు చేశామని, ఎంఎస్‌పీతో కొనుగోలుకు రూ.16,479 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత తమది అని ఉత్తమ్ తెలిపారు. ధాన్యం సేకరణకు 13వేల వాహనాలు అందుబాటులో ఉన్నాయని, రెండు లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారని, సేకరణ కేంద్రాలకు 20.86 కోట్ల గన్నీ బ్యాగులు పంపామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసి రూ.11,050 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ‘ధాన్యం సేకరణకు బిహార్, బెంగాల్ కార్మికులపై ఆధారపడి ఉన్నాం.. బెంగాల్ ఎన్నికలకు కార్మికులు స్వస్థలాలకు వెళ్లి రావడం ఆలస్యమైంది.. మద్దతు ధర కోసం మా ప్రభుత్వం రూ.49 వేల కోట్లు వెచ్చించగా గత ప్రభుత్వం రూ.10వేల కోట్లే ఇచ్చింది. ఈ విషయంలో ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం పండింది.. ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. ధాన్యం సేకరణపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కనీస మద్దతు ధరకే అన్ని రకాల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. 143 లక్షల టన్నుల ధాన్యం పండితే ఇప్పటివరకు 73 లక్షల టన్నులు కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామన్నారు. యాసంగిలో ప్రభుత్వం 73 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని, అయితే కేంద్ర ప్రభుత్వం 5 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతోందని, ఏటా తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోళ్లను తగ్గిస్తూ వస్తోందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోళ్లు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. బీజేపోళ్లు ధర్నా చేసుడు కాదు.. దిల్లీకి వెళ్లి వడ్లను కొనాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణలో రెండు వేల మిల్లులు పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణలో 60 లక్షల టన్నుల ధాన్యం కొంటే ఏపీలో 24 లక్షలే కొన్నారని మంత్రి ఉత్తమ్ పోల్చి చెప్పారు. ఇప్పటివరకు రూ.11,050 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం.. రెండున్నరేళ్లలో రూ.36వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం అని చెప్పారు. చివరి గింజ కొనేవరకు కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయని మరోసారి స్పష్టం చేశారు. ఇటీవలి వర్షాలకు తడిసిన 10,214 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *