– మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
– అందు కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్‌ల ప్రారంభం
– మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 29 : మహిళల చేతుల్లో బ్యాంక్ పాస్‌బుక్స్ మాత్రమే కాదు.. పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గ్రామీణ మహిళల ప్రతిభకు, ఆలోచనలకు, వ్యాపార కలలను సాకారం చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక, సాంకేతిక, వ్యాపారపరమైన సహకారం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బంజారాహిల్స్‌లోని కొమరం భీం ఆదివాసీ భవన్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు కేవలం లబ్ధిదారులుగానే కాక పరిశ్రమలను స్థాపించే స్థాయికి ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ రోజు మనం ప్రారంభిస్తున్నది ఒక సాధారణ కార్యక్రమం కాదు.. తెలంగాణ గ్రామీణ మహిళల భవిష్యత్తును మార్చే ఒక ఆర్థిక ఉద్యమం అని పేర్కొన్నారు. బిట్స్ పిలానీ, దేశంలోనే అగ్రశ్రేణి ఇన్నోవేషన్ ప్లాట్‌ఫాం అయిన టీ-హబ్ భాగస్వామ్యంతో రెండు ప్రత్యేక ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంక్యుబేటర్‌కు రూ.10.70 కోట్లT కేటాయించామని తెలిపారు. వీటి ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ, బ్రాండింగ్, మార్కెటింగ్, డిజిటల్ సపోర్ట్, ఫైనాన్షియల్ గైడెన్స్, బిజినెస్ మెంటారింగ్ వంటి సేవలు అందించనున్నట్లు చెప్పారు. 300మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. గ్రామీణ వ్యాపారాలకు ప్రపంచ మార్కెట్ అవకాశాలు కల్పించడమే ఈ ఇంక్యుబేటర్ల లక్ష్యం అని మంత్రి చెప్పారు. ఇప్పటికే 6.43 లక్షల మంది మహిళలు వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, వారి వ్యాపారాలను మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఎస్‌హెచ్‌జీ యాప్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. మహిళలపై వడ్డీ భారం తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని వెల్లడించారు. ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.60 వేల కోట్లకుపైగా బ్యాంకు లింకేజీ రుణాలు అందించామన్నారు. మధిరలో మహిళలకు రూ.3 కోట్లతో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి నెలకు రూ.5 లక్షల ఆదాయం వచ్చేలా చేశామని, మహిళలు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులు నెలకు రూ.4 లక్షల వరకు లాభాలు ఆర్జిస్తున్నాయని చెప్పారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా 554 మంది మహిళలకు రూ.6 కోట్ల సహాయం అందించగా వారు 15 రోజుల్లోనే రూ.9.5 కోట్ల వ్యాపారం నిర్వహించారని తెలిపారు. ఫుడ్ ట్రక్కులు, ఫిష్ మొబైల్ ట్రక్కులు వంటి సులభమైన వ్యాపార నమూనాలను మహిళలకు అందిస్తున్నామని వెల్లడించారు. గ్రామాల్లో మహిళలు తయారు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు సైతం చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. చేర్యాల మహిళలు తయారు చేసిన చింతగింజల మాస్క్‌లు నెదర్లాండ్స్ వరకు ఎగుమతి కావడం రాష్ట్ర మహిళల సృజనాత్మకతకు నిదర్శనమన్నారు. మేడ్ ఇన్ తెలంగాణ – మేడ్ బై ఉమెన్ అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలని మంత్రి ఆకాంక్షించారు. మహిళలకు ప్రభుత్వం అవకాశాలు కల్పించడమేకాక అవకాశాలను అందిపుచ్చుకునే ధైర్యాన్ని కూడా కల్పిస్తోందని చెప్పారు. ప్రతి గ్రామంలో ఒక మహిళా వ్యాపారవేత్త తయారవ్వాలని, ఒక మహిళ విజయం మరొకరికి స్ఫూర్తిగా మారాలని పిలుపునిచ్చారు. అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా చదువు రాని మహిళలకు విద్య అందిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేర్లపైనే మంజూరు చేస్తున్నామని తెలిపారు. మహిళలను గౌరవించడం అంటే సమాజాన్ని గౌరవించడం అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్ర మహిళలు దేశానికి ఆదర్శంగా నిలవాలని, గ్రామీణ మహిళల చేతుల్లో పరిశ్రమల జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, టీ-హబ్ సీఈఓ కవికృత్, విjáYT హబ్ సీఈఓ సీత పల్లచోల, సెర్ప్ నాన్‌ఫామ్ డైరెక్టర్ జాన్సన్, డీఆర్‌డీవో ప్రతినిధులు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, పలు రంగాల నిపుణులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





