– డీజీపీ ఆనంద్
– 57 మంది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉద్యోగులకు నియామక పత్రాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: నేరాల దర్యాప్తులో నేరస్థుడిని ఎంత కష్టపడి పట్టుకున్నా, శాస్త్రీయ ఆధారాలు, ఫోరెన్సిక్ సైన్స్ నివేదికలు పటిష్టంగా లేకపోతే కోర్టులో కేసులు బలహీనపడే అవకాశం ఉంటుందని తెలంగాణ డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ అన్నారు. నేర నిరూపణలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన 57 మంది ఫోరెన్సిక్ ఉద్యోగులకు సోమవారం డీజీపీ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో అమల్లోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా శాస్త్రీయ దర్యాప్తు ప్రమాణాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఫోరెన్సిక్ నిపుణులు అందించే నివేదికలే చార్జిషీట్‌కు కోర్టులో కేసు నిరూపణలో ప్రధాన ఆధారమవుతాయని, వీటికి ప్రాధాన్యం అత్యంత ఎక్కువగా ఉంటుందని డీజీపీ తెలిపారు. శాస్త్రీయ ఆధారాలు బలంగా లేకపోతే నేరస్థులు శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయని అన్నారు. కోర్టు విచారణ విధానం, సాక్ష్యాలను ప్రవేశ పెట్టడంలో , కొత్త చట్టాల ప్రకారం పాటించాల్సిన నిబంధనలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి ఫోరెన్సిక్ నివేదిక అత్యంత నాణ్యతతో, నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు. పెరుగుతున్న నేరాలకు అనుగుణంగా ప్రస్తుతం ఫోరెన్సిక్ సిబ్బంది సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే అవసరమైన ఆధునిక పరికరాలు, కెమికల్స్, ఇతర మెటీరియల్‌ను సమకూర్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. నూతనంగా నియమితులైన 57 మందిలో 36 మంది పీహెచ్‌డీ, 15 మంది ఎంటెక్ పట్టభద్రులు ఉండటం సంతోషకర విషయమని డీజీపీ పేర్కొన్నారు. వారి విద్యార్హతలు ఫోరెన్సిక్ విభాగ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి & టీజీఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. పరిమిత సిబ్బందితోనే ఫోరెన్సిక్ ల్యాబ్ 80 శాతానికి పైగా కేసులను పరిష్కరిస్తోందన్నారు. దేశంలో అత్యధికంగా ఫోరెన్సిక్ నివేదికలను అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని తెలిపారు. 2025లో మొత్తం 18,647 కేసులను పరిష్కరించి 86 శాతం డిస్పోజల్ రేటు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రాధాన్య కేసుల్లో నిర్ణీత గడువులోనే ఫోరెన్సిక్ నివేదికలు అందజేస్తున్నామని వివరించారు. డీఎన్‌ఏ విశ్లేషణ, కంప్యూటర్ ఫోరెన్సిక్స్, నార్కోటిక్స్, టాక్సికాలజీ తదితర విభాగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందిస్తున్నామని తెలిపారు. డిజిటల్ సాక్ష్యాల పరిశీలన, మాదకద్రవ్యాల కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ల్యాబ్‌ను మరింత ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ సంస్థలతో కలిసి పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూ గుర్తింపును కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన 57 మంది సైంటిఫిక్ ఆఫీసర్స్ లో 36 మంది పీహెచ్‌డీలు, 12 మంది ఎంఎస్సీ, ఆరుగురు ఎం.టెక్, ముగ్గురు ఎంసీఏ పట్టభద్రులు ఉన్నారు. వీరి నియామకంతో ల్యాబ్ సామర్థ్యం మరింత పెరిగి, పోలీసు శాఖకు శాస్త్రీయ ఆధారాలతో కూడిన వేగవంతమైన ఫోరెన్సిక్ సేవలు అందనున్నాయని అధికారులు తెలిపారు. టీజీఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు లభించగా, సమాచార సాంకేతిక చట్టం–2000లోని సెక్షన్ 79ఏ కింద ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ప్రభుత్వ పరీక్షా సంస్థగా గుర్తింపు పొందింది. 57 మంది శాస్త్రీయ సిబ్బంది నియామకంతో తెలంగాణలో ఫోరెన్సిక్ సామర్థ్యాలు మరింత బలోపేతమై, నేరాల దర్యాప్తు వేగవంతం కానుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ జాయింట్ డైరెక్టర్లు మధుశ్రీ, రవికుమార్ గౌడ్, దార్మిత, అసిస్టెంట్ డైరెక్టర్లు తో పాటు ఉన్నతాధికారులు, తెలంగాణ పోలీస్ శాఖ అధికారులు, నూతనంగా నియమితులైన ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




