– గవర్నర్ శివప్రతాప్ శుక్లా
– చంచల్‌గూడలో జైలు మ్యూజియం, ఫీల్ ది జైల్ ఎక్స్‌పీరియన్స్ ప్రారంభం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12: తెలంగాణ జైలు మ్యూజియం స్థాపన రాష్ట్ర కారాగార పరిపాలన చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. హైదరాబాద్ చంచల్‌గూడలో జైలు మ్యూజియం, ప్రత్యేకమైన ఫీల్ ది జైల్ ఎక్స్‌పీరియన్స్/జైలు అనుభవం కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఒకప్పుడు దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా జైళ్లు ప్రధానంగా శిక్షా కేంద్రాలుగా ఉండేవని, ఖైదీలు తీవ్రమైన శారీరక, మానసిక కష్టాలను అనుభవించేవారని తెలిపారు. అలాంటి కఠినమైన జైలు విధానాలు స్వాతంత్య్రం అనంతరం కూడా కొనసాగినట్లు గుర్తు చేశారు. కాలక్రమేణా జైలు వ్యవస్థలు శిక్షా కేంద్రాల నుంచి సంస్కరణ, పునరావాసం, మానవీయత, గౌరవం కలిగిన మార్పు కేంద్రాలుగా రూపాంతరం చెందాయన్నారు. ఆ పరిణామ క్రమాన్ని తెలంగాణ జైలు మ్యూజియం అద్భుతంగా ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఈ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేసిన తెలంగాణ కారాగార శాఖను గవర్నర్ అభినందించారు. ముఖ్యంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డాక్టర్ సౌమ్యామిశ్రా, ఆమె బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. మ్యూజియం చారిత్రక వస్తువుల సమాహారం మాత్రమే కాక న్యాయం, శిక్ష, సంస్కరణ మానవీయ మార్పునకు చరిత్రగా నిలుస్తుందని తెలిపారు. పెయింటింగ్ గ్యాలరీలు, పాత బ్యారక్‌ల నమూనాలు, గొలుసులు, సంకెళ్లు, ఉరికంబాలు, అరుదైన జైలు వస్తువులు, ఆడియో-విజువల్ ప్రదర్శనల ద్వారా పూర్వకాల జైలు జీవితం, ఆధునిక సంస్కరణాత్మక జైలు వ్యవస్థల పరిణామాన్ని ప్రజలు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జైలు జీవితం, క్రమశిక్షణ, ఖైదీల పరిస్థితులు, కారాగార పరిపాలనపై అవగాహన పెరుగుతుందన్నారు. ఇది చట్టాల పట్ల గౌరవం, బాధ్యత, మానవీయత, సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. తెలంగాణ కారాగార శాఖ ఖైదీల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, జైలు పరిశ్రమలు, వ్యవసాయం, పునరావాస కార్యక్రమాలు, సమాజంలో పునఃకలయిక వంటి రంగాల్లో చేపడుతున్న సంస్కరణాత్మక చర్యలను గవర్నర్ అభినందించారు. డాక్టర్ సౌమ్యామిశ్రా మాట్లాడుతూ జైలు మ్యూజియం అవగాహన, విద్య, పరిశోధన, చారిత్రక అధ్యయనం కోసం సమగ్ర కేంద్రంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి జైలు మ్యూజియం పాత భవనాలు దెబ్బతినడంతో దాన్ని మూసివేశారని, అనంతరం ఆధునిక రూపంలో చంచల్‌గూడలో ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రాచీన శిక్షా విధానాల నుంచి ఆధునిక సంస్కరణాత్మక కారాగార వ్యవస్థల వరకు జరిగిన పరిణామాన్ని వివిధ గ్యాలరీలు, పాత జైలు నమూనాలు, చారిత్రక వస్తువులు, శిక్షా విధానాల ప్రదర్శనలు, పునరావాస కార్యక్రమాల ద్వారా మ్యూజియం చూపిస్తోందని ఆమె వివరించారు. నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మాణ సమయంలో (1961-1968) ఖైదీలు ఓపెన్ ఎయిర్ జైల్లో ఉండి దేశ నిర్మాణంలో చేసిన సేవలను మ్యూజియంలోని ప్రత్యేక విభాగం ప్రదర్శిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు 24 గంటలు/12 గంటల చెల్లింపు ఆధారిత జైలు అనుభవం కల్పిస్తున్నామని, ఇందులో జైలు వసతి, జైలు భోజనం, క్రమశిక్షణ, రోజువారీ కార్యకలాపాలు, నియంత్రిత జైలు జీవన విధానం ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమం వినోదం కోసం కాక అవగాహన, సహానుభూతి, బాధ్యత, మానవీయ విలువలు, కారాగార సంస్కరణలపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ మ్యూజియం, అనుబంధ కార్యక్రమాలు ప్రజా అవగాహన, జైలు సంస్కరణలు, పునరావాస కార్యక్రమాలకు జాతీయస్థాయిలో ఆదర్శంగా నిలవడమేకాక పర్యాటకం, ఆర్థిక కార్యకలాపాలు, ఖైదీల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికి కూడా దోహదపడతాయని డీజీ తెలిపారు. ప్రజల సందర్శన కోసం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్స్ కు వెబ్‌సైట్ www.telanganajailexperience.com ను ప్రారంభించినట్లు, వివరాలు, బుకింగ్స్ కోసం ఈ-మెయిల్: telanganafeelthejail@gmail.com, ఫోన్: 91 94946 32046ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఐజీ -ప్రిజన్స్ ఎన్.మురళీబాబు, డీఐజీ- ప్రిజన్స్ డాక్టర్ డి.శ్రీనివాస్, హైదరాబాద్ రేంజ్ ఎం.సంపత్, డీఐజీ ప్రిజన్స్ వరంగల్ రేంజ్ ఎన్.శివకుమార్ గౌడ్, సూపరింటెండెంట్ సెంట్రల్ ప్రిజన్ చంచల్‌గూడ డి.భరత్, సూపరింటెండెంట్ పీఏసీ చర్లపల్లి జి.ప్రమోద్, సూపరింటెండెంట్ సెంట్రల్ జైలు చర్లపల్లి టి.లక్ష్మీశ్రీనాథ్, సూపరింటెండెంట్ స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్ హైదరాబాద్ ఎస్.శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ సికా(ఎస్‌ఐసీఏ) తదితర అధికారులు, సిబ్బంది, ఆహ్వానితులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





