2న ఆదిలాబాద్‌లో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లు

– క్యూర్ పరిధిలో 5 నుంచి 8 కి.మీ పరిధిలోనే..
– నియోజకవర్గం యూనిట్‌గా స్థలాల గుర్తింపు
– డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుపై స్పెషల్ డ్రైవ్
– నెలాఖరులోగా నగరంలో స్ధలాలు కలిగిన వారికి ఇళ్ల పత్రాలు
– ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సమీక్షలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి తమ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడతను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం దూరదృష్టి లేకుండా నగరానికి దూరంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించడం వల్ల జరిగిన నష్టం కళ్లముందే కనిపిస్తున్నదని, అలాంటి తప్పు పునరావృతం కాకుండా పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కి.మీ పరిథిలోనే ఇందిరమ్మ ఇండ్లT నిర్మించే విధంగా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని పభుత్వ స్థలాలు, మురికివాడలు, భూదాన్, వివిధ పథకాల కింద నిర్మించిన ఇళ్లు శిధిలావస్థలో ఉన్న ప్రాంతాలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు.

ఆ ఇండ్లపై స్పెషల్ డ్రైవ్

2బిహెచ్‌కె ఇండ్లకు లబ్ధిదారులను కేటాయించడానికి యుద్ధప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తి అయిన వాటికి, వివిధ నిర్మాణ దశల్లో ఉన్న వాటికి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులను గుర్తించాలని, అది కూడా ఆ కాలనీలకు 5 నుంచి 8 కి.మీ లోపు ఉన్న వారినే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణాలన్నీ పూర్తయిన ఇండ్లలో లబ్ధిదారులు ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఈ కాలనీల్లో మంచినీరు, డ్రైనేజి, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కల్పనకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ పరిధిలో ఇండ్ల స్ధలాలు ఉండి అర్హులైన లబ్దిదారులకు ఈనెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. పీడీలు తమ పరిధిలో గతంలో నిర్మించిన జెఎనఎన్‌యుఆరఎం, రాజీవ్ గృహకల్ప, వాంబే, హౌసింగ్ కాలనీలన్నిటినీ సందర్శించాలని స్పష్టంగా నిర్దేశించారు.

అంగుళం అన్యాక్రాంతమైనా సహించేది లేదు

అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో యుఎల్‌సి భూములు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్దంగా కొంత భాగాన్ని రిజిస్ట్రేషన్ చేశారని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకు రాగా వెంటనే సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. శాశ్వత భవనాలు లేని ఆర్డీవో, తహశీల్దార్, సబ్ రిజస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్టు సరిహద్దు వివాదాలకు ముగింపు పలికేలా రెండు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పరిశ్రమలు, ఐటి శాఖలు, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ముఖ్యమైనదన్నారు. ఇది పకడ్బందీగా అమలవుతున్నదని, ఈ పథకాన్ని ఇదేవిధంగా ముందుకు తీసుకెళ్లాలని, పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పేదరికమే అర్హతగా లబ్దిదారుల ఎంపిక చేపడుతున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. తాము ఎలాంటి భేషజాలకు పోవడం లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్లు ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. శాసనసభ స్పీకర్ జి.ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ శాసనసభలో తీసుకున్న నిర్ణయం మేరకు సమావేశాలు నిర్వహించడం పట్ల మంత్రికి అభినందనలు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం చాలా గొప్పగా అమలు అవుతున్నదని, జిల్లాస్థాయిలో కలెక్టర్లు ప్రతివారం ఈ పథకాన్ని సమీక్షించి పేదలకు మేలు కలిగేలా చూడాలని అన్నారు. హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి మహ్మద్ అజారుద్దీన్, శాసన మండలిలో చీఫ్ విప్ పి.మహేందర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *