‘ధరణి’ కంటే దరిద్రంగా ‘భూభారతి’

– 22ఎ జాబితాతో 50 లక్షల మందికి తీవ్ర అన్యాయం
– సిద్దిపేట నిరసన కార్యక్రమంలో ప్రభుత్వంపై ధ్వ‌జ‌మెత్తిన బీజేపీ 
– వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి న్యాయ విచారణ జరిపించాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డిమాండ్‌

సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 31 : రాష్ట్రంలో రైతుల భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మండిపడ్డారు. 22ఎ నిషేధిత భూముల జాబితా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీ రఘునందన్ రావుతో కలిసి సిద్దిపేటలో సోమ‌వారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు రైతు భరోసా ₹15,000 ఇస్తామని, కౌలు రైతులకు కూడా సహాయం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేడు వారిని పూర్తిగా గాలికొదిలేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నది కౌలు రైతులేనని అన్నారు. మరోవైపు సాధారణ రైతులు తమ భూములను కాపాడుకోలేక, అమ్ముకోలేక, చివరకు బ్యాంకుల నుండి రుణం కూడా పొందలేక తీవ్ర వేదనకు గురవుతున్నారని తెలిపారు.

ధరణి కంటే ‘భూభారతి’ అత్యంత దారుణం

గత ప్రభుత్వం ‘ధరణి’ పేరుతో రైతులను కష్టాలపాలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘భూభారతి’ అంతకంటే దరిద్రంగా తయారైందని రామచందర్ రావు విమర్శించారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సిద్దిపేట వంటి ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలు, ప్లాట్లు 22-ఎ నిషేధిత జాబితాలోకి వెళ్లాయని, దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది నరకం అనుభవిస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పిల్లల చదువులు, ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం భూములు అమ్ముకోలేక కుటుంబాలు అభద్రతాభావంతో కాలం వెళ్లదీస్తున్నాయన్నారు.

పాలకులు మారినా దోపిడీ మారలేదు

ఇందులో తప్పు జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని, అలాంటప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ.. ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్గా పేర్లు మారాయి తప్ప ప్రజల కష్టాలు మాత్రం తీరలేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి పరిపాలన కంటే రియల్ ఎస్టేట్‌పైనే ఎక్కువ ఆసక్తి ఉందని, భూ వివాదాలు సృష్టిస్తూ పేదల భూములను లాక్కోవడమే కాంగ్రెస్ నైజమని విమర్శించారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి

భూములను 22u జాబితాలో ఎందుకు చేర్చారో పూర్తి వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రామ‌చంద‌ర్‌రావు డిమాండ్ చేశారు. 22ఎ గందరగోళం వెనుక ఉన్న కుట్రలు, ఎవరికి ప్రయోజనం చేకూరుతున్న‌దనే అంశంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలన్నారు. బాధిత రైతులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటం చేస్తుందని ఆయ‌న స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *