మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రాధాన్యత

– ప్రమాదవశాత్తు మరణం, వికలాంగతకు రూ.5 లక్షల వరకు బీమా
– మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి శ్రీహరి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 10 : రాష్ట్రంలోని 4,21,767మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం(జీఏఐఎస్) అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పశు సంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసుల, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి భద్రత, సామాజిక రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2026-27లో 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల 4,21,767 మంది నమోదిత మత్స్యకారులు ఈ పథకం పరిధిలోకి వస్తారని మంత్రి వెల్లడించారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.79.96 బీమా ప్రీమియం ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ప్రీమియం భరిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21,34,79,673 చెల్లిస్తుందని, తద్వారా అర్హులైన మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు. బీమా పథకం ద్వారా అందే ప్రయోజనాలు ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే రూ.5.00 లక్షలు, శాశ్వత సంపూర్ణ వైకల్యానికి రూ.5.00 లక్షలు, శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.2.50 లక్షలు, ప్రమాదవశాత్తు హాస్పిటల్‌లో చికిత్స పొందితే గరిష్ఠంగా రూ.25,000 వరకు వైద్య సహాయం 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పాలసీ కాలంలో అర్హులైన ప్రతి నమోదిత మత్స్యకారుడికి నిరంతర బీమా రక్షణ అందేలా మత్స్య శాఖ అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి వాకిటి తెలిపారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రమాద సమయంలో అండగా నిలవడంతోపాటు వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం కీలకమైనదన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *