– గంటలతరబడి ప్రయాణం వెన్నుపై భారం
– ల్యాప్ టాప్‌లతో ఐటీ ఉద్యోగులకు మెడ నొప్పి
– మొబైల్ ఫోన్లతో చిన్నారులకూ సమస్యలు
– కేర్ హాస్పిటల్స్ వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: గంటలతరబడి ట్రాఫిక్‌లో ప్రయాణాలు.. గుంతల రోడ్లపై కుదుపులు.. ఆఫీసుకు చేరాక అదేపనిగా కంప్యూటర్ల ముందు కూర్చోవడం.. ఇవన్నీ వెన్ను, మెడ నొప్పులకు కారణమవుతున్నాయని కేర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం, ట్రాఫిక్‌లో తరచూ బ్రేకులు వేయడం, గతుకుల రోడ్లపై ప్రయాణించడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ఈనెల 16న ప్రపంచ వెన్నెముక దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది జీవితాంతం వెన్నెముక ఆరోగ్యం అనే నినాదంతో వెన్నెముక సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. సరైన భంగిమలో కూర్చోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వెన్ను, మెడ నొప్పులు ఎక్కువకాలం కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం అవసరమని సూచించారు. వెన్నునొప్పి ప్రస్తుతం అన్ని వయసుల వారినీ వేధిస్తున్న సమస్యగా మారింది. గతంలో వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించే ఈ సమస్య ఇప్పుడు యువతలోనూ కనిపిస్తోంది. గంటల తరబడి కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, సరైన భంగిమలో కూర్చోకపోవడం వంటి అలవాట్లు మెడ, వెన్నునొప్పులకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా గుంతలు, స్పీడ్ బ్రేకర్లు ఉన్న రోడ్లపై తరచూ ప్రయాణించడం వల్ల ఇప్పటికే వెన్నెముక సమస్యలున్న వారిలో నొప్పి మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
సమస్యలున్న వారిలో నొప్పి పెరగవచ్చు 
బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్స్, క్లినికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్, న్యూరో ఇంటర్వెన్షనిస్ట్, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ డాక్టర్ రణధీర్ కుమార్ మాట్లాడుతూ ‘‘చాలామందికి ఆఫీసుకు చేరకముందే వెన్నుపై ఒత్తిడి మొదలవుతోంది. ట్రాఫిక్‌లో ఎక్కువసేపు కూర్చోవడం, గుంతల రోడ్లపై ప్రయాణించడం వల్ల మెడ, వెన్నునొప్పులు తీవ్రమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు రోడ్లపై కుదుపుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కారణాల వల్ల తప్పనిసరిగా తీవ్రమైన వెన్నెముక వ్యాధులు వస్తాయని చెప్పలేం. ఇప్పటికే సమస్యలున్న వారిలో నొప్పి పెరగవచ్చు. తరచూ నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి అని సూచించారు. రోజుకు ఎనిమిది నుంచి పది గంటలపాటు ల్యాప్‌టాప్‌ల ముందు పనిచేసే ఐటీ ఉద్యోగుల్లో మెడ, భుజాలు, వెన్నునొప్పులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. సరైన భంగిమలో కూర్చోకపోవడం, విరామం లేకుండా పనిచేయడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. మరోవైపు చిన్నారులు గంటల తరబడి తల వంచి మొబైల్ ఫోన్లలో వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వల్ల మెడనొప్పి, భుజాల నొప్పి, శరీర భంగిమకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించారు. శారీరక వ్యాయామం లేకుండా ఈ అలవాట్లు కొనసాగితే నొప్పులు తరచూ వేధించే అవకాశం ఉందన్నారు.
నిద్రపోయే విధానం కూడా వెన్నెముక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొన్నారు. మెడకు సరైన ఆధారం లేని దిండ్లు, అనువుగా లేని పరుపులు, అసౌకర్యమైన భంగిమల్లో నిద్రపోవడం వల్ల ఉదయం లేవగానే మెడ, వెన్ను పట్టేసినట్లు అనిపించవచ్చన్నారు. వెన్నునొప్పి కారణంగా నిద్ర, ఏకాగ్రత, ఉద్యోగ పనితీరు, రోజువారీ జీవనంపై ప్రభావం పడవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వైకల్యానికి దారితీసే ప్రధాన కారణాల్లో నడుమునొప్పి అగ్రస్థానంలో ఉంది. సాధారణ కండరాల నొప్పి నుంచి డిస్క్ సమస్యలు, నరాలపై ఒత్తిడి వరకు వివిధ కారణాలతో వెన్నునొప్పి రావచ్చని వైద్యులు వివరించారు.
జీవనశైలిలో మార్పులతో ఉపశమనం 
కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీకి చెందిన సీనియర్ కన్సల్టెంట్ మినిమల్లీ ఇన్వాసివ్ అండ్ డిఫార్మిటీ స్పైన్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ గోపరాజు మాట్లాడుతూ.. ‘‘ప్రతి మెడనొప్పి, వెన్నునొప్పికి శస్త్రచికిత్స అవసరం లేదు. చాలామందికి మందులు, ఫిజియోథెరపీ, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు, జీవనశైలిలో మార్పులతో ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులు కూర్చునే భంగిమపై శ్రద్ధ పెట్టాలి. మధ్యమధ్యలో లేచి నడవాలి. పిల్లలు మొబైల్ ఫోన్లతో గడిపే సమయాన్ని తగ్గించి బయట ఆడుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. క్రమం తప్పకుండా నడక, వ్యాయామం చేయడం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం వెన్నెముక ఆరోగ్యానికి మేలు చేస్తాయి” అని తెలిపారు. ప్రయాణాల సమయంలో నడుముకు సరైన ఆధారం ఉండేలా చూసుకోవాలని, సుదీర్ఘ ప్రయాణాల్లో సురక్షితమైన చోట విరామం తీసుకుని కొద్దిసేపు నడవాలని వైద్యులు సూచించారు. కాళ్లలో బలహీనత పెరగడం, గజ్జల ప్రాంతంలో స్పర్శ తగ్గడం, మూత్రం లేదా మల విసర్జనపై అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




