డ్రగ్స్ కట్టడికి ‘పీడీ యాక్ట్’ ?

  • డీజీపీ సీవీ ఆనంద్‌ హెచ్చరిక
  • విద్యాసంస్థల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలదే బాధ్యత
  • సరఫరాదారుల ఆస్తుల సీజ్‌.. ‘ఈగల్ ఫోర్స్’ బలోపేతం
  • డీజీపీ హోదాలో తొలిసారిగా నార్కోటిక్స్ విభాగాంపై సమీక్ష

‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 7 : రాష్ట్రంలో డ్రగ్స్‌ను పూర్తిగా ‌కట్టడి చేయడమే తమ తొలి ప్రాధాన్యమని డీజీపీ సీవీ ఆనంద్‌ ‌(DGP CV Anand) స్పష్టం చేశారు. రిపీటెడ్‌గా డ్రగ్స్ ‌కేసులో పట్టుబడితే పీడీ యాక్ట్ ‌తరహా చట్టాన్ని ఉపయోగిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గురువారం తొలిసారిగా ఈగల్‌ ‌ఫోర్స్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్‌ ‌మాట్లాడుతూ.. పోలీస్‌ ‌శాఖలోని 35 విభాగాలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. నార్కోటిక్స్‌పై అలర్ట్‌గా ఉన్నామని.. డ్రగ్స్ ‌కట్టడి చేయడంలో మొదటి ప్రాధాన్యతతో ఉన్నామన్నారు. ఈగల్‌ ‌ఫోర్స్ ‌ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఆపరేషన్‌లు నిర్వహించడం ద్వారా నిందితులను అరెస్ట్ ‌చేసి.. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ ‌స్వాధీనం చేసుకుని సీజ్‌ ‌చేశామన్నారు. డ్రగ్స్ ‌విషయంలో సరఫరాతోపాటు డిమాండ్‌.. ఈ ‌రెండింటిపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ఈగల్‌లో సిబ్బంది కొరత ఉందన్నారు. సివిల్‌ ‌ఫోర్స్ అవసరం కూడా ఉందని చెప్పారు. డ్రగ్స్ ‌సప్లయర్స్ ఆస్తులను సీజ్‌ ‌చేయడం వంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్‌ ‌ప్రకటించారు. జిల్లాలో కమిషనర్లు, ఎస్పీలు కూడా డ్రగ్స్ ‌కట్టడిలో కీలక పాత్ర పోషించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లా స్థాయిలో నిఘా లోపించిందని ఈ సమీక్ష ద్వారా బహిర్గతమైందని చెప్పారు. నార్కోటిక్‌ ఐదు పోలీస్‌ ‌స్టేషన్‌లు మంచిగా పని చేసి, ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి యూనివర్సిటీలతోపాటు విద్యాసంస్థల్లో డ్రగ్స్ ‌దొరికితే ఆ బాధ్యత యజమాన్యాలదేనని డీజీపీ సీవీ ఆనంద్‌ ‌కుండబద్దలు కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో డీ అడిక్షన్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జిల్లాల్లో అధికారులు డ్రగ్స్ ‌కేసుల దర్యాప్తు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైందన్నారు. జిల్లాల్లో డ్రగ్స్ ‌కేసుల విచారణపై అధికారులకు ఈగల్‌ ‌ఫోర్స్ ‌ద్వారా శిక్షణ ఇస్తామని డీజీపీ సీవీ ఆనంద్‌ ‌వెల్లడించారు.

రెగ్యులర్‌గానే సిఎం కాన్వాయ్‌..  ‌ట్రాఫిక్‌ ఆపకుండా నేరుగా ప్రయాణం

తన కాన్వాయ్‌ ‌కోసం సాధారణ ప్రజలకు ఆటంకం కలిగించొద్దంటూ సీఎం రేవంత్‌రెడ్డి డీజీపీని బుధవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఆయన కాన్వాయ్‌ ‌సాధారణ ట్రాఫిక్‌లోనే ప్రయాణం చేసింది. శంషాబాద్‌ ‌విమానాశ్రయం నుంచి తన నివాసానికి రెగ్యులర్‌ ‌ట్రాఫిక్‌లోనే సీఎం వెళ్లడం విశేషం. తన కాన్వాయ్‌ ‌రాకపోకల కోసం నగరవ్యాప్తంగా ప్రజల వాహనాలను నిలిపివేయొద్దంటూ నిన్న సీనియర్‌ ‌పోలీసు అధికారులకు సీఎం ఆదేశించారు. రోడ్లపై ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యల్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ఈ నేపథ్యంలో సీఎం కాన్వాయ్‌ ‌కదలికల సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడానికి బదులుగా ట్రాఫిక్‌ ‌పోలీసులు వాహనాలను ఒకే లేన్‌లో కదలడానికి అనుమతించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *