“సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబాలు, వర్గాలు, వ్యక్తుల చుట్టూనే అవకాశాలు తిరుగుతుంటే, కొత్త ఆలోచనలతో వచ్చే యువతకు రాజకీయ ప్రయాణం ప్రారంభించే దారి ఎక్కడ? అవకాశం లేకుండా అనుభవం ఎలా వస్తుంది? అవకాశం ఇవ్వకుండా నాయకత్వం ఎలా తయారవుతుంది? ఇవి రాజకీయ పార్టీలు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు. కానీ పార్టీల్లో పనిచేసే నాయకులు తమ నాయకత్వానికి పోటీకి నిలుస్తారనే కారణం తో ఎంతో తెలివైన యువత కు అయినా ఎటువంటి అవకాశం ఇవ్వరు!..”
శ్రావ్యరెడ్డి సంకరమద్ది సామాజిక విశ్లేషకురాలు.
రాజకీయాలను ఎవరు శాసిస్తున్నారు? డబ్బు ఉన్నవారికి అధికారం… పలుకుబడి ఉన్నవారికి పదవి… వారసత్వం ఉన్నవారికి రాజకీయ భవిష్యత్తు… మరి సామాన్య యువతకు స్థానం ఎక్కడ? ప్రజాస్వామ్యం అంటే, ప్రజలు ఎన్నుకున్న నాయకులు అందించే పాలన! కానీ నేటి రాజకీయ వాతావరణాన్ని చూస్తే…రాజకీయాలను నిజంగా శాసిస్తున్నది ప్రజల అభిప్రాయమా? లేక డబ్బు, కండబలం, వ్యాపార ప్రయోజనాలు, వారసత్వ రాజకీయాలా? అన్న ఒక ఒక అసౌకర్యకరమైన ప్రశ్న ఎదురవుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ రాజకీయాల్లోకి రావడానికి సమాన అవకాశం వుంటుందని పుస్తకాల్లో గొప్పగా చదువుకున్నా, ఆచరణలో రాజకీయ రంగం సామాన్య యువతకు అంత సులభమైన వేదికగా కనిపించడం లేదన్నది సుస్పష్టం! అటువంటప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టడానికి “నాకు అవకాశం ఎవరు ఇస్తారు?” అని సగటు యువకుడు ప్రశ్నించడం సహజమే. నేటి యువతలో రాజకీయ చైతన్యం లేదనడం నిజం కాదు. సోషల్ మీడియా నుంచి ప్రజా సమస్యల వరకు, దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి అంతర్జాతీయ పరిణామాల వరకు యువతకు అవగాహన ఉంది. కానీ రాజకీయాల్లో ప్రత్యక్షంగా అడుగుపెట్టడానికి మాత్రం చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఎందుకు? రాజకీయాల్లో ఎదగడానికి ప్రతిభకంటే డబ్బు అవసరమని, ప్రజాసేవకంటే పరిచయాలు అవసరమని, ఆలోచనల కంటే వర్గబలం అవసరమన్న భావన బలీయంగా నాటుకుపోయింది.
ఇది వాస్తవం కూడా! ఈ కారణంగానే రాజకీయాలు యువతను ఆకర్షించడంలేదు. ఇదే సమస్యకు మూలం! ఎందుకంటే ఇతర రంగాల్లో అవకాశాలను సృష్టించుకోవచ్చు. రాజకీరంగంలో అది సాధ్యంకాదు! ఎందుకంటే పైకి ఎక్కే మెట్లకంటే కిందికి లాగే పాములే అధికంగా వుండటం! మిగతా రంగాల్లో తన స్వయం కృషితో పైకి వెళ్లే మార్గాలు అనేకం వుంటాయి. ఒకవేళ తప్పటడుగు వేసినా చదువుకున్న పరిజ్ఞానంతో, స్వతహాగా అభివృద్ధి చేసుకున్న నైపుణ్యంతో, అనుభవంతో పైకి ఎదగవచ్చు. కానీ రాజకీయాల్లో ఎంత ప్రతిభానైపుణ్యాలున్న ఎదుగుదల సాధ్యం కాదు. తనకంటే తక్కువ చదువు, నైపుణ్యం వున్నవారితో పోటీపడాలి. ఒక స్థాయి జ్ఞానాన్ని సముపార్జించుకున్న యువతకు ఇదెంతమాత్రం ఇష్టంకానిది! డబ్బు, రౌడీయిజం, ఎప్పటికప్పుడు ప్రత్యర్థులను దెబ్బకొట్టే కుచ్చిత రాజకీయం, ప్రతి చిన్న అంశాన్ని నానా యాగీచేసి ప్రజల్లో తన పేరు మరుగునపడకుండా చూసుకునే గడసరితరం రాజకీయానికి కావలసిన ప్రధాన అర్హతలు! చదువు నేర్పిన సంస్కారం వున్న యువత ఇటువంటి పనులు చేయడానికి ఇష్టపడదు. ఒకవేళ తెగించి ముందుకొచ్చినా సరైన గాడ్‌ఫాదర్ లేకపోతే, తక్కువ స్థాయి సంస్కారం వున్న రాజకీయ నాయకులు అట్టడుగుకు తొక్కేస్తారు.
చదువు సంస్కారం వున్నవారు పైకి వస్తే తమకు రాజకీయ మనుగడ వుండదన్న భయమే ఇందుకు కారణం! రాజకీయ పార్టీల్లో కొత్త తరానికి అవకాశాలు పరిమితమవడానికి ఇదే ప్రధాన కారణం! సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబాలు, వర్గాలు, వ్యక్తుల చుట్టూనే అవకాశాలు తిరుగుతుంటే, కొత్త ఆలోచనలతో వచ్చే యువతకు రాజకీయ ప్రయాణం ప్రారంభించే దారి ఎక్కడ? అవకాశం లేకుండా అనుభవం ఎలా వస్తుంది? అవకాశం ఇవ్వకుండా నాయకత్వం ఎలా తయారవుతుంది? ఇవి రాజకీయ పార్టీలు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు. కానీ పార్టీల్లో పనిచేసే నాయకులు తమ నాయకత్వానికి పోటీకి నిలుస్తారనే కారణం తో ఎంతో తెలివైన యువత కు అయినా ఎటువంటి అవకాశం ఇవ్వరు!
రాజకీయాలు వ్యాపారమా? ప్రజాసేవా?
రాజకీయాల్లోకి రావడం అంటే ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం. ప్రజల తరఫున ప్రశ్నించడం. వ్యవస్థను జవాబుదారీగా నిలబెట్టడం. కానీ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఆర్థిక సామర్థ్యం, గడుసుతనం, ఎదుటివారిని తొక్కేసే సామర్థ్యం, చాణక్యం వంటివి అవసరం! ఇవన్నీ వున్నా సరైన ఛరిష్మా లేకపోతే, ఎన్నికల్లో పరాజయమే ఎదురవుతుంది. అన్నీ తట్టుకొని నిలబడినా పార్టీ లో పదవులు అయినా గానీ, స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే టిక్కెట్ దొరకడం…ఎన్నికల్లో గెలవడం…మంత్రిపదవి రావడం వంటివి జరగాలంటే చాలా జీవితాన్ని కోల్పోవాల్సి వుంటుంది. డబ్బుపోతే సంపాదించుకోవచ్చు…కానీ విలువైన జీవితం నష్టపోతే తిరిగిరాదు! అందువల్లనే రాజకీయాలు ఖరీదైనవి మాత్రమే కాదు, విలువైన జీవితాన్ని నిర్వీర్యం చేసేవి కూడా! డబ్బు ఛరిష్మాతో పాటు ప్రతిభ కూడా వున్న యువకుడు తన ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలగాలి. ప్రజామోదం లభిస్తే ఎన్నికల్లో గెలుస్తాడు! లేకపోతే మరో ఐదేళ్లు ఆగాల్సిందే! ఇదిట్లా కొనసాగుతూనే వుంటుంది. ఇదే ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న పెద్ద సవాలు. దీన్ని అధిగమించాలంటే ప్రజాస్వామ్యంలో ఓటు కొనలేనిదిగా వుండాలి. ఇదే సమయంలో నాయకత్వం కూడా అమ్ముడుపోనిదిగా ఉండాలి. అప్పుడే యువతకు అవకాశాలు లభిస్తాయి. నిజం చెప్పాలంటే యువత రాజకీయాల్లోకి వస్తే రాజకీయ రాజకీయ చర్చల రూపురేఖలే మారిపోతాయి.
ఉపాధి ఎక్కడ? విద్యా ప్రమాణాలు ఎలా పెంచాలి?
యువతకు నైపుణ్య శిక్షణ ఎలా అందించాలి? కొత్త పరిశ్రమలు ఎలా తీసుకురావాలి?స్టార్టప్‌లకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి? ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా ఎలా అందించాలి? ప్రజల డబ్బుకు ప్రభుత్వం ఎలా జవాబుదారీగా ఉండాలి? ఇలాంటి ప్రశ్నలు రాజకీయ అజెండాలో ప్రధానంగా నిలుస్తాయి. యువతకు రాజకీయాల్లో స్థానం పెరిగితే సాంకేతికత, డేటా, పారదర్శకత, వేగవంతమైన నిర్ణయాలు, ఫలితాల ఆధారిత పాలనకు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. పాలనలో కూడా కొత్త సంస్కృతి వస్తుంది. నాయకుడు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల వద్దకు వెళ్లి, ఆ తర్వాత ఐదేళ్లు ప్రజలను కలవని రాజకీయ సంస్కృతిలో మార్పు వస్తుంది. ప్రజల సమస్యలను నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ అందుబాటులో వుంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి? ఏ పథకాలు పనిచేస్తున్నాయి? ఎక్కడ నిధులు అవసరం? ఏ ప్రభుత్వ సేవ ఆలస్యమవుతోంది? ఇవన్నీ సాంకేతిక పరిజ్ఞానంతో కొలిచి, ప్రజలకు అందుబాటులో ఉంచే పాలన వస్తుంది. “ఎంత ఖర్చు చేశాం?” అనే ప్రశ్నతో పాటు “ఎంత ఫలితం సాధించాం?” అనే ప్రశ్న కూడా పాలనలో కీలకం అవుతుంది. ఇదే యువ నాయకత్వం తీసుకురాగల ప్రధాన మార్పు. అందువల్ల యువతను రాజకీయాల్లోకి కేవలం ఆహ్వానిస్తే సరిపోదు. పార్టీలలో యువతకు నిర్ణయాత్మక బాధ్యతలు ఇవ్వాలి. స్థానిక సంస్థల నుంచి నాయకత్వాన్ని పెంచాలి. ప్రజా విధానాలు, రాజ్యాంగం, పరిపాలన, ఆర్థిక వ్యవస్థపై శిక్షణ ఇవ్వాలి.
ముఖ్యంగా యువతను పోస్టర్లు అంటించే కార్యకర్తలుగా మాత్రమే కాకుండా, విధానాలను రూపొందించే నాయకులుగా చూడాలి. యువతను కేవలం సభలకు జనాన్ని తీసుకురావడానికి ఉపయోగించుకుని, నిర్ణయాలు మాత్రం పాత రాజకీయ వర్గాలే తీసుకుంటే అది యువ నాయకత్వం కాదు. ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేసే హక్కు కాదు. ప్రజాస్వామ్యాన్ని నిర్మించే బాధ్యత కూడా. ఇప్పుడు కావాల్సింది రాజకీయాల్లో తరాల మార్పు. దేశానికి యువత అవసరం. కానీ కేవలం యువ ముఖాలు కాదు—యువ ఆలోచనలు కావాలి. కేవలం కొత్త వయస్సు కాదు—కొత్త రాజకీయ సంస్కృతి కావాలి. కేవలం కొత్త నాయకులు కాదు—కొత్త పాలనా ప్రమాణాలు కావాలి. రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తి ఎవరి కొడుకు, ఎవరి అల్లుడు, ఎంత డబ్బున్నవాడు అనే ప్రశ్నలకంటే—ఏం చదివాడు? ఏం ఆలోచిస్తున్నాడు?ప్రజల కోసం ఏం చేశాడు? రేపటి సమాజానికి ఏం చేయగలడు? అనే ప్రశ్నలు ముందుకు రావాలి.
ఒక తరం రాజకీయాలను ఖాళీగా వదిలేస్తే, ఆ ఖాళీని మరొకరు తప్పకుండా భర్తీ చేస్తారు. రాజకీయాల్లోకి రావడానికి డబ్బు మాత్రమే అర్హత కాకూడదు. కండబలం మాత్రమే బలం కాకూడదు. వారసత్వం మాత్రమే ప్రవేశపత్రం కాకూడదు. ప్రజాసేవ, ప్రజల విశ్వాసం, నిబద్ధత, జ్ఞానం, నిజాయితీ—ఇవే నాయకత్వానికి అసలైన అర్హతలుగా మారాలి. యువత రాజకీయాల్లోకి వస్తే ఆలోచనలు కొత్తబడతాయి. యువత పాలనలో భాగమైతే వ్యవస్థ మారుతుంది. ఇది కేవలం యువతకు అవకాశం ఇవ్వాల్సిన సమయం కాదు. దేశ రాజకీయాల భవిష్యత్తును యువత చేతుల్లో పెట్టాల్సిన సమయం.