“ముట్టడికి ఎవరు పిలుపునిచ్చారు? పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నదా? భారీ బందోబస్తు, ఆంక్షల మధ్య నిరసనకారులు అక్కడికి ఎలా చేరుకున్నారు? పరిస్థితి డప్పుల మోత వరకు ఎందుకు వెళ్లింది? ఉద్రిక్తత పెరగకుండా నిలువరించడంలో ఎక్కడ లోపం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకకుండా పసుపు నీళ్ల ఘటనను మాత్రమే ప్రధాన నేరంగా చిత్రీకరించడం పక్షపాత ఆరోపణలకు అవకాశం ఇస్తుంది. పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరును కూడా సమీక్షించాలి. బాధ్యత ఎవరిదైనా స్పష్టంగా నిర్ధారించాలి…”
ఎర్రవల్లి ఎపిసోడ్‌పై వేడెక్కిన రాజకీయాలు

MA, Mcj ప్రిలాన్స్ జర్నలిస్టు
9666680051
రైతు పొలానికి సాగునీరు, బోరు మోటారుకు సరిపడా కరెంటు అందించడంపై చూపాల్సిన శ్రద్ధను ప్రభుత్వం ఎర్రవల్లి రాజకీయ వివాదంపై కేంద్రీకరిస్తున్నదా? విద్యుత్ కోతలపై రైతులు ఆందోళన చేస్తుంటే, వారి సమస్యల పరిష్కారంకంటే పసుపు నీళ్లు చల్లిన ఘటనకు అధిక ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నది? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడి, డప్పుల మోత, అనంతరం జరిగిన శుద్ధి కార్యక్రమం చుట్టూ సాగుతున్న రాజకీయాలు ప్రభుత్వ ప్రాధాన్యాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజల రోజువారీ కష్టాలు ఈ వివాదంలో మరుగునపడుతున్నాయన్న ఆందోళనకు పాలకులు సమాధానం చెప్పాలి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలోని పోల్కంపల్లిలో రైతులు విద్యుత్ కోతలను నిరసిస్తూ రోడ్డెక్కారు. రోజుకు తొమ్మిది నుంచి పది గంటలు కూడా కరెంటు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. పంటకు అవసరమైన సమయంలో విద్యుత్ అందకపోతే పెట్టుబడి ప్రమాదంలో పడుతుంది. ఇటువంటి ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపించి, సరఫరాలో లోపాలను సరిదిద్దడం ప్రభుత్వ తక్షణ బాధ్యత. రైతుల నిరసనలను రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయకుండా, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి అధికారులు గ్రామాలకు వెళ్లాలి.
ఖమ్మం, సిద్దిపేట తదితర ప్రాంతాల్లోనూ విద్యుత్ కోతలపై రైతులు ఆందోళన చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సెప్టెంబరు మూడున దుబ్బాక మండలం గంభీర్‌పూర్ సబ్‌స్టేషన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి లాగ్‌బుక్‌ను పరిశీలించి సరఫరా తీరును ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే విద్యుత్ సరఫరా తగ్గిందన్న ప్రతిపక్ష ఆరోపణలకు ప్రభుత్వం గణాంకాలతో సమాధానం ఇవ్వాలి. రైతులకు వాస్తవంగా ఎన్ని గంటలు నాణ్యమైన విద్యుత్ అందుతున్నదో వెల్లడించాలి. సమస్య ఉన్నచోట పరిష్కారానికి గడువు ప్రకటించాలి.
మొత్తం ఘటనపై విచారణ జరగాలి
ఎర్రవల్లిలో కేసీఆర్ నివాసం ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వడం, నిరసనకారులు అక్కడికి చేరుకొని డప్పులు కొట్టడం, అనంతరం బీఆర్‌ఎస్ కార్యకర్తలు పసుపు నీటితో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం పరస్పర ప్రతిస్పందనలుగా జరిగాయి. ఇందులో చట్ట ఉల్లంఘన ఉంటే విచారణ జరగాల్సిందే. అయితే చివరగా జరిగిన చర్యపైనే దృష్టిపెట్టి, దానికి దారితీసిన పరిణామాలను విస్మరిస్తే విచారణ సంపూర్ణమవుతుందా? ఉద్రిక్తతకు కారణమైన ప్రతి చర్యనూ ఒకే ప్రమాణంతో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ముట్టడికి ఎవరు పిలుపునిచ్చారు? పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నదా? భారీ బందోబస్తు, ఆంక్షల మధ్య నిరసనకారులు అక్కడికి ఎలా చేరుకున్నారు? పరిస్థితి డప్పుల మోత వరకు ఎందుకు వెళ్లింది? ఉద్రిక్తత పెరగకుండా నిలువరించడంలో ఎక్కడ లోపం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకకుండా పసుపు నీళ్ల ఘటనను మాత్రమే ప్రధాన నేరంగా చిత్రీకరించడం పక్షపాత ఆరోపణలకు అవకాశం ఇస్తుంది. పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరును కూడా సమీక్షించాలి. బాధ్యత ఎవరిదైనా స్పష్టంగా నిర్ధారించాలి.
బతికున్న వ్యక్తి మరణాన్ని కోరుతూ వ్యాఖ్యలు చేయడం, ఆయన నివాసం సమీపంలో చావు డప్పుల పేరిట నిరసన నిర్వహించడం రాజకీయ సంస్కృతిని దిగజార్చే చర్యలు. కేసీఆర్ రాజకీయ విధానాలను విమర్శించవచ్చు; ఆయనను ప్రశ్నించవచ్చు. కానీ వ్యక్తిగత విద్వేషాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలను సాధారణ నిరసనగా తీసుకోవడం సమంజసం కాదు. అటువంటి చర్యలపై ప్రభుత్వం ఏం చేసిందన్న ప్రశ్నకూ సమాధానం అవసరం. అధికార పార్టీకి చెందినవారన్న కారణంతో ఎవరికీ మినహాయింపు ఉండకూడదు. స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే, వాటిపై సంబంధిత వ్యక్తిని ప్రశ్నించాలి. ఆ వ్యాఖ్యలకు కేసీఆర్ నివాసం ముట్టడితో సంబంధమేమిటి? మరోవైపు కేసీఆర్ మరణాన్ని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడారన్న ఆరోపణలపైనా అదే ప్రమాణం వర్తించాలి. ఒక పార్టీ నాయకుడి వ్యాఖ్యలకు ఆ పార్టీ అగ్రనేతల నివాసాలను లక్ష్యంగా చేసుకోవడాన్ని అనుమతిస్తే రాజకీయాలు ఎటువైపు సాగుతాయి? ఈ పద్ధతి ఎవరికీ మేలు చేయదు.
పసుపు నీటితో శుద్ధి చేయడం అభ్యంతరకరమని భావిస్తే, అందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను విచారించవచ్చు. అదే సమయంలో అంతకుముందు జరిగిన రెచ్చగొట్టే చర్యలను పరిశీలించాలి. ఒక వర్గానికి స్వేచ్ఛనిచ్చి, మరో వర్గంపై అరెస్టులు, కేసులతో స్పందిస్తున్నారనే భావన ప్రజల్లో ఏర్పడకుండా ప్రభుత్వం జాగ్రత్తపడాలి. చట్టం అమలులో సమానత్వం కనిపించినప్పుడే విచారణపై విశ్వాసం నిలుస్తుంది. అధికారానికి అనుకూలంగా వ్యవహరించిందన్న అనుమానం పోలీసుల విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.
ఫోరెన్సిక్ పరిశీలనపై స్పష్టత అవసరం
ఎర్రవల్లి ఘటనలో ఫోరెన్సిక్ పరిశీలన జరుగుతున్న నేపథ్యంలో దాని అవసరాన్ని ప్రభుత్వం వివరించాలి. నేర విచారణలో శాస్త్రీయ ఆధారాల సేకరణ సహజమే. అయితే ఇక్కడ ఏ అనుమానిత నేరాన్ని నిర్ధారించేందుకు ఆ పరిశీలన అవసరమైందో స్పష్టత ఇవ్వాలి. విచారణ ప్రక్రియ రాజకీయ ప్రచారానికి సాధనంగా మారకూడదు. ఆధారాలు, చట్టబద్ధమైన అవసరాల ప్రాతిపదికనే దర్యాప్తు సాగాలి. ప్రజలకు సమాచారం ఇవ్వడం ద్వారా అనవసర ఊహాగానాలను తగ్గించవచ్చు. రాజకీయాల్లో పాలాభిషేకాలు, శుద్ధి కార్యక్రమాలు, ప్రతీకాత్మక నిరసనలు కొత్తకావు. తెలంగాణ తల్లి విగ్రహం, మేడిగడ్డ సందర్శన వంటి సందర్భాల్లోనూ ఇటువంటి రాజకీయ ప్రతిస్పందనలు కనిపించాయి. గతంలో జరిగినంత మాత్రాన ప్రతి చర్య సమర్థనీయం కాదు. అయితే ఒకే తరహా ఘటనలపై వేర్వేరు ప్రమాణాలు అనుసరిస్తే ప్రభుత్వం ఉద్దేశాలపై సందేహాలు తలెత్తుతాయి. ఏ చర్యపై అభ్యంతరమున్నదో, ఎందుకు ఉన్నదో స్పష్టంగా చెప్పాలి. రాజకీయ అనుకూలత చట్టపరమైన నిర్ణయాలను ప్రభావితం చేయకూడదు.
తెలంగాణ ముందున్న అసలు సమస్యలు
పొలంలో నీరు లేక పంట వాడిపోతున్నప్పుడు రైతుకు రాజకీయ వాదప్రతివాదాలు ఉపశమనం ఇవ్వవు. బోరు మోటారు పనిచేయకపోతే, సకాలంలో సాగునీరు అందకపోతే అప్పుల భారం పెరుగుతుంది. వర్షాభావ ఆందోళనల మధ్య విద్యుత్, నీటి సరఫరాపై ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలి. కాళేశ్వరం ద్వారా నీటి తరలింపుపై రైతుల డిమాండ్లకు సమాధానం ఇవ్వాలి. సాగునీటి లభ్యతపై వాస్తవ పరిస్థితులను వివరించాలి. రైతులు ఏం ఆశించవచ్చో ముందుగానే తెలియజేయాలి. రైతు సమస్యలతోపాటు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు కూడా ప్రభుత్వ దృష్టిని కోరుతున్నాయి. ఫీజులు అందక చదువు కొనసాగించడంపై ఆందోళన చెందుతున్న విద్యార్థికి రాజకీయ వివాదాలతో ప్రయోజనం ఏమిటి? నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న యువతకు కావాల్సింది స్పష్టమైన నియామక కార్యాచరణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వీటిపై నిరంతర సమీక్ష జరగాలి.
ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో రాజకీయ వివాదం మొత్తం వేదికను ఆక్రమిస్తే అసలు అంశాలు మరుగునపడతాయి. కరెంటు కోతల చర్చ డప్పుల మోతకు, ఉద్యోగాల చర్చ అరెస్టులకు, ఫీజుల సమస్య శుద్ధి కార్యక్రమానికి మళ్లిపోతుంది. ఇది ఎవరు చేసినా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రభుత్వం తన పాలనా పనితీరుతో విమర్శలకు సమాధానం ఇవ్వాలి. ప్రతిపక్షం ప్రజల సమస్యలను ఆధారాలతో ముందుకు తేవాలి. పరస్పర రెచ్చగొట్టే చర్యలకు స్వస్తి చెప్పాలి. ఎర్రవల్లి ఘటనపై విచారణ జరపవద్దని చెప్పడం లేదు. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవద్దనీ కాదు. కులం, వర్గం, పార్టీతో సంబంధం లేకుండా చట్టాన్ని సమానంగా అమలు చేయాలన్నదే ప్రధాన ప్రశ్న. అదే సమయంలో పరిపాలన మొత్తం ఒక వివాదం చుట్టూ తిరగకూడదు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళల సమస్యలకు తగిన సమయం, వనరులు కేటాయించాలి. ప్రజల అవసరాలే పాలనా ప్రాధాన్యాలను నిర్ణయించాలి.
రాజకీయ ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టడం పాలనా విజయానికి కొలమానం కాదు. పంటకు నీరు అందిందా, విద్యుత్ సరఫరా మెరుగైందా, విద్యార్థికి ఫీజు అందిందా, యువతకు ఉపాధి లభించిందా అన్నవే ప్రజలకు ముఖ్యమైన ప్రశ్నలు. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఎంత తీవ్రమైనా ఈ అవసరాలు తీరవు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఫలితాలు చూపినప్పుడే ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. ఆ బాధ్యతను రాజకీయ రచ్చతో భర్తీ చేయలేరు. ఎర్రవల్లి ఉద్రిక్తతకు మూలకారణాలను తేల్చే నిష్పాక్షిక విచారణ జరగాలి. ముట్టడి పిలుపు నుంచి చివరి ప్రతిచర్య వరకు మొత్తం పరిణామక్రమాన్ని పరిశీలించాలి. పోలీసు వైఫల్యముంటే బాధ్యత నిర్ణయించాలి. ప్రజలకు కావాల్సింది ఒక పక్షాన్ని రక్షించి మరొక పక్షాన్ని దోషిగా నిలబెట్టే ప్రక్రియ కాదు. నిజాలు బయటపెట్టి, ఇటువంటి ఉద్రిక్తతలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అదే ప్రభుత్వ బాధ్యత. విచారణ న్యాయంగా సాగుతున్నదన్న భరోసా రెండు పక్షాలకూ కలగాలి.
అంతిమంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఫామ్‌హౌస్ చుట్టూ రాజకీయ యుద్ధం కాదు; పొలాల్లో నీరు, మోటార్లకు కరెంటు, చదువుకు భరోసా, యువతకు అవకాశాలు. పసుపు నీళ్లపై చూపుతున్న శ్రద్ధ పంట నీళ్లపై కూడా కనిపించాలి. డప్పుల మోతకంటే రైతు పొలంలో మోటారు మోతకు ప్రాధాన్యం దక్కాలి. రాజకీయ ప్రతిష్ఠంభనను దాటి ప్రజల జీవన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలి. అప్పుడే పాలనకు అర్థం, ప్రజలకు ప్రయోజనం ఉంటుంది.





