వికసిత్ భారత్‌వైపు దూసుకుపోతోంది

– మోదీ 12 ఏళ్ల పాలనపై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : దేశ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ ఒక కొత్త చరిత్ర సృష్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. సుమారు 4,399 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసి జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును దాటి అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగుతున్న నేతగా ప్రధాని నరేంద్ర మోదీ నిలిచారన్నారు. ఈ అరుదైన ఘనతను పురస్కరించుకుని మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లో గల శివాలయంలో రామచందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ ప్రజాసేవ, సుశాసనం, దేశ భద్రత.. ఇలా ప్రతి విషయంలోనూ మోదీ దేశాన్ని ప్రపంచ వేదికపై తలెత్తుకునేలా చేస్తున్నారని కొనియాడారు. గత పన్నెండేళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనంటూ ఆయన నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ వైపు దూసుకుపోతోందన్నారు. మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండి దేశానికి మరింతకాలం సేవలందించాలని, దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో, మండలంలో బీజేపీ కార్యకర్తలు ఈ రోజును ఒక పండుగలా జరుపుకుంటున్నారన్నారు. మోదీ పై దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ సంబరాల్లో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ రామచందర్‌రావు ధన్యవాదాలు తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *