రాష్ట్రంలో సోమవారం జరిగిన రెండు రాజకీయ పార్టీల బహిరంగ సభలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. పబ్లిక్ మీటింగ్‌లు కాస్తా ఎదురు దాడుల వేదికలుగా మారాయి. విచిత్రమేమంటే ఈ రెండు సభలు నిర్వహించిన సమయం కూడా ఒకటే. మరో విచిత్రమేమంటే ఈ రెండు సమావేశాల్లో ప్రసంగించిన వారిలో ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాగా, మరొకరు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. చంద్రశేఖర్‌రావు చాలాకాలం తర్వాత అంటే దాదాపు ఒక సంవత్సరం తర్వాత మొదటిసారిగా పబ్లిక్ మీటింగ్‌కు హాజరైనారు. అదికూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌తో తనకున్న నలభై ఏండ్ల అనుబంధాన్ని ఒదులుకుని బిఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా జగిత్యాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సభ ఏర్పాటు తేదీ సమయాన్ని ముందుగానే ప్రకటించినప్పటికీ, కాంగ్రెస్ దానిపై తన అక్కసును వెళ్ళగక్కింది. అదే సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం నస్తూర్‌లో జరిగిన సభలో రేవంత్‌రెడ్డి అదే విషయంలో తమ సభకు పోటీగా కావాలనే బిఆర్‌ఎస్ సభ నిర్వహించిందని తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. . సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు శంఖుస్థాపన, రెండవ విడుత రైతు భరోసా విడుదల, మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుకు సంబందించిన పర్యవేక్షణ కార్యక్రమంగా రేవంత్‌రెడ్డి సభ ఏర్పాటైందన్న విషయం తెలియందికాదు.
కాని, సిఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం అంతా ప్రధాన ప్రతిపక్షమైనా బిఆర్‌ఎస్‌పైనా, ఆ పార్టీ అధినేత కెసిఆర్‌పైనే ఎక్కువగా కొనసాగింది. బిఆర్‌ఎస్ పార్టీని, కెసిఆర్‌పైన ఆవేశపూరిత ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన ముఖమంతా ఎర్రబడి, ఆగ్రహమంతా ముఖంలో కొట్టవచ్చినట్లు కనిపించింది. ప్రధానంగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, తెలంగాణను భ్రష్టు పట్టించాడంటూ కెసిఆర్‌పై ఆక్రోశించారు. అదే కోపంలో ఆయన కెసిఆర్‌ను పాపాల భైరవుడిగా అభివర్ణిస్తూ, ఇలాంటి తప్పులు నిజాం కాలంలో చేసినట్లైతే చెట్టుకు కట్టేసి, లాగులో తొండలను ఒదిలేవారని, అటవిక రాజ్యమైతే చెట్టుకు కట్టేసి ఉరితీసేవారంటూ కెసిఆర్‌పైన తనకున్న వ్యతిరేక భావాన్ని వెళ్ళగక్కారు.
అదే సమయంలో జగిత్యాల్లో జరిగిన సభలో కెసిఆర్ దానికి సమాధానమన్నట్లుగా రేవంత్‌రెడ్డి పేరు ఎత్తకుండానే ‘పొద్దునలేస్తే తన చావును కోరుకుంటున్న’ విధానంపైన ఆయన కూడా ఆవేశపూరితంగా మాట్లాడారు. నువ్వు వెయ్యి జన్మలెత్తినా చావను.వెధవలు చావాలని పదేపదే అంటే కెసిఆర్ చస్తడా ? ఇక్కడి దరిద్రం పోయే దాకా పని చేస్తూనే ఉంటా. ఉట్టిమీది కుండ ఎప్పుడు జారిపడుతుందోనని ఎదిరి చూస్తున్న పిల్లి సామెతను చెప్పి, రేవంత్ పేరు ప్రస్తావించకుండానే ఆయన తన చావు కోసం అలా ఎదురు చూస్తున్నాడంటూ నర్మగర్భంగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం చూసి తిరిగి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్న ప్రజలు ‘కాంగ్రెస్ పోవాలి- బిఆర్‌ఎస్ రావాలంటూ ’చేస్తున్న నినాదాలను గుర్తుచేశారు.
దానికి సమాధానమన్నట్లు రేవంత్‌రెడ్డి ఎట్టి పరిస్థితిలో బిఆర్‌ఎస్‌ను అధికారంలోకి రానిచ్చే ప్రసక్తే లేదు. శాసనసభ ఎన్నికల నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికలన్నిటిలో ఆ పార్టీకి గోరీ కట్టాం. 2029 ఎన్నికల్లో కూడా అదే పునరావృతమవుతుంది. ఈ పాపాల భైరవుడు రావద్దనే ప్రజలు కోరుకుంటున్నారు. నిజంగానే దమ్ముంటే 2029 ఎన్నికల్లో ‘నువ్వా నేనా తేల్చుకుందాం రా..’ అంటూ రేవంత్‌రెడ్డి కెసిఆర్‌కు సవాల్ విసిరారు. అలాగే ఇప్పటివరకు బిఆర్‌ఎస్ ప్రతిపక్షపార్టీ కొనసాగుతున్ నదని ,వొచ్చే ఎన్నికల్లో అది కూడా లేకుండా చేస్తానని ప్రజల సాక్షిగా ఆయన శపథం చేయడంతో రాష్ట్రంలో ఈ రెండు సభల పర్యవసానాలపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
భవిష్యత్‌లో రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చేది తామేనని చెప్పుకుంటున్న బిజెపి, మరో నాలుగు రోజుల్లో పార్టీని ఏర్పాటు చేయబోతున్న జాగృతి అధినాయకురాలు కవిత కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీల తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలు, రాష్ట్ర అభివృద్థిని పక్కకు పెట్టి బలప్రదర్శనకే పరిమిత మయ్యాయన్నారు. కాంగ్రెస్ పిట్టకథలు, బిఆర్‌ఎస్ ఉట్టికథలు చెప్పి కాలక్షేపంచేశాయని కవిత ఘాటుగా స్పందించడం కొసమెరుపు. వృద్ద నాయకుడిని వదులుకున్న కాంగ్రెస్, వృద్ధ నాయకుడిని భుజానికి ఎత్తుకున్న బిఆర్‌ఎస్‌లు యువతను మర్చిపోయాయంటున్న కవిత ఈ నెల 25న ప్రకటించనున్న తనపార్టీలో యువకులు, ఉద్యమకారులకే ప్రాధాన్య మంటోంది.





