వందేమాతరంపై రాజకీయ వివాదం

– కాంగ్రెస్ తీరును ఎండగట్టిన బీజేపీ
– కొత్త ముస్లింలీగ్ పార్టీ అంటూ నబీన్ విమర్శలు

న్యూదిల్లీ, ఆగస్టు 20 : జాతీయ గేయం వందే మాతరం ఆలాపన విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. పార్టీ కార్యక్రమాల్లో వందే మాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలన్న తమ 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్ప్పుబట్టింది. ఈ నిర్ణయం ఆ పార్టీ దేశ భక్తి, దేశం పట్ల విధేయతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆరోపించింది. ఓట్ల కోసం కాంగ్రెస్ కొత్త ముస్లిం లీగ్‌గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స’లో తీవ్రస్థాయిలో స్పందించారు. వందేమాతరాన్ని అవమానించడం అంటే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను అవమానించడమేనని మండిపడ్డారు. 1937లో కాంగ్రెస్ తీసుకున్న తీర్మానాన్ని అనుసరించాలని, ఇకపై పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరం తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని సీడబ్ల్యూసీ బుధవారం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్ప్పుబట్టారు. ఈనెల 15న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం పూర్తి రూపాన్ని ఆలపించే విషయంలో చోటుచేసుకున్న వివాదాన్ని నబీన్ పరోక్షంగా ప్రస్తావించారు. వందేమాతరంపై తన వైఖరిని కాంగ్రెస్ తీర్మానం రూపంలో అధికారికం చేసిందన్నారు. ఓటు బ్యాంకు కోసం దేశ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పదేపదే తాకట్టు పెడుతోందని ఆరోపించారు. ఇది కేవలం రాజకీయ సమర్థన కాదని, ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ వందే మాతరం విషయంలో కాంగ్రెస్ వైఖరి ఆ పార్టీ దేశ భక్తి, దేశం పట్ల విధేయతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని విమర్శించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి తామే వారసులమని చెప్ప్పుకునే కాంగ్రెస్ ఇప్ప్పుడు జాతీయ గేయాన్ని పూర్తిగా గౌరవించేందుకు ఎందుకు సిద్ధంగా లేదని ప్రశ్నించారు. రాజ్యాంగం, పార్లమెంట్, దేశం కంటే పార్టీ నిర్ణయానికే కాంగ్రెస్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్‌ను తీవ్ర పదజాలంతో విమర్శించారు. కాంగ్రెస్ తీరు చారిత్రక ముస్లిం లీగ్ వైఖరిని గుర్తుకు తెస్తోందని, ఆ పార్టీ కొత్త ముస్లిం లీగ్‌గా మారిందని ఆరోపించారు. 1931లో వందే మాతరం పూర్తి రూపంపై ముస్లిం లీగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ నిర్ణయం కూడా అదే తరహా మొండితనాన్ని ప్రతిబింబిస్తోందని బీజేపీ విమర్శించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *