మ‌హిళా ఎమ్మెల్యేల‌పై పోలీసుల దుశ్శాస‌న‌ప‌ర్వం

– సునీతా ల‌క్ష్మారెడ్డి చీర లాగారు
– స‌బితా ఇంద్రారెడ్డి జుట్టుప‌ట్టుకొని వ్యాన్‌లో ఎక్కించారు
– ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారితీసిన పోలీసుల ప్ర‌వ‌ర్త‌న‌
– ప్ర‌భుత్వ వైఖ‌రిపై రాష్ట్రవ్యాప్త ఆందోళ‌న‌కు బీఆర్ఎస్ పిలుపు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 7: అసెంబ్లీ సమావేశాల వేళ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారి తీసింది. అసెంబ్లీకి వస్తున్న మహిళా ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. అసెంబ్లీ లోపలికి వెళ్తున్న సమయంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగడంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సమయంలో మహిళా సభ్యులను అరెస్టు చేసే క్రమంలో సబితా ఇంద్రారెడ్డిని జుట్టు పట్టుకుని బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. మ‌హిళా ఎమ్మెల్యేలు అనే కనీస గౌరవం కూడా లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజల తరఫున అసెంబ్లీకి హాజరయ్యేందుకు వచ్చిన మహిళా ప్రజాప్రతినిధులనే ఇలా అవమానించడం ఏమిటని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. సునీత చీరను పోలీసులు లాగిన సమయంలో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ చ‌రిత్ర‌లో చీక‌టి రోజు :  సునీత

అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు అని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే మహిళలకు భద్రత లేదని.. శాసనసభలో కూడా భద్రత లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. తాము నల్లటి టీషర్ట్ కూడా ధరించలేదు. అయినా త‌మ‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తే పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని అన్నారు. ఇదేనా ప్రజాపాలనలో మహిళలకు దక్కే గౌరవమని ప్రశ్నించారు. నిరసన చేయడానికి త‌మ‌కు హక్కు లేదా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మహిళలు అని కూడా చూడకుండా ఇష్టానుసారంగా తోసేస్తున్నారని మండిపడ్డారు. వెయ్యి రోజుల పాలన గురించి కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ అసలు నిజాలు తెలుస్తాయనే తమను అసెంబ్లీకి రానివ్వడం లేదని ఆరోపించారు. కాగా, అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పోలీసులు వ్యవహరించిన తీరును ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించింది.

కేటీఆర్, హరీశ్‌రావు అరెస్ట్‌
-అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద ఉద్రిక్తత

అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తెలంగాణ‌ భవన్‌‌కు తరలించారు. నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీ రావడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న క్రమంలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో జగదీశ్ రెడ్డి కింద పడటంతో అతని కాలికి గాయమైంది. పోలీసుల తోపులాటలో కేటీఆర్ చేతికి, నుదుటికి గాయాలయ్యాయి. పోలీసులతో జరిగిన తోపులాటలో హరీశ్‌రావు కిందపడ్డారు. ఆ సమయంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆయన చేతిని తొక్కారు. ఈ ఘటన అనంతరం నల్ల టీషర్టులతో అసెంబ్లీ లోపలికి అనుమతించకపోవడంతో హరీశ్‌రావు టీషర్ట్ విప్పి బనియన్‌తో నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వరుస ఘటనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *