– ఇది సభా గౌరవానికి సంబంధించిన విషయం
– బీఆర్ఎస్ క్షమాపణ చెప్పి ఆ సభ్యుడితో రాజీనామా చేయించాలి
– శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసినట్టుగా భావిస్తున్న వ్యాఖ్యలు శాసనసభ వేదికగా తీవ్ర దుమారాన్ని రాజేశాయి. మంత్రి సీతక్క అసెంబ్లీలోనే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టగా, స్పీకర్ ప్రసాద్ కూడా తీవ్ర మనస్తాపంతో కన్నీళ్లు పెట్టుకోవడం సభను కుదిపివేసింది. ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి, మంత్రి సీతక్క తదితరులు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డిలు ఖండించారు. స్పీకర్ పదవి ఒక అత్యున్నత స్థానం.. సభాపతిని గౌరవించడం మన సంప్రదాయం.. అలాంటి స్పీకర్‌పై సభ్య సమాజం తల వంచుకునేలా కొంతమంది మాట్లాడారు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సభకు జరిగిన అవమానంగా భావించి సభ్యులు దీనిపై చర్చ పెట్టారన్నారు. సభా సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. సభలో ముఖ్యమంత్రి అయినా, శాసనసభ్యుడు అయినా స్పీకర్‌కు సమానమేనని, అలాంటి స్పీకర్ మనసు గాయపడేలా బీఅరఎస్ వ్యవహరించిందని, ఇది వ్యక్తిగా గడ్డం ప్రసాద్ కుమార్‌కు జరిగిన ఘటన కాదు.. ఇది సభ గౌరవానికి సంబంధించిన విషయం అని అన్నారు. తెలంగాణకు ఇది ఒక చీకటి రోజు.. ఇంత అనుచిత భాషతో దూషించడం క్షమించరాని నేరం అని అన్నారు. సభాపతిని, ఆయన కుటుంబ సభ్యులను అవమానించేలా మాట్లాడారని, ఇది కేవలం దళితులకు జరిగిన అవమానం కాదు.. ఇది అందరికీ జరిగిన అవమానం అని పేర్కొన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని, దళితులకు మూడెకరాలు ఇస్తానని, దళిత బంధు ఇస్తామని నమ్మించి దళిత ఉప ముఖ్యమంత్రిని భర్తరఫ్ చేశారు.. నేరెళ్లలో ఇసుక లారీలను అడ్డుకున్న దళితులను లారీలతో తొక్కించి చంపారు.. ఒక దళితుడిని కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడిని చేస్తే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్ష హోదా నుంచి తొలగించారు అని బీఆర్ఎస్ హయాంనాటి ఘటనలను సీఎం గుర్తు చేశారు. బీఆర్ఎస్‌ది దళిత వ్యతిరేక ఆలోచన.. దళిత వ్యతిరేక వైఖరి అని అన్నారు. సభాపతి తల్లిని అవమానించేలా మాట్లాడటం ఇది అందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నానంటూ ఈ వ్యాఖ్యలను మనందరం ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి దుర్మార్గపు పోకడలను నియంత్రించాలని కోరారు. ప్రభుత్వం సంయమనం పాటిస్తే ఆది చేతకానితనం అనుకుంటున్నారంటూ అదిరించి, బెదిరించి వ్యవస్థలను లొంగదీసుకుంటామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సభా నాయకుడిగా డిమాండ్ చేస్తున్నానన్నారు. ఆ సభ్యుడితో రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నానన్నారు. అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడి సభ్యత్వం బర్తరఫ్ చేయాలని కోరుతున్నానన్నారు.
స్పీకర్ తల్లిపై అవమానీయంగా మాట్లాడారు : మంత్రి సీతక్క
బీఆరఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీరు సమాజం తల దించుకునేలా ఉందని, అసెంబ్లీ స్పీకర్ తల్లిపై అవమానీయంగా మాట్లాడడం బాధాకరం అని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ ఇద్దరు సభ్యులు తాత మధు, నవీన్‌లు మాట్లాడిన మాటలు తాను విన్నానని చెప్పారు. ఊర్లలో వీధులలో ప్రవర్తించే లాగా అసెంబీల్లో ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి అని స్పీకర్‌ను కోరారు. బీఆరఎస్ విధానం ఎలా ఉంది అంటే ఆ పార్టీ అధ్యక్షుడు నిన్ననే నీతులు మాట్లాడారు.. రెండున్నరేళ్లు అసెంబ్లీకి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారు.. సీఎంకి సంస్కారం లేదని తప్పుడు మాటలు మాట్లాడి వాళ్ళ సభ్యులకు ఎలాంటి సంస్కారం నేర్పించి పంపాడు అనేది దీన్నిబట్టి స్పష్టమవుతోందన్నారు. ఇది స్పష్టంగా కేసీఆర్ డైరెక్షనే అని ఆమె ఆరోపించారు. బీఆరఎస్ అంటేనే దురహంకారంతో ఉన్న పార్టీ అని, దళితులు అంటే వారికి నచ్చదు.. గతంలో భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉంటే ఆ పదవి నుండి ఆయన్ను తొలగించే వరకు ఊరుకోలేదని, ఒక దళిత మహిళను ఏ విధంగా లాక్ అప్ డెత్ చేశారో తెలుసు.. నేరెళ్లలో దళితులను ఏం చేశారో తెలుసు.. రాజయ్యను రాత్రికి రాత్రికి తీసేశారు అంటూ బీఆర్‌ఎస్ నేతలకు దొర అహంకారం దురంకారం ఉన్నాయి అని ఆరోపించారు. ఆ తల్లి ఏం నేరం చేసింది అని ఇలా మాట్లాడారు అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉంది.. మంత్రులు ఉన్నారు సమాధానం చెప్పడానికి రండి అని కోరారు. గతంలో జగదీశ్వర్ రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి ‘నీ సొత్తు కాదు’ అని మాట్లాడారు.. సంస్కార హీనంగా మాట్లాడేవారు ముఖ్యమంత్రి రేవంత్ గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధ స్థానంలో ఉన్న స్పీకర్‌పై మాట్లాడిన వారిని సస్పెండ్ చేయాలి, చర్యలు తీసుకోవాలి అని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
తాతా మధును బర్తరఫ్ చేయాలి : బీజేఎల్పీ నేత ఏలేటి
సభలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న స్పీకర్‌పై తాతా మధు వాడిన భాషను బీజేపీ ఎమ్మెల్యేల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ తక్షణమే దీనిపై సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మధు కావాలని మాట్లాడారా లేక ఎవరైనా మాట్లాడించారా అని ప్రశ్నించిన ఏలేటి ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించిన ఆ ఎమ్మెల్సీని పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని పట్టుబట్టారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్‌కు జరిగిన తీవ్ర పరాభవంపై, మరోవైపు 22-ఏ నిషిద్ధ భూముల వివాదంపై ప్రభుత్వాన్ని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. 22-ఏ భూముల్లో జరిగిన అక్రమాలపై స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే క్షమాపణలు చెప్పారని, అధికారుల మీద నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ భూకుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు సభలోనే స్పష్టమైన హామీ ఇస్తే తమ నిరసనను విరమిస్తామని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం నేరుగా సమాధానం చెప్పకుండా ఇతర అంశాలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. ‘ధరణి’పై నిజంగానే ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిందా అని నిలదీసిన ఆయన ఒకవేళ జరిగితే ఆ నివేదికలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించి చేసినవి కావు