పోలీస్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట

– పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, ఆరోగ్య భద్రత పథకాలపై సమగ్ర సమీక్ష
– విద్య, వైద్యం, వివాహ సహాయం, బీమా పథకాల బలోపేతానికి ఆదేశాలు
– పోలీసు పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, పోటీ పరీక్షలకు ప్రత్యేక ప్రోత్సాహం
– సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యం
– ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలి
-డీజీపీ సి.వి. ఆనంద్

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 20: పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఆరోగ్య భద్రత  విభాగాల సమీక్షా సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, వాటి పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేందుకు శాఖ అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పోలీసు పిల్లల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, మెరిటోరియస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే జేఈఈ, నీట్‌తో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్‌లు అందిస్తూ ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సిబ్బందికి వివాహ రుణాలు, వైద్య రుణాలు, విద్యా రుణాలు, మెరిట్ స్కాలర్‌షిప్‌లు, మెరిటోరియస్ స్కాలర్‌షిప్‌లు, అదనపు కార్పస్ ఇన్సూరెన్స్, వివిధ గ్రాంట్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా సమగ్ర ఆర్థిక భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీ వివరించారు.
ఆరోగ్య భద్రత పథకం ద్వారా వేలాది మందికి వైద్య సేవలు
పోలీసు ఆరోగ్య భద్రత పథకం కింద 2025 సంవత్సరంలో 33,126 మంది పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు చికిత్స పొందగా, 2026 జూన్ నాటికి 12,392 మంది ఈ పథకం ద్వారా వైద్య సేవలు పొందినట్లు వెల్లడించారు. ఇందుకోసం 2025లో రూ.181.74 కోట్లు, 2026 జూన్ నాటికి రూ.73.61 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
గ్రూప్ ప్ర‌మాద బీమాతో కుటుంబాలకు భరోసా
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఆర్థిక రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు రూ.5 లక్షలు, ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లకు రూ.10 లక్షలు, డీఎస్పీలకు రూ.15 లక్షలు, ఐపీఎస్ మరియు అంతకంటే పైస్థాయి అధికారులకు రూ.25 లక్షల బీమా రక్షణ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
సంక్షేమ పథకాల దుర్వినియోగం సహించం
సంక్షేమ పథకాలను వ్యాపార దందాగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని డీజీపీ హెచ్చరించారు. సంక్షేమ పథకాలు వాటి అసలు లక్ష్యానికి అనుగుణంగా అమలయ్యేలా ప్రతి ఒక్కరూ నైతిక విలువలను పాటించాలని సూచించారు. కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే వేలాది మంది పోలీసు కుటుంబాలు నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సంక్షేమ నిధుల బలోపేతానికి చర్యలు
పోలీసు క్యాంటీన్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు తదితర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, పోలీసు పిల్లల విద్య, సివిల్స్, గ్రూప్స్ కోచింగ్, స్కాలర్‌షిప్‌లు, వివాహ సహాయం తదితర సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని ఆదేశించారు. ఈ పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్‌ను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు.
టెక్నాలజీ వినియోగం
సంక్షేమ, ఆరోగ్య భద్రత విభాగాల్లో టెక్నాలజీ వినియోగాన్ని విస్తృతంగా పెంచాలని డీజీపీ సూచించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలు, నిధుల సమీకరణ, వినియోగం, సేవల అమలు వంటి అన్ని అంశాలను సమగ్ర ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేసే విధంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలని ఆదేశించారు. వెల్ఫేర్ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసి పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించాలని, హోదాల వారీగా వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. శాఖకు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్‌ల అద్దె రేట్లను పారదర్శకంగా నిర్ణయించి, సిబ్బందికి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా లీజుకు ఇవ్వాలని, శాఖ వనరులను సమర్థవంతంగా వినియోగించి సంక్షేమ కార్యక్రమాలకు అదనపు ఆదాయ వనరులు సమకూర్చాలని ఆదేశించారు.
తక్కువ వడ్డీ రుణాలు అందుబాటులోకి
అర్హులైన పోలీసు సిబ్బందికి ఓపెన్ ప్లాట్ రుణాలు 9 శాతం వడ్డీతో, గృహ రుణాలు 6.75 శాతం వడ్డీతో, వ్యక్తిగత రుణాలు రూ.5 లక్షల వరకు 11 శాతం వడ్డీతో, కుమార్తె వివాహానికి రూ.6 లక్షల వరకు, దేశీయ, విదేశీ ఉన్నత విద్య కోసం రూ.30 లక్షల వరకు తక్కువ వడ్డీతో రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. సమీక్ష ముగింపులో డీజీపీ మాట్లాడుతూ, “ప్రతి సంక్షేమ పథకం అసలు ఉద్దేశం అర్హులైన ప్రతి పోలీసు ఉద్యోగికి న్యాయంగా ప్రయోజనం చేకూర్చడమే. ప్రతి రూపాయి జవాబుదారీతనంతో ఖర్చు కావాలి. పారదర్శకత, నైతికత, సమర్థవంతమైన నిర్వహణతోనే సంక్షేమ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది” అని అన్నారు.
సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులు డీజీపీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందజేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. ప్రతి పోలీసు కుటుంబానికి భద్రత, సంక్షేమం కల్పించడం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసు శాఖ ముఖ్య లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో డీజీపీ సి.వి. ఆనంద్, డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ ఎం. భగవత్, ఏడీజీ సంజయ్ జైన్, ఐజీ (మల్టీజోన్-2) షహనవాజ్ ఖాసిం, ఐజీ (ప్రొవిజన్ అండ్ లాజిస్టిక్స్) గజరావు భూపాల్, పోలీస్ వెల్ఫేర్, ఆరోగ్య భద్రత కార్యదర్శి ఉదయ్ కుమార్ రెడ్డి, ఫైనాన్స్ అడ్వైజర్ శరత్ కుమార్, తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు గోపీ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *