– పెట్టుబడులకు సంరక్షకుడిగా ఉంటా
– హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దుతాం
– దిల్లీలో గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
– పాల్గొన్న కేంద్ర మంత్రి పీయÖష్ గోయల్, రాష్ట్ర మంత్రులు
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట’ కర్టెన్ రైజర్ కార్యక్రమం దిల్లీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హృదయపూర్వక స్వాగతం పలికారు. సమ్మిట్‌కు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, మహ్మద్ అజారుద్దీన్‌లతోపాటు పలువురు పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. నాలుగు శతాబ్దాల క్రితమే హైదరాబాద్ చార్మినార్ కేంద్రంగా అంతర్జాతీయ వ్యాపారానికి కేంద్రీకృతమైందని, ముత్యాలు, సుగంధ ద్రవ్యాలు, వెండి కళాకృతులకు పేరొందిందని గుర్తు చేశారు. నిజాం పాలకులు అద్భుతమైన కట్టడాలు, ప్రపంచస్థాయి మ్యూజియం, టంకశాల (నాణేల ముద్రణాలయం), విమానాశ్రయం, రైల్వేలు, అత్యుత్తమ విద్యా సంస్థలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారన్నారు.
గ్లోబల్ లీడర్ల జన్మస్థలి
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ వంటి మహానాయకులను ప్రపంచానికి అందించిందని సీఎం రేవంత్ కొనియాడారు.
ఆర్థిక దార్శనికులకు నివాళి
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయి ప్రతిభావంతులను తయారు చేయడంలో హైదరాబాద్‌కు ప్రత్యేకత ఉందని సీఎం చెప్పారు. భారత దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేసిన మహా నేతలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేడు ఫోన్, ఇంటర్నెట్ లేని జీవితాన్ని మనం ఊహించలేం.. రాజీవ్ గాంధీ హైదరాబాద్‌లో పైలట్ శిక్షణ పొందారు. పైలట్‌గా కూడా పనిచేశారు.. అందుకే హైదరాబాద్‌లోని ప్రపంచస్థాయి విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు.. టెలికాం, కంప్యూటర్ విప్లవానికి మూలకారకుడైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, 1991లో ఆర్థిక సంస్కరణల (ఎల్పీజీ) ద్వారా దేశాన్ని గట్టెక్కించిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు సేవలకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెల్యూట్ చేశారు.
3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం
హైదరాబాద్ జీవనంలోనే ప్రపంచస్థాయి దృక్పథం ఉంది. సంస్కరణలను స్వీకరించే తత్వం, పారిశ్రామిక స్ఫూర్తి ఉన్నాయి. 1991 నుంచి హైదరాబాద్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రభుత్వాలు అధికారంలోకి ఉన్నాయి. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నప్పటికీ హైదరాబాద్ పెట్టుబడుల ప్రస్థానానికి అంతా మద్దతుగా నిలిచారని చెప్పారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి ప్రకటించారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 5% నుండి 10%కి పెంచుతామన్నారు. ‘తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మీరు అనుకున్న మొత్తాన్ని, వృద్ధి అంచనాలను, లాభాలను రెట్టింపు చేసుకోండి. మీ పెట్టుబడులకు భద్రత కల్పించే సంరక్షకుడిగా నేను ఉంటాను’ అని వ్యాపారవేత్తలకు హామీ ఇచ్చారు. పెట్టుబడిదారుల్లో చాలామందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సంబంధాలపై సందేహాలున్నాయి. అభివృద్ధి విషయంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య సంబంధాలు ఏమిటనేది కేంద్ర మంత్రి ఇప్పుడే చెప్పారన్నారు. తెలంగాణ ఎదుగుతోందిజ. ఈ ప్రగతి ప్రస్థానంలో మీరూ భాగస్వాములు కండి.. మనమంతా కలిసి ఎదుగుతూ చరిత్ర సృష్టిద్దాం అని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం
దేశంలో కేంద్రం ప్రకటించిన ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లలో మూడు (హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణె) తెలంగాణకే రావడం సంతోషకరమని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలు, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు (ఆరఆరఆర్) ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ పోటీ భారతీయ నగరాలతో కాదని, న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలతోనేనని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





