– విద్య, గృహ, ఎంఎసఎంఈ, మౌలిక సదుపాయాల రంగాలకు రుణాలు పెంచాలి
– రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించాలి
– రుణాల పునర్వ్యవస్థీకరణతోపాటు రబీకి కొత్త రుణాలు అందించాలి
– ఎస్ఎల్బీసీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : ఎల్‌నినోతో కరవు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు రైతులకు అండగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. అర్హులైన రైతుల పంట రుణాలను ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం పునర్వ్యవస్థీకరించడం, రీషెడ్యూల్తోపాటు రబీ సీజన్‌కు అవసరమైన కొత్త రుణాలను సకాలంలో అందించాలని సూచించారు. ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యా రుణాల మంజూరులో బ్యాంకులు సానుకూలతతో గరిష్ఠ స్థాయిలో అందించాలని కోరుతూ వీటి మంజూరుపై ఎసఎల్బీసీ కన్వీనర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. వ్యక్తిగత గృహ నిర్మాణానికి రుణాలు అందించడంలోనూ ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ), మౌలిక సదుపాయాల రంగాలకు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్ద పరిశ్రమలతో పోలిస్తే ఎంఎస్ఎంఈ రంగం ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తోందని, ఈ రంగానికి రుణాల పెంపు ద్వారా ఆర్థిక కార్యకలాపాలు విస్తరిస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో 365 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించామని, వీటిలో 111 మండలాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని తెలిపారు. వర్షాభావంతో రైతుల పెట్టుబడులు, ఆదాయాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి తక్షణ సహకారం అవసరమని పేర్కొన్నారు. రైతులకు అందుబాటులో ఉన్న రుణ ఉపశమన చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు సమన్వయంతో పనిచేసి ఆర్బీఐ మార్గదర్శకాలను అమలు చేయాలని సూచించారు. చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలు, పంటల మార్పిడి, సూక్ష్మ సేద్యం, నిల్వ, ప్రాసెసింగ్, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు ఆర్థిక సహకారం అందించాలని సూచించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా రుణాలు, మార్కెట్ మద్దతు కల్పించాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందన్నారు. రైతు కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించేందుకు బ్యాంకులు సహకరించాలని కోరారు. ఈ సీజన్లో కనీసం 10 నుంచి 15 శాతం కుటుంబాలకు అదనపు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నగదు చలామణి పెరిగేలా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, ఇప్పటికే ఉన్న రుణ లక్ష్యాలకు అదనంగా ఒక్కో సంఘానికి మరో రూ.2 లక్షల వరకు రుణాలు అందించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఉదారంగా రుణాలు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని ఈ నెలలో అమలు చేసేందుకు చర్యలు చేపడుతోందని, ఈ నెల 19 నాటికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఎసఎల్బీసీ కన్వీనర్ ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. వర్షాభావంతో భూగర్భ జలాలు, విద్యుత్ వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు రైతుల రుణ చెల్లింపు సామర్థ్యంపైనా ప్రభావం పడుతోందన్నారు. బ్యాంకుల ఆచరణాత్మక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. రైతులు తదుపరి వ్యవసాయ సీజన్‌ను కొత్త ఆత్మవిశ్వాసంతో ప్రారంభించగలగడమే ఈ ప్రయత్నాల విజయానికి కొలమానమని పేర్కొన్నారు.
రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక చొరవ చూపాలి: తుమ్మల 
రైతాంగాన్ని ఆదుకునేందుకు బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సాధారణ కార్యకలాపాలకు భిన్నంగా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులకు అండగా నిలవాలని సూచించారు. కరువు ప్రభావిత మండలాల్లో పంట రుణాలను ఆర్బీఐ నిబంధనల ప్రకారం వెంటనే రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చరింగ్ చేయాలని, రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా బ్యాంకర్లే ముందుకు రావాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది కృష్ణా, గోదావరి నదులకు వరదలు రాకపోవడంతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయని, భూగర్భ జలాలు కూడా ఆశించిన స్థాయిలో రీచార్జి కాకపోవడంతో సుమారు 10 నుంచి 15 లక్షల బోరు బావుల్లో నీరు అందని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ ప్రభావం ఖరీఫ్‌తోపాటు రబీ పంటలపైనా పడే అవకాశం ఉన్నందున రైతులను ఆదుకునేందుకు బ్యాంకులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. రబీ సీజన్‌కు బ్యాంకులు నిర్దేశించుకున్న రూ.38,268 కోట్ల పంట రుణాలను వెంటనే మంజూరు చేయాలని సూచించారు. 2026 సెప్టెంబర్ వరకు రూ.96,943 కోట్ల రుణ పంపిణీ లక్ష్యంలో 53 శాతం మాత్రమే సాధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాన్సూన్ ఫార్మింగ్ రుణాల పంపిణీ కూడా లక్ష్యంలో 17 శాతానికే పరిమితమైందని, ఈ పరిస్థితిని అధిగమించి రుణాల మంజూరులో వేగం పెంచాలన్నారు. కరువు ప్రాంతాల్లో పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని, రైతులకు అవసరమైన పెట్టుబడి రుణాలు అందించాలని కోరారు. డ్రిప్, స్ప్రింక్లర్ సాగుకు విరివిగా రుణాలు ఇవ్వాలని, వాణిజ్య బ్యాంకులు కూడా వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే 3.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టామని, ఈ విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు సహకరించాలని మంత్రి కోరారు. పాడి, పౌల్ట్రీ, పశుపోషణ, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలు అందించడం ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించవచ్చన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్పీఓలు), మహిళా స్వయం సహాయక సంఘాలకు కూడా రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతులు తిరిగి పంటలు సాగు చేసి ఆదాయం పొందే వరకు వడ్డీ భారం పడకుండా ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణాల రీషెడ్యూలింగ్, రీస్ట్రక్చరింగ్ చేపట్టాలని మంత్రి కోరారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాహుల్ బొజ్జా, డాక్టర్ గౌరవ్ ఉప్పల్, కె.సురేంద్ర మోహన్, ఎస్ఎల్బీసీ బ్యాంకర్లు మానస గంగోత్రి, చిన్మయ్ కుమార్, ఉదయ్ భాస్కర్, నలేష్ నీలేష్ ద్వివేది, సురేష్ కుమార్ తదితరులు పొల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





