– రేపు ఆటోమొబైల్ అండ్ ఈవీ రంగం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం
– 25మంది పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో హైబ్రిడ్ విధానంలో..
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : రాష్ట్రాన్ని ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ) రంగాల్లో దేశంలోనే ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడంతోపాటు రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సన్నాహాల్లో భాగంగా ఆటోమొబైల్ అండ్ ఈవీ రంగానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం బుధవారం ఉదయం సచివాలయంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరగనుంది. హైబ్రిడ్ విధానంలో (ఆన్లైన్, ఆఫ్‌లైన్) నిర్వహించనున్న ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆటోమొబైల్, ఈవీ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు, పరిశ్రమల నిపుణులు, కీలక భాగస్వాములను ఈ కౌన్సిల్లో భాగస్వాములయ్యేందుకు సంప్రదించగా సుమారు 25మంది తమ అంగీకారం తెలిపారు. సమావేశంలో మంత్రి పొన్నం ఆటోమొబైల్, ఈవీ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో నేరుగా చర్చించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలకు ఉన్న ఆసక్తి, పెట్టుబడి ప్రతిపాదనలు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, పరిశ్రమల విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్తులో అందుబాటులో ఉన్న అభివృద్ధి అవకాశాలపై అభిప్రాయాలు సేకరించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ టెక్నాలజీ, క్లీన్ మొబిలిటీ, రవాణా రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై పారిశ్రామికవేత్తల సూచనలు, సలహాలను స్వీకరించనున్నారు.
సమావేశం ప్రధాన లక్ష్యాలు
రాష్ట్రంలో ఆటోమొబైల్, ఈవీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల ఆసక్తి, పెట్టుబడి ప్రతిపాదనలు, కొనసాగుతున్న ప్రాజెక్టులు, పరిశ్రమల విస్తరణ ప్రణాళికలను తెలుసుకోవడం. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026తోపాటు నిర్వహించనున్న ఇన్వెస్ట్మెంట్ ఎక్స్‌పోలో ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యాన్ని కోరడం. ఆటోమొబైల్, ఈవీ రంగాల అభివృద్ధికి అవసరమైన విధానపరమైన అంశాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సహకారంపై పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను తెలుసుకోవడం. గ్లోబల్ సమ్మిట్‌లో ఆటోమొబైల్ ఈవీ రంగంపై నిర్వహించే ప్రత్యేక సెషన్లో చర్చించాల్సిన కీలక అంశాలను గుర్తించడం. పరిశ్రమలు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తూ తెలంగాణను ఆటోమొబైల్, ఈవీ రంగాలకు ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా అభివృద్ధి చేయడం. ఈ సమావేశ నిర్వహణకు కన్వీనర్‌గా తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖకు చెందిన లాజిస్టిక్స్, సప్లై చైన్, ఆటోమొబైల్ అండ్ ఈవీ విభాగం డైరెక్టర్ ఔజాద్ షేక్‌ను నియమించారు. సమావేశ ఏర్పాట్లు, సంబంధిత పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ బాధ్యతలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆటోమొబైల్, ఈవీ రంగాల్లో ప్రపంచస్థాయి పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత, పరిశ్రమల విస్తరణకు తెలంగాణను కీలక కేంద్రంగా నిలబెట్టే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





