– చర్యలు తీసుకోవాలని కోరుతున్న తల్లిదండ్రులు
కాజిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: హనుమకొండలోని వడ్డేపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేందర్ నాయక్ తమ పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో సుమారు 120 మంది విద్యార్థులు చదువుతుండగా ప్రధానోపాధ్యాయుడితో కలిపి ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, ఉపాధ్యాయులు సెలవులో ఉన్నప్పుడు విద్యార్థుల చదువుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇటీవల ప్రధానోపాధ్యాయుడు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో ఇద్దరు ఉపాధ్యాయులే మిగిలారని ఫిర్యాదుదారుడు తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సరిపడ ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ తల్లిదండ్రులందరూ హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించారని, ఈ క్రమంలో ఈ నెల 1న డిఈఓ, ఎంఈఓలు పాఠశాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారని, విద్యార్థులతో మాట్లాడి అదనపు ఉపాధ్యాయుల కేటాయింపు కోసం వినతిపత్రం ఇవ్వాలని సూచించారని పేర్కొన్నారు. వినతి పత్రం తయారు చేస్తున్న సమయంలో తన కుమార్తెతోపాటు మరికొందరు విద్యార్థినులతో ప్రధానోపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, అనుచితంగా తాకినట్లు వారు వెల్లడించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని తమతో ప్రమాణం చేయించుకున్నట్లు కూడా విద్యార్థినులు తెలిపారని ఆరోపించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు శుక్రవారం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ప్రధానోపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారని, ఈ ఘటనపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారని సుబేదారి ఇన్స్పెక్టర్ ఎం.రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
———————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





