ఆకట్టుకున్న కోలాటాలు, జానపద నృత్యాలు
హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, విశిష్ట సంస్కృతి సాంప్రదాయాలకు సజీవ ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సంబరాలు (Bathukamma celebrations) భీమారంలోని ఎస్.ఆర్ డిజి. స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం అత్యంత వైభవంగా, కనులపండువగా నిర్వహించారు . దసరా నవరాత్రుల ఉత్సవాల్లో భాగం గా పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి.
రంగురంగుల పూల కోలాహలం..
సంబరాల సందర్భంగా పాఠశాల ప్రాంగణమంతా రంగురంగుల పూల సువాసనలతో, ముగ్గులతో పండగ వాతావరణాన్ని తలపించింది. విద్యార్థులు తమ ఇళ్ల నుండి తీరొక్క పూలైన తంగేడు, గునుగు, చామంతి, బంతి, గులాబీలతో అద్భుతంగా అలంకరించిన బతుకమ్మలను పాఠశాలకు తీసుకువచ్చారు. సాంప్రదాయ దుస్తులైన లంగా-ఓణీలు, పట్టుచీరలలో ముస్తాబైన విద్యార్థినులు, ఉపాధ్యాయురాళ్లు బతుకమ్మల చుట్టూ చేరి లయబద్ధంగా ఆడిన బతుకమ్మ ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆకట్టుకున్న కోలాటాలు, జానపద నృత్యాలు…
ఎస్ఆర్ విద్యాసంస్థల జోనల్ ఇన్ చార్జ్ రాజేశ్వర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ సంజయ్ గాంధీ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “బతుకమ్మ పండుగ కేవలం పూల పండుగ మాత్రమే కాదు, అది మన తెలంగాణ సంస్కృతి, జీవన విధానం ప్రకృతితో ముడిపడి ఉన్న గొప్ప వారసత్వానికి నిదర్శనమని అన్నారు . నేటి ఆధునిక కాలంలో పిల్లలకు మన మూలాలను, సాంప్రదాయాలను పరిచయం చేయడానికే పాఠశాలలో ఇటువంటి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సంబరాలలో తల్లిదండ్రులు పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. పిల్లలలో సాంస్కృతిక చైతన్యాన్ని నింపుతున్నందుకు పాఠశాల యాజమాన్యాన్ని వారు అభినందించారు.






