– ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌లలో పర్యటన
న్యూదిల్లీ,ఆగస్ట్29: ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. రెండు దేశాల విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ఆగస్టు 29, 30 తేదీల్లో ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లో ద్వైపాక్షిక పర్యటన చేయనున్నారు. తాష్కెంట్‌లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ఉజ్బెకిస్తాన్‌లో ప్రధాని మోదీకి ఇది నాలుగో పర్యటన కానుంది. ఈ పర్యటనలో భారత్, ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు.. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. అలాగే డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించే అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి. భారత్ ’విక్షిత్ భారత్ 2047’ అభివృద్ధి దార్శనికతతోపాటు ఉజ్బెకిస్తాన్-2030 అభివృద్ధి ప్రణాళికలపై కూడా ఇరు దేశాల మధ్య పరస్పరం అభిప్రాయాలను పంచుకుంటారు. భవిష్యత్‌లో ఆర్థిక, సాంకేతిక, మౌలిక వసతుల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకునే అవకాశాలను పరిశీలించనున్నారు. తాష్కెంట్‌లో ప్రధాని మోదీ పలు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్‌ను సందర్శించడంతోపాటు తాష్కెంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా సందర్శించనున్నారు. ఉజ్బెకిస్తాన్ పర్యటన అనంతరం మోదీ ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు కిర్గిజ్ రిపబ్లిక్‌లో పర్యటించనున్నారు. కిర్గిజ్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు మోదీ బిష్కెక్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. 2017 నుంచి భారత్ పూర్తి సభ్య దేశంగా కొనసాగుతోంది. సమావేశంలో భద్రత, అనుసంధానం, ప్రాంతీయ సహకారం, అభివృద్ధి అవకాశాలపై భారత ప్రాధాన్యతలను ప్రధాని మోదీ ప్రస్తావించనున్నారు. ఈ సందర్భంగా సభ్యదేశాల నేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అలాగే కిర్గిజ్ రిపబ్లిక్‌లో జరిగే 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి కూడా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. మధ్య ఆసియా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే ఈ క్రీడలు ప్రాంతీయ సాంస్కృతిక సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





