గత, ప్రస్తుత పాలనను గమనిస్తున్న ప్రజలు

– కాగజ్‌నగర్ బహిరంగ సభలో మంత్రి పొంగులేటి

కాగజ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 1 : గత రెండున్నరేళ్ల ప్రజాపాలనకు, అంతకుముందు పదేళ్ల పాలనకు మధ్య స్పష్టమైన తేడా ప్రజలు చూస్తున్నారు.. ఇది మాటల్లో కాదు, పనుల్లో కనిపిస్తున్న మార్పు అని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కాగజ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లను మంజూరు చేశామని, ఐటీడీఏ పరిధిలోని గిరిజన నియోజకవర్గాలకు అదనంగా ఇళ్లను కేటాయించామని చెప్పారు. పదేళ్ల దొరల పాలనలో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట వంటి ప్రాంతాల్లో తప్ప డబుల్ బెడ్‌రూం ఇళ్లు కనిపించలేదన్నారు. మిగతా ప్రాంతాల్లో పేదల గోడు పట్టించుకోలేదని, పేదవాడి సొంతింటి కలను విస్మరించారని ఆయన విమర్శించారు. .ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలనలో ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇళ్ల మంజూరులో ఎలాంటి వివక్ష లేదని, పేదవాడు అర్హుడైతే చాలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశాం అని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒకటి లేదా రెండు విడతలతో ముగిసిపోయే కార్యక్రమం కాదుదని, రాష్ట్రంలోని ప్రతి అరత కలిగిన పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇటీవల ఇందిరమ్మ ఇళ్లపై తాను ప్రతిపక్ష నాయకులకు బహిరంగ సవాల్ విసిరాను.. వాస్తవాలపై చర్చకు రావాల్సిందిపోయి వారు సమాధానం చెప్పలేక అసత్య ప్రచారాలతో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మరో రెండు నెలల్లో అదనంగా రెండు లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. రానున్న కాలంలో గిరిజన తండాలు, గిరిజన గ్రామాల్లో అదనంగా 20 నుంచి 30 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారన్నారు. తన నియోజకవర్గంలోని ఓ గిరిజన తండాలో ఓ యువకుడు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడని, ఇంతవరకు గుడిసె కారణంగా తనకు పిల్లనివ్వడానికి ఎవరూ రాలేదని, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నందున పెళ్లికి పిల్ల దొరికిందని ఆనందంగా చెప్పడంతో తనకు కళ్ళంట నీళ్లు తిరిగాయని చెప్పారు. గత పాలకులు పేదలకు ఇల్లు కడితే కమీషన్లు రావని కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి రూ.లక్ష కోట్లు దోచుకున్నారని, నాటి పాలకుల వలే తాము ఇళ్ల పేరిట బొమ్మలు చూపించమని తెలిపారు. ఈ వేదికపై ఉన్న ప్రతిపక్ష సభ్యులు సైతం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రశంసించారంటూ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా రెండు, మూడు, నాలుగు విడతలుగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. రెండో విడతగా ప్రతి నియోజకవర్గానికి ఒక యూనిట్‌గా రెండు వేల ఇళ్లు మంజూరు చేస్తున్నామని, వీటిలో గతంలో నిర్మాణం ప్రారంభించి మొండి గోడలతో ఆగిపోయిన ఇళ్లకు, గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్భాటంగా ఇచ్చి కాగితాలకే పరిమితమైన గృహలక్ష్మి పథకం ఇళ్లకు కలిపి ఒక్కో నియోజకవర్గంలో 500 ఇళ్ల చొప్పున నిధులు మంజూరు చేసి వాటిని పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *