– ముందస్తు కార్యాచరణ ప్రణాళికలతో రంగం సిద్ధం
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : వాతావరణ మార్పుల కారణంగా నిపుణులు హెచ్చరిస్తున్న సూపర్ ఎల్ నినో పరిస్థితులు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో వర్షపాతం, జలవనరులపై ప్రభావం చూపే అవకాశముందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సింపోజియం సంస్థ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులు అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గతంలో నమోదైన వర్షపాతం నమూనాల ఆధారంగా ఇకపై జలవనరుల ప్రణాళికలు రూపొందించడం సాధ్యం కాదని, మారుతున్న వాతావరణ పరిస్థితులకనుగుణంగా నీటి నిర్వహణలో కొత్త వ్యూహాలను అవలంబించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నరేళ్లపాటు రాష్ట్రానికి అనుకూలమైన వర్షపాతం నమోదై రిజర్వాయర్లు సమృద్ధిగా నిండాయని, సాగు, తాగునీటి అవసరాలు సాఫీగా నెరవేరాయని తెలిపారు. అయితే ప్రస్తుత వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.వర్షాభావం తీవ్రరూపం దాల్చిన తర్వాత స్పందించడం కాక ముందుగానే పరిస్థితులను అంచనా వేసి చర్యలు తీసుకునే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నీటిపారుదల, వ్యవసాయం, తాగునీరు, పౌర సరఫరాల శాఖలు సమన్వయంతో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాయని చెప్పారు. రిజర్వాయర్ల నిర్వహణలో రియల్‌టైమ్ డేటా వినియోగం, శాస్త్రీయ నిర్ణయాలు, శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
పాలనకు ఇదే అసలైన పరీక్ష
వాతావరణ మార్పుల వల్ల ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితుల నుంచి రైతులను రక్షించగలగడమే ప్రభుత్వాల అసలైన పరీక్ష అని మంత్రి పేర్కొన్నారు. వాతావరణ మార్పులు జలవనరులపై ప్రభావం చూపుతాయా లేదా అన్నది ప్రశ్న కాదని, ఆ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు ఎంత వేగంగా మారుతున్నాయన్నదే అసలు సవాల్ అని వ్యాఖ్యానించారు.
ఆర్థిక వ్యవస్థకు నీరే పునాది
నీటిని కేవలం పంపిణీ చేసే వనరుగా కాక ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నీటి నిర్వహణలో లోపాలు ఏర్పడితే వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పెట్టుబడులు, దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
హైదరాబాద్‌కు దీర్ఘకాలిక తాగునీటి భద్రత
హైదరాబాద్ నగరానికి గోదావరి, కృష్ణా నదుల నుంచి తాగునీటిని అందించే దీర్ఘకాలిక ప్రణాళికలను గత ప్రభుత్వాలు అమలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని మరింత బలోపేతం చేస్తోందన్నారు. అయితే భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోవడం ఆందోళనకరమని అన్నారు. ఒకప్పుడు 50 నుంచి 100 అడుగుల లోతులో లభించిన భూగర్భ జలం ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో వెయ్యి అడుగుల లోతుకు చేరుకున్నట్లు చెప్పారు. వర్షపు నీరు భూగర్భంలోకి చేరేలా భారీ స్థాయిలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. పట్టణాల్లో పెరుగుతున్న కాంక్రీటీకరణ వల్ల భూగర్భ జలాల పునరుద్ధరణ తగ్గిపోవడంతో వర్షపు నీటి సంరక్షణ అత్యవసరమైందన్నారు. హైదరాబాద్‌లో చెరువులు, నీటి వనరులు, సహజ కాలువలను పరిరక్షించేందుకు హైడ్రా వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. గతంలో జరిగిన ఆక్రమణల వల్ల నగరంలో వరద ముప్పు పెరిగిందని, ప్రస్తుతం చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు, సహజ డ్రైనేజీ వ్యవస్థల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





