అందెశ్రీ పాటలు తూటాలు, మరఫిరంగులే

– ఆయన నాకు ఆత్మ బంధువు
– గత పాలకుల అహంకారంపై గళమెత్తిన అందెశ్రీ
– ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడటానికి ఆయనే నాకు స్ఫూర్తి
– అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి

ఘట్‌కేసర్, ప్రజాతంత్ర, జూలై 18 : అందెశ్రీ గీతాలు తూటాలు.. మరఫిరంగులు.. జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడు భావించాం.. కానీ గత పదేళ్లలో కుట్రలతో ఆ పాటను వినిపించకుండా చేశారు అని బీఆరఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఘట్‌కేసర్ శనివారం జరిగిన అందెశ్రీ స్మృతి వనానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పెన్నులపై మన్ను కప్పితే గనులై మొలకెత్తుతాయని అన్నట్లు ఇప్పుడు ప్రతీ బడిలో, ప్రతీ గడపలో ఆయన పాట వినిపిస్తోందని చెప్పారు. ఆత్మగౌరవంతో ఆయన ఏనాడూ దొరల గడప తొక్కలేదు తన పాట కోట్లాది రాష్ట్ర ప్రజల కోసం తప్ప గడీలలో దొరల కోసం కాదని అందెశ్రీ నిటారుగా నిలబడ్డారని గుర్తు చేశారు. నిరాశా, నిస్పృహలకు లోనైనప్పుడు తనకు అందెశ్రీ స్ఫూర్తిగా నిలబడేవారన్నారు. మనందరం దండు కట్టి విష సర్పాలను తుదముట్టించాలని ఆయన అన్న మాటలు నాకు ఇంకా గుర్తొస్తున్నాయి.. నా కుటుంబంలో పెద్దన్నగా అందెశ్రీని భావించా.. ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడటానికి ఆయనే నాకు స్ఫూర్తి అని చెప్పారు. ఏ రోజైతే అందెశ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో, గద్దరన్నను అవమానించారో ఆనాడే గడీల పాలనను శాశ్వతంగా పాతరేయాలని నిర్ణయించుకున్నారు.. మేక తోలు కప్పుకున్న తోడేలు ఇవాళ మాట్లాడుతోంది.. ఈ తోడేళ్ల గుంపును నేను ప్రశ్నిస్తున్నా.. నాడు కవితను, వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే ఉద్యోగాలు ఇచ్చినవ్ కదా.. తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం ఒక్కనాడైనా ఆలోచించారా అని అడిగారు. మేం నోటిఫికేషన్లు ఇచ్చినం.. రేవంత్ రెడ్డి భర్తీ చేశారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావ్.. పేపర్ లీకేజీలతో వందల కోట్లు సంపాదించుకున్నారు తప్ప పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయాలని మీ కుటుంబం ఏనాడైనా ఆలోచించిందా అని నిలదీశారు. నిరుద్యోగుల పట్ల మీరెప్పుడైనా మనుషుల్లా ప్రవర్తించారా? మానవీయ కోణంలో చూశారా? మేం అధికారంలోకి వచ్చాక అడ్డంకులను తొలగించి ఉద్యోగాలు భర్తీ చేశాం… ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పకళా వేదిక సాక్షిగా తల్లిదండ్రుల ముందు ఆ బిడ్డలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.. ఆ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూశాం.. పదేళ్లు మీరు నోటిఫికేషన్లు వేయడం తప్ప ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేకపోయారు? ఏడాదిలో 70 వేల ఉద్యోగాలు మేం ఎలా భర్తీ చేశాం.. మీరు శ్రీమంతులు ఎలా అయ్యారు? తెలంగాణ అప్పుల్లో ఎలా కూరుకుపోయింది? గజ్వేల్‌లో మిమ్మల్ని రాజకీయ సమాధి చేసే బాధ్యత మా యువకులు చూసుకుంటారు అని హెచ్చరించారు. తాను ఉన్నంత వరకు ఈ తెలంగాణ తులసి వనంలో గంజాయి మొక్కను మొలకెత్తనివ్వనన్నారు. మాకు అందెశ్రీ, గద్దర్, సోనియా గాంధీ స్ఫూర్తి..మీకు ఎవరు స్ఫూర్తి అని రేవంత్ ప్రశ్నించారు. మీ దోపిడీని ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోంది.. నిజాంను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ గడ్డది.. తెలంగాణ చైతన్యం ముందు మీరెంత.. మళ్లీ తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు.. తెలంగాణను ఎవరూ చెరబట్టలేరు.. చెరబట్టాలని చూస్తే అందెశ్రీ పాటగా తిరిగి వస్తారు అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అందెశ్రీ స్ఫూర్తితో పనిచేస్తోందన్నారు. నిరుద్యోగులు మాయగాళ్ల మాయలో పడొద్దని హితవు పలికారు. ప్రభుత్వం ప్రతీ ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నియామక పత్రాలు అందిస్తుంది.. పదేళ్లు బిడ్డ కవితకు పదవి ఇచ్చుకున్నారు.. కానీ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మీకు గుర్తుకు రాలేదా అని అడిగారు. తమ ప్రభుత్వంలో శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించామని, చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించామని, కోదండరాంను ఎమ్మెల్సీ చేసుకున్నామని, తొమ్మిదిమంది కవులను సన్మానించి రూ.కోటి నగదు బహుమతి ఇచ్చి గౌరవించుకున్నామని వివరించారు. మీకు గతమే తప్ప భవిష్యత్ లేదని స్పష్టం చేశారు.

అందెశ్రీ కుటుంబానికి వాగ్దానాలు నెరవేర్చాం :  డిప్యూటీ సీఎం భట్టి

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక సారథి, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీకి తమ ప్రభుత్వం అపూర్వ గౌరవం ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో అందెశ్రీ అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశంలో అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటుకు, అలాగే ఆయన విగ్రహ ప్రతిష్ఠాపనకు జయంతి రోజైన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి భూమి పూజ చేసి పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ సాధారణంగా నాయకులు లేదా ప్రభుత్వాలు ఒక కార్యక్రమం చేసి ఆ తర్వాత వదిలేస్తుంటాయని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటున్నదని ìచెప్పారు. అందెశ్రీ దివంగతులైన వేళ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన పాడె మోసి ఒక కవికి అపూర్వమైన నివాళిని అర్పించి, తమకున్న గౌరవాన్ని చాటారని గుర్తు చేశారు. ఒక నిరుపేద దళిత కుటుంబంలో పెరిగి రాష్ట్రం కోసం తపించిన ప్రజా గాయకుడికి ఈ ప్రభుత్వం సముచిత మర్యాదను అందించిందన్నారు. ఆనాడు అందెశ్రీ అంత్యక్రియల సమయంలో ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఏ ఐదు వాగ్దానాలనైతే ఇచ్చిందో వాటిని మరచిపోకుండా నేడు స్మృతివనానికి భూమి పూజ చేసే సమయానికే నెరవేర్చిన ప్రజా ప్రభుత్వంగా నిలిచామన్నారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన కుమారుడు దత్తుకు బి.జె.ఆర్. డిగ్రీ కళాశాలలో లెక్చరర్ ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించామని తెలిపారు. అందెశ్రీ రచించిన ప్రసిద్ధ కవితా సంకలనం ‘నిప్పుల వాగు’ 20 వేల కాపీలను ప్రభుత్వ పరంగా ముద్రించి పంపిణీ చేసేందుకు విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, ఆ పనులను పురోగతిలో పెట్టామన్నారు. ఆయన అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశాన్ని స్మృతి వనంగా మారుస్తామని చెప్పిన విధంగానే నేడు ముఖ్యమంత్రితో కలిసి భూమి పూజ నిర్వహించడంతోపాటు అందెశ్రీకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్ణఱ కూడా చేని వివరించారు.?నాడు ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రతి ఒక్కరినీ కదిలించిన అందెశ్రీ కలం నుంచి జాలువారిన ‘జయ జయహే తెలంగాణ’ పాటను అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఏ కార్యక్రమం జరిగినా ఈ పాటను వినేలా, వినిపించేలా ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తున్నదని వివరించారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాట ద్వారా మానవత్వం గురించి, సమాజం పట్ల మనిషి, నాయకులు ఏ రకంగా నడుచుకోవాలో యావత్ ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు అందెశ్రీ. ఆయన జీవితాన్ని, ఆలోచనలను, సాహిత్య సంపదను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని భట్టి పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *