– విద్యుత్ డిమాండ్‌పై యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
– నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు సరఫరాయే లక్ష్యం
– సమస్య వస్తే ‘పవర్ అంబులెన్స్’
– ఐటీ కారిడార్‌లో ఫ్లైఓవర్ల కిందే సబ్‌స్టేషన్ల ఏర్పాటు
– విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఏఐ వినియోగాన్ని పెంచాలి
– సింగరేణి కొత్త బ్లాక్‌లను సాధించాలి
– విద్యుత్తు సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున, భవిష్యత్తులో పెరిగే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రాకుండా, ప్రజలకు నాణ్యమైన కరెంటును అందించేందుకు పకడ్బందీగా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విద్యుత్ శాఖ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా ప్రజల తాగునీటి అవసరాలకు, రైతుల వ్యవసాయ సాగుకు ఎటువంటి ఆటంకం కలగకుండా అవసరమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. రానున్న రోజుల్లో విద్యుత్ రంగానికి ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా అధికారులు ముందుచూపుతో అడుగులు వేయాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు.ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల వసుళ్ళపై దృష్టి సారించాలని, రెవెన్యూ వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేసి సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణను పెంపొందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ వినియోగదారుడికి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాను అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు దశలవారీగా సోలార్ విద్యుత్ సదుపాయం కల్పించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో అభివృద్ధి చేసిన మోడల్ సబ్‌స్టేషన్‌ను ఆదర్శంగా తీసుకుని, టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్లను దశలవారీగా ఆధునికరించాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో భూమి కొరత దృష్ట్యా ఫ్లైఓవర్ల కింద సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.108 తరహాలో ప్రారంభించిన ‘పవర్ అంబులెన్స’ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఆదేశించారు. ప్రస్తుతం 21 సర్కిళ్ల పరిధిలో 168కి పైగా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయడం, ఎర్రగడ్డలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వేగవంతమైన సేవలు అందించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యోగులు సైతం భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత 30 నెలలుగా చేపట్టిన పురోగతి కార్యక్రమాలు తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ఉప ముఖ్యమంత్రి కి వివరించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ఆధునిక సాంకేతికతను అనుసంధానించడం ద్వారా పారదర్శక సేవలు అందించవచ్చని, అలాగే 2026–27 సంవత్సరానికి సంబంధించిన సబ్‌స్టేషన్ల ఏర్పాటు, డిజిటల్ సేవల అభివృద్ధి ప్రణాళికలను ఆయన వివరించారు. .గృహజ్యోతి’ పథకం కింద లబ్ధిదారుల విద్యుత్ బిల్లుల బకాయిలను ప్రభుత్వం డిస్కంలకు పూర్తిగా చెల్లించడం వల్ల డిస్కం కంపెనీల ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం అయిందని సిఎండి వివరించారు. దీనిపై స్పందించిన భట్టి విక్రమార్క డీటీఆర్ మ్యాపింగ్ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ఏఐ ఆధారిత సాంకేతికతను విద్యుత్ శాఖలో విస్తృతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని ఎనర్జీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు.
సింగరేణి కొత్త బ్లాక్‌లను సాధించాలి
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సింగరేణి సంస్థ కొత్త బొగ్గు బ్లాక్‌లను సాధించి, తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇటీవల మైనింగ్ లీజు లభించిన తాడిచర్ల–2 బ్లాక్‌కు సంబంధించి నిర్ణీత కాలపరిమితిలో అన్ని అనుమతులు సాధించి, యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులను ఆయన ఆదేశించారు.గత ప్రభుత్వ హయాంలో అవసరమైన కొత్త బొగ్గు బ్లాక్‌లను సాధించేందుకు ప్రయత్నించకపోవడం వల్ల ప్రస్తుతం అదనపు బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొత్త గనుల సాధనలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాని ప్రభావం ప్రస్తుతం సింగరేణిపై పడుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నాణ్యమైన బొగ్గును నిరంతరాయంగా, సకాలంలో సరఫరా చేసేలా సమగ్ర కార్యాచరణను అమలు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతున్నందున బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, డిస్పాచ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సింగరేణి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఇప్పటికే ఒడిశాలోని నైనీ బ్లాక్ నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని, అలాగే తెలంగాణలో తాడిచర్ల–2 బ్లాక్‌కు మైనింగ్ లీజు కూడా లభించిందని తెలిపారు. ఇదే సమయంలో గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో సింగరేణికి దక్కకుండా పోయిన కోయగూడెం-3, సత్తుపల్లి-2 బ్లాక్‌లు తిరిగి సింగరేణికే దక్కాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన కార్యాచరణను వెంటనే ప్రారంభించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి ఈ బొగ్గు బ్లాక్‌లు ఎంతో దోహదపడతాయన్నారు. సమావేశంలో టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ , ట్రాన్స్‌కో సీఎండి కృష్ణభాస్కర్, సింగరేణి సిఎండి జ్యోతి బుద్ధ ప్రకాష్, సింగరేణి, జెన్‌కో, డిస్కంల ఉన్నతాధికారులు, ఎనర్జీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





