ముందు అంగన్‌వాడీలకు జీతాలు చెల్లించండి

– బీఆర్ఎస్ లీడర్ హరీశ్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9 : మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని మభ్యపెడుతున్న రేవంత్ రెడ్డీ.. ముందు అంగన్‌వాడీలకు జీతాలు చెల్లించి, మహిళల పట్ల గౌరవాన్ని నిలబెట్టుకో అని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు డిమాండ్ చేశారు. రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62వేల మంది అంగన్‌వాడీల కష్టాలు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నెలలతరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్‌వాడీలను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి ఉసురు తప్పకుండా తగులుతుందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయమన్నారు. అంగన్‌వాడీల సేవలను గుర్తించిన కేసీఆర్ వారు వర్కర్లు కాదని, అంగన్‌వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించారని, వారి గౌరవాన్ని పెంచారని గుర్తు చేశారు. 2014 నాటికి ఆ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేది. కానీ బీఆరఎస్ అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.7,800లకు, అంగన్‌వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800 లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించామన్నారు. అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారని, కానీ రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీగతీ లేదని విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం చáలో సెక్రెటేరియట్‌కు పిలుపునిచ్చిన అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి కర్కశంగా వ్యవహరించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి.. మీ పాలనను అన్ని వర్గాల ప్రజలు ఛీకొడుతున్నారన్న విషయాన్ని గుర్తించండని హితవు పలికారు. అంగన్‌వాడీల వేతనాలను చెల్లించాలని, అప్ గ్రేడ్ చేసిన మినీ అంగన్‌వాడీలకు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పెంచిన వేతనాలను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీష్‌రావు అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *