– 16 ఏళ్లుగా అమలుకు నోచుకోని ‘ఆర్టీఈ’ చట్టం!
– ‘ప్రైవేట్ ‘లో 25% ఉచిత సీట్లపై పేద తల్లిదండ్రుల ప్రశ్న
– ఫీజుల భారం మోయలేక అప్పులపాలు.. ప్రభుత్వంపైనే ఆశలు
సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, జూన్ 9: నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థి హక్కు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలల ఫీజులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెను భారంగా మారాయి. నెలవారీ ఆదాయంలో సగం పిల్లల చదువులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పేద, బలహీన వర్గాల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలనే విద్యాహక్కు చట్టం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది. అయితే చట్టం వచ్చి 16 ఏళ్లు గడుస్తున్నా ఈ నిబంధన క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోకపోవడంపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
విద్య అందరికీ హక్కే.. కానీ అమలు ఎక్కడ?
2009లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశ స్థాయిలో 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలి. విద్యను సామాజిక సమానత్వానికి సాధనంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ తెలంగాణలో ఈ నిబంధన పూర్తిస్థాయిలో అమలుకాకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఆ అవకాశానికి దూరమయ్యారు.
ఫీజుల భారం.. తల్లిదండ్రులకు తలనొప్పి
ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్‌లు, రవాణా ఖర్చులు కలిపి రూ.లక్షలు ఖర్చవుతున్నాయి. రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు, రైతు కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొందరు విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేస్తున్న ఉదంతాలు కూడా కనిపిస్తున్నాయి.
జిల్లాలో వేలాది మందికి లాభం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 120కి పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రతి విద్యాసంస్థలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయిస్తే వేలాది మంది చిన్నారులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇది వరంగా మారనుంది. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి 16 సంవత్సరాలు పూర్తవుతున్నా, రాష్ట్రంలో 25 శాతం ఉచిత సీట్ల అంశం ఇంకా కార్యరూపం దాల్చలేదు. మధ్య మధ్యలో ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు ఈ అంశంపై చర్చించినప్పటికీ స్పష్టమైన అమలు చర్యలు కనిపించలేదు. దీంతో చట్టం కేవలం పుస్తకాలకే పరిమితమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ సంకేతాలతో ఆశలు
ఇటీవల విద్యాహక్కు చట్టం అమలుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో పేద కుటుంబాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరంలోనే అమలుకు శ్రీకారం చుడితే అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు మారే అవకాశం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
అయితే విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు విద్యాహక్కు చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
25% ఉచిత సీట్లను వెంటనే భర్తీ చేయాలి 
భారత రాజ్యాంగంలోని 21-ఏ అధికరణం ప్రకారం విద్యను ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో 2009 విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఆర్థికంగా బలహీన వర్గాలు (ఈ డబ్ల్యూ ఎస్), పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఈ నిబంధనను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం బాధాకరం. పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సిన చట్టబద్ధమైన హక్కు అమలులో నిర్లక్ష్యం చోటుచేసుకోవడం సిగ్గుచేటు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీఈ చట్టాన్ని అమలు చేసి, అర్హులైన విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలను కల్పించాలి.
– మంద అనిల్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, రాజన్న సిరిసిల్ల
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




