ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం నాటి ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా, అంతకుమించి తెలంగాణ సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించేలా ఉన్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు సభ పెట్టాలనుకున్న జనసేనకు హైకోర్టులో షాక్ తగిలింది. హైకోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం మధ్యాహ్నం బహిరంగ సభ పెట్టాలని జనసేన అనుకుంది. ఇందుకు ఉదయం పిటిషన్ వేసింది. ఐతే.. హైకోర్టు.. పిటిషన్‌పై విచారణకు సమయం లేదనీ.. ఇంత అకస్మాత్తుగా విచారణ అంటే కష్టమని అభిప్రాయపడింది. పోలీసుల అభ్యంతరాలను తెలుసుకున్న హైకోర్టు.. పిటిషన్‌ని కొట్టివేసింది. ఐతే.. సాయంత్రం పవన్ కల్యాణ్ జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో నిర్వహించిన ప్రెస్ మీట్ తో ఆయన నిర్వహించాలనుకున్న సభ ఉద్దేశ్యం స్పష్టమైంది. సభ నిర్వహణ ఉద్దేశ్యం కేవలం ఇక్కడి ప్రజల మనోభావాలను కించపరుస్తూ .. రెచ్చగొట్టి .. ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడానికే అని అర్థమవుతుంది.
ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ, పక్క రాష్ట్ర రాజకీయాలు, అక్కడి ప్రజల భావోద్వేగాలను కించపరిచేలా మాట్లాడటం పవన్ కల్యాణ్ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. తెలంగాణ ఖచ్చితంగా నాలుగు కోట్ల ప్రజల అయ్య జాగీరనీ , అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వేచ్ఛా, సాకార స్వప్నమని ఆయన గ్రహించాలి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి చూసే ఏ శక్తినైనా ఇక్కడి ప్రజలు ఉపేక్షించబోరని స్పష్టం చేయాల్సిన చారిత్రక అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు; అది శతాబ్దాల పోరాటాల చరిత్ర, విలక్షణమైన సంస్కృతి, గంగా-జమునా తెహజీబ్ కలయిక. సుదీర్ఘ కాలం పాటు సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరవీరుల త్యాగాల పునాదులపై ఈ రాష్ట్రం ఏర్పడింది. ఎంతోమంది మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, కార్మికులు తమ రక్తాన్ని, చెమటను ధారబోసి సాధించుకున్న గడ్డ ఇది. అలాంటి పవిత్రమైన పోరాట గడ్డను, ఇక్కడి రాజకీయ పరిణామాలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పదజాలంపై నియంత్రణ ఉండాలి. పవన్ కల్యాణ్ తన తాజా ప్రెస్ మీట్‌లో మాట్లాడిన తీరు తెలంగాణ ప్రజల సార్వభౌమత్వాన్ని, వారి రాజకీయ చైతన్యాన్ని అవమానించేలా ఉంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, ఆ విమర్శల పరిధి దాటి ఒక ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదు.
పవన్ కల్యాణ్.. ఒక్కటి గుర్తుంచుకోవాలి .. తెలంగాణ ఖచ్చితంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల “అయ్య జాగీరే”! ఎందుకంటే ఈ గడ్డపై హక్కు ఇక్కడి శ్రమజీవులది, ఇక్కడి మట్టి బిడ్డలది. ఎవరో వలసపాలకుల దయాదాక్షిణ్యాల మీదో, లేక కొందరు రాజకీయ నాయకుల బంధుప్రీతి మీదో ఆధారపడి ఏర్పడిన రాష్ట్రం కాదు ఇది. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన వీరుల గడ్డ ఇది. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమురం భీం వంటి మహానుభావుల వారసత్వం ఉన్న నేల ఇది. “తెలంగాణ ప్రజల హక్కులను, వారి ఆస్తులను, వారి భవిష్యత్తును ప్రశ్నించే హక్కు ఏ బాహ్య శక్తికీ లేదు. ఇక్కడి సంపద, ఇక్కడి భూమి, ఇక్కడి సంస్కృతి సర్వస్వం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల సొంతం.”
ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా ఉంటూ, అక్కడ పాలనను చక్కదిద్దడం, అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించడం పవన్ కల్యాణ్ ప్రథమ కర్తవ్యం. దాన్ని విస్మరించి, తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతూ, ఇక్కడి ప్రజల సెంటిమెంట్లను రెచ్చగొట్టేలా మాట్లాడటం ద్వారా ఆయన ఏం సాధించాలనుకుంటున్నారు? సినిమా గ్లామర్‌తో రాజకీయాల్లోకి వొచ్చి, భావోద్వేగాలతో వోట్లు దండుకోవొచ్చు ఏమో కానీ, తెలంగాణ సమాజం అంత అమాయకమైనది కాదు. ఇక్కడి ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. ఎవరు తమ శ్రేయోభిలాషో, ఎవరు కేవలం స్వార్థ రాజకీయాల కోసం వొస్తున్నారో గుర్తించగల విచక్షణ ఇక్కడి ప్రజలకు ఉంది.
ఒక సాధారణ నటుడిగా ఉన్నప్పటి పవన్ కల్యాణ్‌కు, నేడు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్‌కు చాలా వ్యత్యాసం ఉండాలి. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఒక రాజ్యాంగబద్ధమైన స్థానం. ఆ పదవిలో ఉన్న వ్యక్తి పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి కానీ, ప్రాంతీయ విభేదాలను, విద్వేషాలను రగిల్చేలా మాట్లాడకూడదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో పవన్ కల్యాణ్ తెలంగాణ విషయంలో తన అస్థిర వైఖరిని ప్రదర్శించారు. ఒకసారి తెలంగాణ అమరవీరులని పొగుడుతారు, మరోసారి ఇక్కడి నాయకత్వాన్ని విమర్శిస్తారు. ఈ రకమైన ద్వంద్వ విధానం ఆయన రాజకీయ అపరిపక్వతను మాత్రమే కాకుండా, అవకాశవాద రాజకీయాన్ని కూడా బట్టబయలు చేస్తోంది. తెలంగాణ ప్రజలు అన్ని సందర్భాలలో అందరినీ ఆదరించారు, ఇక్కడికి వలస వొచ్చిన వారిని గుండెల్లో పెట్టుకున్నారు. అంత మాత్రాన ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేరనే విషయాన్ని పవన్ గ్రహించాలి.
తెలంగాణ సమాజం శాంతికాముకమైనది, కానీ తన అస్తిత్వానికి భంగం వాటిల్లితే సింహంలా తిరగబడే గుణం ఈ మట్టిలోనే ఉంది. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. తెలంగాణ ప్రజలకు, వారి పోరాటాలకి కనీస గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. తెలంగాణ జోలికి వొచ్చి, ఇక్కడి ప్రజల మనోభావాలను గాయపరిస్తే.. తెలంగాణ సమాజం తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ ఇక్కడి శ్రమజీవుల సొత్తు, అమరవీరుల త్యాగాల ఫలం. ఈ గడ్డపై హక్కు, అధికారం కేవలం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకే ఉన్నాయి. పవన్ కల్యాణ్ లేదా మరే ఇతర నాయకుడైనా సరే, లక్ష్మణ రేఖ దాటి మాట్లాడితే తెలంగాణ అస్తిత్వ పోరాటం ముందు భస్మం కాక తప్పదు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తన వైఖరిని మార్చుకుని, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని ఆశిద్దాం.





