– ఎన్నికల సంఘం కీలక ప్రకటన
న్యూదిల్లీ, జూన్ 26: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న వోటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో పాస్‌పోర్ట్ పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఒక ముఖ్యమైన వివరణ ఇచ్చింది. వోటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలన్న లేదా ప్రస్తుతం వివరాలను సవరించుకోవాలన్నా అవసరమైన 12 రకాల ధృవీకరణ పత్రాలలో పాస్‌పోర్ట్ కూడా ఒకటిగా ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ వివరణ సాధారణ వోటర్లకు, కొత్తగా వోటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఎంతో ఊరటనిచ్చే అంశం. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1967 పాస్‌పోర్ట్ చట్టాన్ని ఉటంకిస్తూ, పాస్‌పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రమే కానీ, అది పౌరసత్వానికి నిరూపణ కాదని పేర్కొంది. ఈ ప్రకటన సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. పాస్‌పోర్ట్ ఉన్నప్పటికీ పౌరసత్వం విషయంలో సమస్యలు వస్తాయా? వోటర్ల జాబితాలో పాస్‌పోర్ట్ ఆధారంగా పేరు నమోదు చేయడం సాధ్యం కాదా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. దీంతో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం అధికారుల ప్రకారం, వోటర్ల జాబితాలో ఒక వ్యక్తి పేరు చేర్చడానికి ఆ వ్యక్తి భారతీయ పౌరుడై ఉండటం, నిర్ణీత వయసు కలిగి ఉండటం ప్రాథమిక సూత్రం. దీనిని నిరూపించడానికి వోటరు నమోదు అధికారి కొన్ని పత్రాలను పరిశీలిస్తారు. ఈ పత్రాల జాబితాలో పాస్‌పోర్ట్ ఎప్పటి నుంచో ఉంది. అది అలాగే కొనసాగుతుంది. ‘‘ పాస్‌పోర్ట్ అనేది ఒక వ్యక్తి గుర్తింపును, నివాసాన్ని ధృవీకరించే కీలక పత్రం. ఇందులో ఎలాంటి మార్పు లేదు’’ అని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు. గతంలో బిహార్‌లో జరిగిన అసోంలో జరిగిన ప్రత్యేక సవరణలు, ఆ తర్వాత జరిగిన వివిధ దశల వోటర్ల జాబితా సవరణలలో కూడా పాస్‌పోర్ట్‌ను ఒక ప్రామాణిక పత్రంగానే పరిగణించారు. గత 12 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి కొత్త విధానాన్ని తీసుకురాలేదని, పాత పద్ధతులే అమల్లో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంటే దశాబ్ద కాలంగా పాస్‌పోర్ట్ అనేది వోటరుగా నమోదు కావడానికి ఒక నమ్మదగిన ఆధారంగా ఉంటూ వస్తోంది. చట్టపరంగా చూస్తే పాస్‌పోర్ట్ అనేది ఒక వ్యక్తి భారత వెలుపలికి వెళ్లడానికి లేదా తిరిగి రావడానికి ఇచ్చే ప్రయాణ పత్రం. అయితే వోటర్ల జాబితా తయారీ సమయంలో , సదరు వ్యక్తి వివరాలను సరిచూడటానికి అధికారులు కోరే 12 పత్రాలలో ఇది ఒకటి. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దరఖాస్తుదారు సమర్పించిన ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వోటు హక్కుపై నిర్ణయం తీసుకుంటారు. వోటు హక్కు కోసం దరఖాస్తు చేసేటప్పుడు పాస్‌పోర్ట్ మాత్రమే కాకుండా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి మరో 11 పత్రాలను కూడా ప్రభుత్వం అనుమతిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల సంఘం కానీ పాస్‌పోర్ట్ ప్రాముఖ్యతను తగ్గించే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వోటరు నమోదు ప్రక్రియలో దరఖాస్తుదారు పత్రాలను అంగీకరించే పూర్తి అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది. పాస్‌పోర్ట్ సమర్పించినప్పుడు దాన్ని నిరాకరించడానికి వీలులేదని తాజా వివరణ ద్వారా స్పష్టమవుతుంది.
ఆన్‌లైన్‌లోనూ నమోదు చేసుకోవచ్చు
తెలంగాణలో వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. జులై 24వ తేదీ వరకు దీనిని నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్‌వోలు) ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తున్నారు. వోటర్లు వీటికి పూర్తి చేసిన తర్వాత బీఎల్‌వోలకు అందించాల్సి ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫారంలు అందించిన రెండు, మూడు రోజుల తర్వాత బీఎల్‌వోలు మళ్లీ ఇంటింటికి వెళ్లి ఈ ఫారాలను స్వీకరిస్తారు. తెలుగులో కూడా ఈ పత్రాలు ఉంటాయి. దీంతో నిర్లక్షరాశ్యుల కూడా సులువుగా అర్థం చేసుకుని ఫారం నింపవచ్చు. రోజూ 50 ఇళ్లకు వెళ్లి బీఎల్‌వోలు ఈ దరఖాస్తులను అందించాల్సి ఉంటుంది. గడువు తేదీలోపు ప్రక్రియను పూర్తి చేయాలని బీఎల్‌వోలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి విమర్శలు రాకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తం 3,38,26,448 మంది వోటర్లు ఉన్నారు. వీరందరికి బీఎల్‌వోలు ఫారాలను అందించాలి. అనంతరం వోటర్లు వాటిని పూర్తి చేసి తిరిగి అందించాలి. బీఎల్‌వోలు తీసుకోకపోతే ఈసీ టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. జులై 24లోపు వీటిని వోటర్లందరూ అందించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లోనే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా ఫారం నింపవచ్చు. ఈ విషయం చాలామందికి తెలియక ఆన్‌లైన్ సౌకర్యం ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలను ఈసీ వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చు. మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీతో లాగిన్ అయ్యి సులువుగా ఫారం నింపవచ్చు. ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్.. ఈ రెండిటిల్లో ఏ విధానం ద్వారా అయినా సమర్పించవచ్చు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





