కొత్త సీఎస్‌గా సంజయ్‌ ‌జాజు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
– 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ అధికారి
– 30‌తో ముగియనున్న రామకృష్ణారావు పదవీ కాలం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 26: రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ ‌జాజు నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్‌ కె.రామకృష్ణారావు పదవీ కాలం జూన్‌ 30‌తో ముగియనుంది. అదే రోజున సంజయ్‌ ‌జాజు సీఎస్‌ ‌ బాధ్య‌త‌లు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక అభ్యర్థన మేరకు కేంద్ర కేబినెట్‌ ‌నియామకాల కమిటీ  ఆయన్ను కేంద్ర సర్వీసుల నుండి రిలీవ్‌ ‌చేసి మాతృ కేడర్‌కు పంపిన మరుసటి రోజే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. సంజయ్‌ ‌జాజుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు కేంద్రంలోనూ అత్యంత సమర్థుడైన అధికారిగా పేరుంది. 1992 బ్యాచ్‌ ‌తెలంగాణ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన గతంలో ఉమ్మడి ఏపీలో ఐటీ డిపార్ట్‌మెంట్‌ ‌సెక్రటరీగా పనిచేసినప్పుడు నేటికీ ప్రజలకు అందుబాటులో ఉన్న విప్లవాత్మక డిజిటల్‌ ‌సేవలైన మీసేవ, మున్సిపల్‌ ‌పరిధిలో సౌకర్యం  ప్రాజెక్టులను డిజైన్‌ ‌చేసి అమలు చేసిన ఘనత సాధించారు. అంతేకాక గతంలో ఉమ్మడి హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌కమిషనర్‌గా, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా, విభజన తర్వాత దిల్లీలోని తెలంగాణ భవన్‌ ‌ప్రతినిధిగా పలు హోదాల్లో సేవలందించి క్షేత్రస్థాయి పరిపాలనపై తిరుగులేని పట్టు సాధించారు. సంజయ్‌ ‌జాజు గత 13 ఏళ్లుగా కేంద్ర సర్వీసుల్లో డెప్యుటేషన్‌పై అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర రక్షణ ఉత్పాదక శాఖ, కేంద్ర సమాచార-ప్రసారాల శాఖ   సెక్రటరీగా దేశ డిజిటల్‌, ‌రక్షణ రంగాల విధాన నిర్ణయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణకు తిరిగి వచ్చే ముందు ఆయన కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్రంలో సుదీర్ఘ కాలం పనిచేయడం వల్ల దిల్లీ సర్కిళ్లలో గల ఉన్నతాధికారులు, వివిధ మంత్రిత్వ శాఖలతో ఆయనకు ఉన్న బలమైన నెట్‌వర్క్ ‌రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగపడనుందని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి.  రేసులో జయేష్‌ ‌రంజన్‌, ‌వికాస్‌ ‌రాజ్‌ ‌వంటి పలువురు సీనియర్ల పేర్లు వినిపించినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి మాత్రం సంజయ్‌ ‌జాజు వైపే మొగ్గు చూపారు. దీనికి ప్రధాన కారణం ఆయనకున్న క్లీన్‌ ఇమేజ్, వివాదరహిత ట్రాక్‌ ‌రికార్డ్. ‌రాష్ట్రంలో గుణాత్మక మార్పులు, పాలనా సంస్కరణలు తేవాలని భావిస్తున్న రేవంత్‌ ‌రెడ్డికి ఐటీ, డిజిటల్‌ ‌పరిపాలనలో ఎక్స్‌పర్ట్ అయిన జాజు అయితేనే కరెక్ట్ అని భావించారు. అంతేకాక కేంద్ర నిధుల సాధనలోను, కేంద్ర-రాష్ట్రాల మధ్య పెండింగ్‌ ‌జల వివాదాలు, విభజన సమస్యల పరిష్కారంలో జాజుకు దిల్లీలో ఉన్న సీనియారిటీ, పట్టు రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీరామరక్షగా మారుతుందని సీఎం గట్టిగా విశ్వసించారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత మాతృ రాష్ట్రానికి తిరిగి వస్తున్న సంజయ్‌ ‌జాజుకు పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్యారెంటీల అమలు, రాష్ట్ర ఆర్థిక వనరుల సమీకరణ, పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి పరిపాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. ఒకవైపు ఐటీ విజనరీగా, మరోవైపు కఠినమైన టాస్క్ ‌మాస్టర్‌గా పేరు తెచ్చుకున్న సంజయ్‌ ‌జాజు.. రాబోయే రోజుల్లో రాష్ట్ర బ్యూరోక్రసీని ఏ విధంగా లీడ్‌ ‌చేస్తారనేది సచివాలయ ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *