పాస్‌పోర్ట్, ఆధార్‌ను ధ్రువీకరణ పత్రాలుగా గుర్తించాలి

-కేంద్ర విదేశాంగశాఖ ప్రకటన సరైంది కాదు
-కాంగ్రెస్‌ ఎం‌పీ శశి థరూర్‌ ‌కీలక వ్యాఖ్యలు

న్యూదిల్లీ, జూన్‌ 26: ‌పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వాన్ని నిర్ధరించే పత్రం కాదని కేంద్ర విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ ఎం‌పీ శశి థరూర్‌ ‌స్పందించారు. కేంద్రం చెబుతున్న విధానం చట్టపరంగా ఒక విచిత్రమైన పరిస్థితిని సృష్టిస్తోందని విమర్శించారు. పాస్‌పోర్ట్ ‌పౌరసత్వానికి రుజువు కాదని, ఆధార్‌ ‌కూడా పౌరసత్వాన్ని నిర్ధరించదని చెబితే సాధారణ భారతీయుడు తన పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఆ అంశంపై ఉన్న అయోమయాన్ని తొలగించేందుకు చట్టాల్లో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన పాస్‌పోర్ట్ ‌సేవా దివస్‌ సందర్భంగా భారత పాస్‌పోర్ట్ ‌ప్రధానంగా విదేశీ ప్రయాణానికి ఉపయోగించే పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి ధ్రువీకరణ పత్రం కాదని స్పష్టం చేసింది. ఆ ప్రకటన అనంతరం సామాజిక మాధ్యమాలు, రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. దీనిపై శుక్రవారం ‘ఎక్స్’ ‌వేదికగా స్పందించిన శశి థరూర్‌, ‌కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తూ పోస్టు చేశారు. ఇదిలా ఉండగా, ఆధార్‌ ‌కార్డుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు. ఆధార్‌ అనేది వ్యక్తి గుర్తింపు, నివాసానికి సంబంధించిన పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి ఆధారం కాదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం కోట్లాది మంది భారతీయులు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఆ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. చట్టాల్లో మార్పులు చేసి, ప్రభుత్వం రద్దు చేయనంత వరకు చెల్లుబాటులో ఉన్న భారత పాస్‌పోర్ట్ ‌లేదా సాధారణ ఆధార్‌ ‌కార్డును భారత పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తించాలని సూచించారు. అలాగే, భారతీయులు, నివాసితులకు ప్రత్యేక రంగు లేదా ప్రత్యేక గుర్తింపుతో ఉండే ఆధార్‌? ‌కార్డులను యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా జారీ చేయాలని ప్రతిపాదించారు. ఈ విధంగా భారతీయ పౌరులు, పౌరులు కాని వారిని స్పష్టంగా వేరు చేయవచ్చని శశి థరూర్‌ అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత సాధారణ ఆధార్‌ ‌కార్డు లేదా చెల్లుబాటులో ఉన్న భారత పాస్‌పోర్ట్‌ను పౌరసత్వ ధ్రువీకరణ పత్రంగా ప్రభుత్వం గుర్తించవచ్చని చెప్పారు. దీంతో ఎన్నికల జాబితాల సవరణలు వంటి ప్రక్రియల్లో అనవసర వివాదాలు తగ్గుతాయని, పరిపాలనా ప్రక్రియలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఈ రెండు పత్రాల్లో ఏదో ఒకటి ఉంటే భారత పౌరుడిగా గుర్తించే విధానాన్ని అమలు చేస్తే, పౌరసత్వంపై అనవసర చర్చలకు ముగింపు పడుతుంది. ప్రజలకు కూడా తమ గుర్తింపు విషయంలో పూర్తి చట్టపరమైన స్పష్టత లభిస్తుంది అని శశి థరూర్‌ ‌తన పోస్టులో పేర్కొన్నారు.ఇదిలా ఉండగా, విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం నిర్వహించిన సమావేశంలో భారత పాస్‌పోర్ట్ ‌ప్రధానంగా ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి తుది ఆధారం కాదని వెల్లడించింది. అనంతరం గురువారం కూడా ఆ అంశంపై మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇటీవల లేదా గత 12 ఏళ్లలో పాస్‌పోర్ట్‌ను పౌరసత్వ ధ్రువీకరణ పత్రంగా ఎప్పుడూ ప్రకటించలేదని తెలిపింది. దీనికి ఆధారంగా పాస్‌పోర్ట్ ‌చట్టం-1967లోని సెక్షన్‌-20‌ను కేంద్రం ప్రస్తావించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే భారత పౌరుడు కాని వ్యక్తికీ కూడా కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ ‌లేదా ప్రయాణ పత్రాన్ని జారీ చేయవచ్చని ఆ సెక్షన్‌లో స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా, 2013లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కేంద్రం ప్రస్తావించింది. కేవలం పాస్‌పోర్ట్ ‌కలిగి ఉండటం వల్ల మాత్రమే ఒక వ్యక్తి భారత పౌరుడిగా నిర్ధారణ కాదని హైకోర్టు అప్పుడే స్పష్టం చేసిందని తెలిపింది. కేంద్రం వివరణ, శశిథరూర్‌ ‌వ్యాఖ్యలతో పాస్‌పోర్ట్, ఆధార్‌, ‌పౌరసత్వ ధ్రువీకరణకు సంబంధించిన అంశం ఇప్పుడు రాజకీయంగా, చట్టపరంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *