వేల మంది సైన్యానికి ఎదురు నిలిచిన‌ ఇమామ్‌

– ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
– ఇమామ్‌ త్యాగాన్ని స్మరించుకున్న ప్రధాని

న్యూదిల్లీ, జూన్‌ 26: ‌మొహర్రం పవిత్ర మాసం సందర్భంగా.. సత్యం, ధర్మం కోసం హజ్రత్‌ ఇమామ్‌ ‌హుస్సేన్‌ ‌చేసిన అత్యున్నత త్యాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక సోషల్‌ ‌మీడియా ప్లాట్‌ఫామ్‌ (‌గతంలో ట్విట్టర్‌) ‌ద్వారా ఒక సందేశాన్ని పంచుకున్నారు. హజ్రత్‌ ఇమామ్‌ ‌హుస్సేన్‌ ‌చేసిన త్యాగం సత్యం, న్యాయం కోసం స్థిరంగా పోరాడేలా ఎంతోమందికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఇది అచంచలమైన ధైర్యం, విశ్వాసానికి సజీవ ప్రతీకగా నిలుస్తుంది’ అని ప్రధాని తెలిపారు. ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్‌ ‌ప్రవక్త మనవడే (కూతురు ఫాతిమా, అల్లుడు అలీల కుమారుడు) హజ్రత్‌ ఇమామ్‌ ‌హుస్సేన్‌. ఇస్లామిక్‌ ‌క్యాలెండర్‌ ‌ప్రకారం మొదటి నెల అయిన మొహర్రంలో 10వ రోజును ‘ఆషూరా’ అని పిలుస్తారు. ఈ రోజున షియా ముస్లింలు ఇమామ్‌ ‌హుస్సేన్‌, ఆయన అనుచరుల అమరత్వాన్ని స్మరించుకుంటూ దీనిని అత్యంత విషాద దినంగా పాటిస్తారు. క్రీస్తుశకం 680 (హిజ్రీ సంవత్సరం 61)లో ప్రస్తుత ఇరాక్‌ ‌దేశంలోని ‘కర్బలా’  అనే ప్రాంతంలో జరిగిన చరిత్రాత్మక యుద్ధంలో ఈ మహా త్యాగం జరిగింది. ఆ సమయంలో ఉమయ్యద్‌ ‌రాజవంశానికి చెందిన పాలకుడు యజీద్‌, ‌తనను ఇస్లామిక్‌ ‌సామ్రాజ్యానికి ఏకైక నాయకుడిగా (ఖలీఫాగా) అందరూ అంగీకరించాలని డిమాండ్‌ ‌చేశాడు. అయితే, యజీద్‌ ఒక క్రూరుడు, అవినీతిపరుడు, ఇస్లాం ప్రాథమిక, నైతిక సూత్రాలకు విరుద్ధంగా పాలించేవాడు. ఆయన పాలనను అంగీకరిస్తే, అది సత్యం, ధర్మాన్ని కాలరాయడమే అవుతుందని ఇమామ్‌ ‌హుస్సేన్‌ ‌దృఢంగా భావించారని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా లోని ఇస్లామిక్‌ ‌హిస్టరీ అండ్‌ ‌బ్యాటిల్‌ ఆఫ్‌ ‌కర్బలా చెబుతోంది. అధికార దాహంతో ఉన్న యజీద్‌కు లొంగిపోవడానికి నిరాకరించిన ఇమామ్‌ ‌హుస్సేన్‌, ‌కేవలం 72 మంది కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి యజీద్‌ ‌పంపిన వేల మంది సైన్యంతో కర్బలా మైదానంలో ఎదురునిలిచారు. ఆ చిన్న సమూహంలో 6 నెలల పసికందుతో పాటు మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. శత్రువులు వారి దారుణత్వాన్ని ప్రదర్శిస్తూ, యుఫ్రటీస్‌ ‌నది  నుంచి ఇమామ్‌ ‌హుస్సేన్‌ ‌బృందానికి చుక్క నీరు కూడా అందకుండా మూడు రోజులపాటు అడ్డుకున్నారు. మండుటెండలో దాహంతో అలమటిస్తున్నప్పటికీ వారు ధర్మాన్ని వీడలేదు. చివరగా, ఆషూరా రోజున జరిగిన అసమాన పోరులో హజ్రత్‌ ఇమామ్‌ ‌హుస్సేన్‌, ఆయన అనుచరులు  వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *