పేపర్ లీక్.. ‘నీట్’ రద్దు

– ఎన్‌టిఏ నిర్ణయం
– సీబీఐ విచారణకు ఆదేశించినట్లు వెల్లడి

న్యూదిల్లీ, మే 12: పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో జాతీయ అర్హత పరీక్ష ‘నీట్’ యూజీ-2026 రద్దు అయింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం రాజస్థాన్‌లో లీక్ అయినట్లు వచ్చిన వార్తలు పెనుదుమారం రేపాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈనెల 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తూ జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. కొత్త పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఫీజు చెల్లించనక్కర్లేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని పేర్కొంది. ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపరును గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ వెల్లడించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చినట్లు గుర్తించారు. ఇందులోని సమాచారం, ‘నీట’ ప్రశ్నపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలతో పోలి ఉండటం గమనార్హం. కొన్ని ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా అచ్చం ఒకేలా ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఆ ప్రాక్టీసు పేపరు కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తులో వెల్లడైంది. ఆ వ్యక్తి ఈనెల 1న సికార్‌లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడని, ఆ తర్వాత అది పీజీ వసతి గృహాలు, కోచింగ్ నెట్‌వర్క్‌లు, కెరీర్ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని అధికారులు తెలిపారు. ఆ మెటీరియల్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించారు. దీనిని విద్యార్థులకు రూ.20వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించారని, కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే రూ.30 వేలకు పైగా వసూలు చేశారని గుర్తించామని రాజస్థాన్ పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.

పేపర్ లీక్ కేసులో 13మంది అరెస్ట్‌

జైపూర్, మే 12: రాజస్థాన్‌లోని సికార్‌లో ‘నీట్’ పేపర్ లీక్ కేసు వ్యవహారంలో పోలీసులు 13 మందిని మంగళవారం అరెస్టు చేశారు. వీరిని విచారిస్తున్నారు. ’గెస్ పేపర్’ పేరుతో మార్కెట్‌లోకి ఈ ప్రశ్నాపత్రం వచ్చింది. ప్రభుత్వం నిర్వహించిన ప్రశ్నాపత్రంతో ఈ ’గెస్ పేపర్’ 100 శాతం సరిపోలినట్లు అధికారులు గుర్తించారు. అలాగే 3వ తేదీన పరీక్ష నిర్వహించగా అంతకుముందే పేపర్ లీక్ అయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రశ్నాపత్రాన్ని రూ 20 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించినట్లు గుర్తించారు. కేరళలోని ఒక ఎంబీబీఎస్ విద్యార్థి వద్ద ఈ పేపర్ లీక్ అయినట్లు పోలీసులు కనుగొన్నారు. 1వ తేదీన సికార్‌లోని స్నేహితుడితో ఎంబీబీఎస్ విద్యార్థి ఈ ప్రశ్నాపత్రం పంచుకున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత కోచింగ్ సెంటర్లు, అభ్యర్థులకు ఈ పేపర్ లీక్ అయినట్లు సమాచారం. పరీక్షల్లో అసలు ప్రశ్నాపత్రంలోని 140 ప్రశ్నలు సరిపోలాయి. ఈ 140 ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్ష నిర్వహించే తేదీలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *