అయోధ్య దొంగతనం కేసులో కీలక మలుపు!

– ట్రస్ట్ ప్రధాన కార్యదర్శులు రాజీనామా !

న్యూఢిల్లీ, జూన్ 26: సిట్ దర్యాప్తు అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అయోధ్య రామ మందిర కానుకల చోరీ కేసు మరింత ముదిరింది. రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పుడు రాజీనామా చేశారు. ఆయనతోపాటు అనిల్ మిశ్రా కూడా తప్పుకున్నారు. విరాళాలు, కానుకల దొంగతనం ఆరోపణల నేపథ్యంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామా చేయాలని ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. అందుకే వారు తప్పుకున్నారు. రామ మందిర విరాళాల దొంగతనం కేసులో సిట్ నివేదిక నేపథ్యంలో, పోలీసులు అరెస్టు చేసిన ఎనిమిదిమందిపై కేసు నమోదు చేశారు. మొహర్రం కారణంగా ఈరోజు కోర్టులకు సెలవు. అందువల్ల, నిందితులను డ్యూటీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తారు. రామ మందిర కానుకల దొంగతనం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అయిన అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించిందని ఆయన తెలిపారు. సిట్ వేగంగా దర్యాప్తు జరిపి తన నివేదికను సమర్పించగా, వెంటనే కేసులు నమోదు చేశారు. ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే వారిని వదిలిపెట్టబోమని ఆయన అన్నారు. అయోధ్య హిందూ విశ్వాసానికి ప్రతీక. విశ్వాసాన్ని దెబ్బతీయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో కానుకల దొంగతనం జరిగింది. ఇది బహిర్గతమైన వెంటనే ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేసింది.  దాని నివేదిక ఆధారంగా 25న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో పలువురు గుర్తుతెలియని వ్యక్తులతోపాటు, ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. ట్రస్ట్ సభ్యుడు కృష్ణమోహన్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా, శ్రీ రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఎఆర్ అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్కష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, శ్రీరామ్ శంకర్ యాదవ్ అలియాస్ తిను పేర్లు చేర్చారు. గుర్తించని ఇతర వ్యక్తులను కూడా నిందితులుగా పేర్కొన్నారు. నిందితులపై భారత శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(ఎ) కింద అభియోగాలు మోపారు. ఎస్ఐఆర్ నమోదైన వారందరూ ఆలయంలోని విరాళాలు, నగదు నిర్వహణతో ఏదో ఒక విధంగా ఆలయం ట్రస్ట్ లో సంబంధం కలిగి ఉన్నారని చెబుతున్నారు. ట్రస్టు ప్రధాన కార్యదర్శి  చంపత్ రాయ్  తిన్ను యాదవ్ కు సహచరుడని చెబుతున్నారు. విరాళాల పెట్టె తాళాలు అతని వద్దే ఉన్నాయని విచారణలో వెల్లడైంది. అనుకల్ప్ మిశ్రా విరాళాలను లెక్కించేవాడు లవ్కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రాకు బంధువని చెబుతున్నారు. మనీష్ యాదవ్, తిన్ను యాదవ్ మేనల్లుడు. సుభాష్ శ్రీవాస్తవ నగదు లెక్కించేవాడు. విరాళాల లెక్కింపు ప్రక్రియలో అవినాష్ శుక్లా కూడా పాలుపంచుకున్నాడు. కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా కూడా నగదు లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. ఎఫ్ఆర్లో నిందితులుగా పేర్కొన్న వ్యక్తులు చాలావరకు కానుకల లెక్కింపు, నగదు నిర్వహణ ప్రక్రియలో పాలుపంచుకున్న ఉ ద్యోగులేనని అర్థమవుతోంది. వీరు వ్యవస్థలోని కింది స్థాయి వ్యక్తులు మాత్రమేనా, లేక ఈ వ్యవస్థ మొత్తం ఉన్నతాధికారుల ఆదేశాలు, రక్షణలో పనిచేస్తోందా అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *