– ఒకే నగరం, ఒకే పరిపాలన, ఒకే చట్టం ఈ బిల్లు నినాదం
– నాలుగు రకాల కఠిన చర్యల ప్రతిపాదన
– అనుమతి లేని భవనాలకు ఆస్తి పన్నుపై వంద నుంచి 300 శాతం జరిమానా
– భవన వినియోగాన్ని మార్చినా ఫైన్ తప్పదు
– నోటీసు ఇచ్చిన 15 రోజుల్లోగా యజమాని ఇంటిని కూల్చేయాలి
– లేకపోతే బల్దియా ఆపని చేసి ఖర్చును ఆస్తి పన్నులో కలుపుతారు
– సీఎం ఛైర్మన్ గా అత్యున్నత పాలనా మండలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: దాదాపు 70 ఏళ్ల నాటి పాత జీహెచ్‌ఎంసీ-1955 చట్టం స్థానంలో ప్రతిష్టాత్మక “క్యూర్ బిల్లు-2026” ను తెలంగాణ శాసనసభలో రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్నందున, ముఖ్యమంత్రి తరఫున మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. “ఒకే నగరం, ఒకే పరిపాలన, ఒకే చట్టం” అనే నినాదంతో ఈ బిల్లును రూపొందించారు. ఈ చట్టం ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న జీహెచ్‌ఎంసీ , పరిసర మున్సిపల్ కార్పొరేషన్లు (ఎంఎంసీ), మున్సిపల్ కౌన్సిళ్లు (సీఎంసీ) అన్నింటికీ ఈ చట్టం వర్తిస్తుంది.ఈ బిల్లులో మొత్తం 5 భాగాలు, 43 చాప్టర్లు, 319 సెక్షన్లు, 9 షెడ్యూళ్లు ఉన్నాయి. అక్రమ కట్టడాల నియంత్రణకు ఈ బిల్లులో 4 రకాల కఠినమైన చర్యలను ప్రతిపాదించారు. అనుమతి లేని భవన నిర్మాణాలపై ఆస్తిపన్నుపై 100 శాతం నుండి 300 శాతం వరకు జరిమానా విధిస్తారు. బిల్లులోని 94వ సెక్షన్ కింద భవనం వినియోగాన్ని (ఉదాహరణకు రెసిడెన్షియల్ నుండి కమర్షియల్‌గా) మార్చినా ఫైన్ పడుతుంది. 164, 165 సెక్షన్ల కింద అనుమతి లేని భవనాలకు అధికారులు నోటీసు ఇచ్చిన 15 రోజుల్లోగా చర్యలు తీసుకుంటారు. యజమాని స్వయంగా కూల్చుకోకపోతే, బల్దియానే కూల్చివేసి ఆ ఖర్చును ఆస్తిపన్నులో జమ చేస్తుంది. అక్రమ కట్టడాలను సీజ్ చేయడంతో పాటు విద్యుత్, నీటి సరఫరా వంటి కనెక్షన్లను నిలిపివేస్తారు. నగరంలో వేర్వేరు సంస్థల (మున్సిపాలిటీ, పోలీస్, వాటర్ బోర్డ్, హైడ్రా) మధ్య సమన్వయ లోపాన్ని తొలగించి, ఒకే గొడుగు కిందికి తీసుకురావడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. డిజిటల్ సేవలు, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, వ్యాపార సౌలభ్యం మరియు మహిళా కార్మికులకు అనుకూలమైన మౌలిక వసతుల కల్పనకు ఈ బిల్లులో ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాద్ మహానగర భవిష్యత్తును, స్థిరమైన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ సమూల మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ట్రాఫిక్, చెరువులు, వరదలు, వాతావరణ మార్పు, విపత్తులు మరియు యుటిలిటీ పనులు వంటి అనేక సమస్యలు మూడు కార్పొరేషన్ల సరిహద్దులను దాటి ఉంటాయి. కాబట్టి వీటిని క్యూర్ మొత్తం స్థాయిలోనే సమర్థవంతంగా పరిష్కరించవచ్చు. ప్రతి కార్పొరేషన్‌లో వార్డు స్థాయి పరిపాలనను వికేంద్రీకృతంగానే కొనసాగుతుంది. అదే సమయంలో మొత్తం వ్యవస్థ సమన్వయంతో, సామరస్యపూర్వకంగా పనిచేసేలా కొత్త సంస్థలను ఏర్పాటవుతాయి. 259, 260 సెక్షన్ల కింద క్యూర్ కోఆర్డనేషన్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్డు భద్రత రహదారి పనులను సమన్వయం చేసి, రోడ్ల తవ్వకాలకు సంబంధించిన నిబంధనలను ఈ కమిటీ అమలు చేస్తుంది. 244 నుంచి 247 మరియు 255 సెక్షన్ల కింద వాతావరణ చర్యల కోసం క్లైమెట్ యాక్షన్ కమిటీ, సరస్సుల రక్షణ కమిటీలు వీటికి మద్దతుగా గ్రీన్ ఎనర్జీ, కార్బన్ ట్రాన్సిషన్ ఫండ్ ఏర్పాటవుతాయి. క్యూర్ హెరిటేజ్ కమిటీ (సెక్షన్లు 264 నుంచి 268), ప్రకటనలు మరియు సైన్‌బోర్డులకు ఏకైక నోడల్ సంస్థగా, ఎడ్వర్‌టైజ్‌మెంట్ రెగ్యులేటరీ కమిటీ (సెక్షన్లు 274 నుంచి 276), ఆహారభద్రత, పోషణ కమిటీ (సెక్షన్ 263), అలాగే జండర్ ఇంక్లూజన్ సెల్, అర్బన్ లైవ్‌లీహుడ్ కోఆర్డినేషన్ సెల్ (సెక్షన్లు 277 నుంచి 279 మరియు 281 నుంచి 283) ఏర్పాటు చేయబడతాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు తప్పనిసరి డేటా భాగస్వామ్యం మరియు పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్, సేవలు మరియు అనుమతుల కోసం ఒకే పోర్టల్, ఆస్తి పన్ను, నీటి, మురుగునీటి మరియు పారిశుధ్య ఛార్జీల కోసం ఒకే సమగ్ర బిల్లు (సెక్షన్లు 269 నుంచి 271) ఏర్పాటు చేయబడుతుంది. రియల్‌టైమ్ పర్యవేక్షణ మరియు సమన్వయంతో స్పందించేందుకు స్మార్ట్ సెంటర్ (సెక్షన్లు 272 మరియు 273) ఏర్పాటు చేయబడుతుంది. క్యూర్ అప్పీలేట్ అథారిటీ (సెక్షన్లు 289 నుంచి 301) ప్రత్యేక అప్పీల్ వ్యవస్థను అందిస్తుంది. ప్రభుత్వం శాఖల అధికార పరిధులను క్యూర్ పరిధితో సమానంగా మార్చడానికి, అలాగే వివిధ సంస్థల మధ్య విధులను బదిలీ చేయడానికి అవకాశం కలిగి ఉంటుంది. నీటి సరఫరా మరియు మురుగునీటి నిర్వహణకు హెచ్ ఎండబ్ల్యు ఎస్ ఎస్‌బీ అనే ఏకైక ప్రాధికార సంస్థగా ధృవీకరిస్తూ, అధ్యాయం 27 మరియు సెక్షన్లు 312, 314లో సంబంధిత నిబంధనలు పొందుపరచబడ్డాయి. మొత్తంగా చూస్తే, ఈ బిల్లు 1955 చట్టంలోని సమర్థవంతంగా పనిచేసిన అంశాలను కొనసాగిస్తూ, కాలానుగుణంగా అనవసరమైన అంశాలను తొలగించి, పాత చట్టంలో ఎన్నడూ లేని అవసరమైన కొత్త వ్యవస్థను అందిస్తుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





