నెలలోగా జత స్కూల్ యూనిఫాం అందించాలి

– కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలల్లోని ప్రతీ విద్యార్థికి రెండు యూనిఫాంల చొప్పున నెల రోజుల్లోగా అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. స్కూల్ యూనిఫాంల తయారీ, పంపిణీ, ఎల్-నినో నేపథ్యంలో చేపట్టిన ప్రత్యామ్నాయ ప్రణాళికపై సచివాలయం నుండి ఆయన శుక్ర వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. యూనిఫాంలను కుట్టించడానికి 26 వేలమంది స్వయం సహాయక బృందాల మహిళలను గుర్తించామని అధికారులు తెలిపారు. స్కూల్ యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని, విద్యార్థులకు అందిన స్కూల్ డ్రెస్‌లు, షూస్ తదితర స్కూల్ కిట్స్ నాణ్యతపై నేరుగా విధ్యార్థుల నుండే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సీఎస్ గుర్తు చేశారు. సకాలంలో యూనిఫాంలను కుట్టించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని, దీనిపై జిల్లా, మండలస్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్రంలో 27 శాతం లోటు వర్షపాతం

ఐఎండీ నివేదికల ప్రకారం దేశంలోనే ఎల్-నినో ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, ఇప్పటివరకు రాష్ట్రంలో 27శాతం లోటు వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఏడు జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందని, మిగతా 385 మండల్లాల్లో లోటు వర్షపాతం ఉందని అన్నారు. వాతావరణ వివరాలను రాష్ట్రంలోని రైతులకు ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తున్నామని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా వర్షాలు ఆశాజనకంగా లేవని, ప్రస్తుతం మేజర్ రిజర్వాయర్లలో ఉన్న నీటిని తాగునీటికి నిల్వ చేస్తున్నామని, ఈ నేపథ్యంలో రైతులు వరి మినహా ఇతర ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఇప్పటివరకు వరి సాగు 24 శాతం కంటే తక్కువ నమోదైందన్నారు. సెప్టెంబర్‌లోనూ వర్షాలు అతి తక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసిందని తెలిపారు. వరికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధర లభిస్తున్నందున ఆ దిశగా రైతులను చైతన్యపర్చాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సీజన్‌లో ఫామ్ పాండ్స్‌ల నిర్మాణం విస్తృతంగా చేపట్టాలని సీఎస్ సూచించారు. ప్రతీ 45 రోజులకు ఒకసారి ఖచ్చితంగా మండల సమావేశాలను నిర్వహించే విధంగా సంబంధిత అధికారులు ప్రణాళికలను రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీసీలో స్పెషల్ సీఎస్‌లు సబ్యసాచి ఘోష్, దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపీ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ దివ్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *