“కనీస వేతనాల” పట్టకం నుంచి మన జీవన దృశ్యం

“మొత్తం మీద సగటున నెలజీతం రు. 14,000 నుంచి రు. 20,000 వరకు మాత్రమే ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం తన ఔదార్యం చూపుకుంది. అంటే రోజుకు కనిష్ట స్థాయిలో రు. 538, గరిష్ట స్థాయిలో రు. 769 అన్నమాట. కుటుంబ సభ్యులలో మరొకరు కూడా వేడి నీళ్లకు చన్నీళ్లలా ఏదో ఒక చిరుద్యోగం, పని చేస్తున్నారనుకున్నా, ఇద్దరు చదువుకునే చిన్నారి పిల్లలో, వృద్ధులైన తల్లిదండ్రులలో ఒకరో ఆధారపడి ఉన్నారనుకుంటే, ఇంటి అద్దె, ప్రయాణ ఖర్చులు, అన్నపానాలు, విద్య, వైద్యం, వినోదం అన్నీ కలిసి సగటున ఒక్కొక్కరు నెలకు రు. 3,500-5,000 (రోజుకు రు. 116-166) తో “కనీస” జీవనం గడపగలరని ప్రభుత్వం అనుకుంటున్నది. అబ్బ, ఎంత ఔదార్యం!”

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఒక కోటీ పది లక్షల మంది శ్రామికులకు, ఉద్యోగులకు జూన్ 1 నుంచి అమలులోకి వచ్చేలా కనీస వేతనాలను నిర్దేశిస్తూ ఒక విధాన ప్రకటన చేసింది. మేడే కానుక అంటూ మే 21న ముఖ్యమంత్రి ప్రకటించిన ఈ విధానం రాష్ట్రాన్ని మూడు జోన్ లు (మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలు) గా, శ్రామికులను నాలుగు తరగతులు (అన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్) గా విభజించి, కనీస వేతనాలను నిర్దేశించింది. ఈ విధానం ప్రకారం జోన్ 1 లో అన్ స్కిల్డ్ (నైపుణ్యం లేని) శ్రామికులకు రు. 16,000, సెమీ స్కిల్డ్ (అర్ధ నైపుణ్యం గల) శ్రామికులకు రు. 17,000, స్కిల్డ్ (నైపుణ్యం గల) శ్రామికులకు రు. 18,500, హైలీ స్కిల్డ్ (ఉన్నత స్థాయి నైపుణ్యం గల) శ్రామికులకు రు. 20,000 గా నెలవారీ వేతనంగా నిర్ణయించారు. ఈ వేతనాలు జోన్ 2 లో రు. 15,000, రు. 16,000, రు. 17,500, రు. 19,000 గా, జోన్ 3 లో రు. 14,000, రు. 15,000, రు. 16,500, రు. 18,000 గా ఉంటాయి.

మొత్తం మీద సగటున నెలజీతం రు. 14,000 నుంచి రు. 20,000 వరకు మాత్రమే ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం తన ఔదార్యం చూపుకుంది. అంటే రోజుకు కనిష్ట స్థాయిలో రు. 538, గరిష్ట స్థాయిలో రు. 769 అన్నమాట. కుటుంబ సభ్యులలో మరొకరు కూడా వేడి నీళ్లకు చన్నీళ్లలా ఏదో ఒక చిరుద్యోగం, పని చేస్తున్నారనుకున్నా, ఇద్దరు చదువుకునే చిన్నారి పిల్లలో, వృద్ధులైన తల్లిదండ్రులలో ఒకరో ఆధారపడి ఉన్నారనుకుంటే, ఇంటి అద్దె, ప్రయాణ ఖర్చులు, అన్నపానాలు, విద్య, వైద్యం, వినోదం అన్నీ కలిసి సగటున ఒక్కొక్కరు నెలకు రు. 3,500-5,000 (రోజుకు రు. 116-166) తో “కనీస” జీవనం గడపగలరని ప్రభుత్వం అనుకుంటున్నది. అబ్బ, ఎంత ఔదార్యం!

ఈ కనీస వేతనాలు” అనేది ఒక విచిత్రమైన ప్రహసనం. అవి ప్రభుత్వ కాగితాలలో, కార్మిక శాఖ పర్యవేక్షణలో ఉండేవే గాని, వాస్తవంగా ఇంతకన్న తక్కువ కూడా ఇచ్చి పని చేయించుకుంటారని, శ్రమ మార్కెట్ సప్లై డిమాండ్ లను బట్టి ప్రభుత్వం నిర్ణయించిన “కనీస వేతనాల” కన్నా తక్కువకే మార్కెట్ స్థిరపడి ఉందని అందరికీ తెలుసు.

ఇలా శ్రామికులకు ఇవ్వవలసిన కనీస వేతనాలను నిర్దేశించే అధికారం ప్రభుత్వానికి కనీస వేతనాల చట్టం 1948 ద్వారా సంక్రమించింది. (ఇప్పుడు ఆ చట్టాన్ని కొత్తగా రూపొందించిన వేతనాల కోడ్ 2019 లో కలిపి మాయం చేశారు!) ఈ చట్టం ఇచ్చిన అధికారంతో ప్రభుత్వంకార్మిక శాఖ ఎప్పటికప్పుడు ఆయా తరగతుల శ్రామికులకు కనీస వేతనాలను నోటిఫికేషన్లు ఇస్తాయి. ఈ నిర్దేశం సూచన కాదు, తప్పనిసరిగా పాటించవలసిన విధి నిర్దేశం. అంతకన్న తక్కువ చెల్లించడం చట్ట ఉల్లంఘన మాత్రమే కాదు, చట్ట వ్యతిరేకం, నేరం. 

“హైదరాబాదులో అత్యధిక సంపద ఉన్న నలుగురి (దివిస్ లాబరేటరీస్ మురళి, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సోదరులు పి పిచ్చిరెడ్డి, పివి కృష్ణారెడ్డి, హెటెరో డ్రగ్స్ బి పార్థసారథి రెడ్డి)  దగ్గరే ప్రకటితంగానే రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాని మీద 5 శాతం ప్రతిఫలం లెక్క వేసినా వారి వార్షికాదాయం పదివేల కోట్ల రూపాయలు. రోజువారీ ఆదాయం రు. 6.85 కోట్లు. అంటే వారు గంటకు కాదు, నిమిషానికి కాదు, సెకనుకు సంపాదించే సొమ్ము శ్రామికులకు ప్రభుత్వం ఉదారంగా ప్రకటించిన కనీస వేతనం కన్నా చాలా చాలా ఎక్కువ..” 

చట్టం ప్రకారం ఒక యజమాని తన దగ్గర పని చేస్తున్న శ్రామికులందరి హాజరు పట్టీ, జీత భత్యాల రిజిస్టర్, వేతనాలు చెల్లించిన రశీదులు, ఒక్కొక్క ఉద్యోగికీ, శ్రామికుడికీ, శ్రామికురాలికీ పే స్లీప్ తయారుచేసి అధికారులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇనస్పెక్టర్లు ఈ రికార్డులను ఒక నిర్ణీత వ్యవధిలో, లేదా ఎప్పుడు పడితే అప్పుడు ఆకస్మికంగానో పరిశీలించడానికి అధికారం ఉంది. కాని ఆ అధికారులు క్రమం తప్పకుండా మామూళ్లు వసూలు చేసుకోవడానికి వస్తారు గాని, ఎప్పుడూ రికార్డులు అడిగిన పాపాన పోరు, అడిగినా యజమానులు ఆ రికార్డుల బదులు మరేవో ముట్టజెపుతారు. కనీస వేతనాలను ఉల్లంఘించే నేరాన్ని ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ పట్టుకుని, నేరస్తుల మీద విచారణ జరిపే, శిక్ష విధించే యంత్రాంగాలూ లేవు, ఉన్నవి సక్రమంగా పని చేయడమూ లేదు. కొత్త కోడ్ రాక ముందు వరకూ లేబర్ ఇనస్పెక్టర్స్ లేదా ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్ అనే ఉద్యోగం ఉండేది. ఆ పైన డిప్యూటీ లేబర్ కమిషనర్లు, అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు, ఇంకా పైన లేబర్ కమిషనర్లు నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది గాని వారు చేయవలసిన పని చేసిన దాఖలా ఎక్కడా లేదు.

ఇక నరేంద్ర మోదీ  ప్రభుత్వం ఆ మాత్రం రక్షణను కూడా తొలగించి లేబర్ ఇనస్పెక్టర్ – ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్ పదవిని ఇనస్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ గా మార్చింది. అంటే కనీస వేతనాల ఎన్ఫోర్స్ మెంట్ (అమలు) స్థానాన్ని కనీస వేతనాల ఫెసిలిటేషన్ (సౌలభ్యం) మొదలయింది. ఈ సౌలభ్యం శ్రామికులకు కాదనీ, యజమానులకు మాత్రమేననీ కొత్తగా చెప్పనక్కర లేదు.

కనీస వేతనాల ఉల్లంఘన నేరాన్ని విచారించడానికి లేబర్ కోర్టులు ఉన్నాయి. తనకు కనీస వేతనం అందలేదని శ్రమజీవి లేబర్ అధికారికి, ఇనస్పెక్టర్ కు, లేదా లేబర్ కోర్టుకు ఫిర్యాదు చేయవచ్చు. కార్మిక శాఖకు టోల్ ఫ్రీ నంబర్ మీద ఫిర్యాదు చేయవచ్చు. ఆ ఫిర్యాదు మీద విచారణ జరిగి, నిజమని తేలితే, ఎగ్గొట్టిన వేతనాన్ని చెల్లించమనీ, పది రెట్ల దాకా నష్టపరిహారం చెల్లించమనీ లేబర్ కోర్టు యజమానిని ఆదేశించవచ్చు. యజమాని మీద జరిమానా విధించవచ్చు. న్యాయస్థానంలో విచారణ జరపవచ్చు. అయితే ఇదంతా కాగితం మీద మాత్రమే ఉంది. మొట్టమొదట, ఫిర్యాదు చేస్తే తనకున్న ఆ చిన్నపాటి ఉపాధి పోతుందనీ, యజమాని గూండాల చేతిలో దెబ్బలు కూడా తినవలసి వస్తుందనీ, బైట నిరుద్యోగ సైన్యంలో తన కన్నా తక్కువ వేతనానికి ఆ పని చేయడానికి అనేక మంది పోటీలో ఉన్నారనీ ఫిర్యాదీకి తెలుసు. కనుక ఈ ప్రక్రియలో మొదటి చర్య అయిన ఫిర్యాదు అనేదానికే అవకాశం లేదు. అయినా ఆ కార్మికుడో, కార్మికురాలో ఆ యజమాని దగ్గర పని చేస్తున్నారని చూపే లిఖిత ఆధారాలు ఏమీ ఉండవు.

మరొకపక్క వ్యాపార, పారిశ్రామిక సంస్థలు వేలాది, లక్షలాది ఉండగా ఇనస్పెక్టర్లు వందల్లో, పదుల్లో కూడా లేరు. ఉన్నవారు అన్నీ పని స్థలాలనూ సందర్శించాలంటే సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క పని స్థలంలో కొన్ని నిమిషాల కన్నా ఎక్కువ సమయం దొరకదు. అందువల్ల కచ్చితంగా ఏ రోజు ఇనస్పెక్టర్ వస్తారో యజమానులకు తెలుసు, చూపెట్టవలసిన కాగితాలూ, అదనంగా ఇవ్వవలసిన నోట్లూ సిద్ధంగా పెట్టుకుంటారు.

ఒక పని స్థలంలో ఉన్న శ్రామికులలో అత్యధిక సంఖ్యాకులు కాంట్రాక్టు కార్మికులుగా, కాజువల్ కార్మికులుగా, వలస కార్మికులుగా ఉంటారు. వారు నేరుగా ఆ యజమానితో సంబంధంలో కాక ఏదో ఔట్ సోర్సింగ్ సంస్థ దగ్గర, సబ్ కాంట్రాక్టర్ దగ్గర, మధ్యవర్తి దగ్గర ఉద్యోగులై ఉంటారు. కనుక యజమాని నేరం ఎప్పటికీ బైటపడదు. ఈ అవరోధాలన్నీ దాటుకుని నిజంగా కేసు పెట్టినా, అది పరిష్కారం కావడానికి నెలలో సంవత్సరాలో పడుతుంది గనుక రోజుకూలీకి ఈ ప్రక్రియ అంతా భరించడం అసాధ్యం.

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ నిర్దేశాలూ, చట్టమూ కార్మికుల హక్కుల భాషలో మాట్లాడుతుండగా, ఆ ప్రభుత్వానికే చెందిన కార్మిక శాఖ పని తీరు రాజీ భాషలో, తప్పించుకునే భాషలో, యజమానులను తప్పించే భాషలో ఉంటుంది. మొత్తానికి ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలు కనీస వేతనాలూ కావు, కనీసం అవైనా అమలు కావు, అమలు చేయమని అడగవలసిన ప్రభుత్వ యంత్రాంగం ఆ పని చేయదు. ఇదీ ప్రజల పట్ల, ఎవరి శ్రమతో సమాజం నడుస్తున్నదో వారి పట్ల ప్రభుత్వాల బాధ్యతాయుతమైన వైఖరి!

ఈ వ్యవహారాన్నే మరొకవైపు నుంచి కూడా చూడవలసి ఉంది. ఏ ప్రాంతంలో రోజుకు సగటున రు. 538-769 చెల్లిస్తే ఆ శ్రామిక కుటుంబమంతా సంతోషంగా జీవితం గడిపిమర్నాడు మళ్లీ తమకు శ్రమ అందించడానికి ఉత్సాహంగా వస్తారని ప్రభుత్వం భావిస్తున్నదో, అదే ప్రాంతంలో ఆ ఆరువందల రూపాయలు రోజుకు కాదు, నిమిషానికీ, సెకనుకూ, సెకనులో చెప్పలేనంత వంతుకూ సంపాదించగల వాళ్లు కూడా ఉన్నారు. ఆ అత్యధిక సంపాదనాపరులు నిజంగా సమాజానికి అవసరమైన, ఉత్పాదకమైన శ్రమ చేస్తున్నారో లేదో కూడా తెలియదు. వారి శ్రమ ఒకరోజో, కొన్ని రోజులో ఆగిపోయినా సమాజానికి వచ్చే చేటు ఏమీ లేదు.

ఇదే తెలంగాణలో, హైదరాబాదులో వార్షికాదాయం ఒక కోటి రూపాయల కన్నా ఎక్కువ ఉన్నదని ప్రకటించి పన్ను చెల్లించిన వారు ఆరు వేల మంది. “ఒక కోటి రూపాయల కన్నా ఎక్కువ” అనేది ఒక ఉజ్జాయింపు మాటే గానివాస్తవానికి వార్షికాదాయం వెయ్యి కోట్లకు పైన ప్రకటించినవారు, లేదా ఆదాయంతో సంబంధం లేకుండా వేలాది కోట్ల సంపద ఉన్నవారుఆ సంపద మీద కనీస పక్షం 5 శాతం ప్రతిఫలం వస్తుందని అనుకున్నా ఏడాదికి వందల కోట్లు సంపాదించేవారు కూడా ఉన్నారు. హైదరాబాదులో అత్యధిక సంపద ఉన్న నలుగురి (దివిస్ లాబరేటరీస్ మురళిమేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సోదరులు పి పిచ్చిరెడ్డి, పివి కృష్ణారెడ్డి, హెటెరో డ్రగ్స్ బి పార్థసారథి రెడ్డి)  దగ్గరే ప్రకటితంగానే రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉంది. దాని మీద 5 శాతం ప్రతిఫలం లెక్క వేసినా వారి వార్షికాదాయం పదివేల కోట్ల రూపాయలు. రోజువారీ ఆదాయం రు. 6.85 కోట్లు. అంటే వారు గంటకు కాదు, నిమిషానికి కాదు, సెకనుకు సంపాదించే సొమ్ము శ్రామికులకు ప్రభుత్వం ఉదారంగా ప్రకటించిన కనీస వేతనం కన్నా చాలా చాలా ఎక్కువ.  

కనీస వేతనాల ప్రకటన పరిధిలోకి వచ్చే శ్రామికులేమో రోజుకు ఎనిమిది గంటలో, పది గంటలో విరామం ఎరగకుండా పని చేస్తుండగాఈ కోట్లాది రూపాయల ఆదాయం ఉన్నవారు ఎనిమిది గంటలు కాదు గదా, ఎనిమిది నిమిషాలు కూడా చెమటోడ్చవలసిన అవసరం లేదు. నిలువ ఉన్న సంపద మీద, వారి కార్ఖానాల్లో జరుగుతున్న ఉత్పత్తి మీద, వ్యాపార సంస్థల్లో సాగుతున్న లావాదేవీల మీద ఆదాయం నిరంతరంవారు కూచున్నా, లేచినా, పడుకున్నా, తింటున్నా, తాగుతున్నా, సెలవు దినాల్లోనైనా తగ్గకుండా వస్తూనే ఉంటుంది. ఇంకా ఎక్కువ వచ్చేవాళ్లందరిని కూడా పక్కన పెట్టి, వార్షికాదాయం ఒక కోటి రూపాయలు అన్నవారిని మాత్రమే చూసినావారికి రోజువారీ ఆదాయం రు. 28,000 అనుకోవాలి. ఐదు కోట్ల రూపాయల ఆర్జనాపరులకు రోజువారీ ఆదాయం రు. 1,37,000, పది కోట్ల రూపాయల ఆర్జనాపరుల రోజువారీ ఆదాయం రు. 2,74,000.

ఆ ఆకాశహర్మ్యాలలో మరీ పైకి ఎక్కకుండా, అధికాదాయపరులలో కనీస స్థానంలో ఉన్న ఒక కోటి రూపాయల ఆదాయం వచ్చేవారి దగ్గరే ఆగి చూస్తేమహాఘనత వహించిన ప్రభుత్వం విదిల్చిన ఎంగిలి మెతుకుల కనీస వేతనం రు. 500 తో పోలిస్తే అది 56 రెట్లు. పైన చెప్పిన నలుగురు బడా సంపన్నులతో పోలిస్తే అది 13,000 రెట్లు. ఈ రాష్ట్రంలో అసమానత ఇంత పెద్ద ఎత్తున కనీస పక్షం 56:1 గా, గరిష్టంగా 13,000:1 గా ఉన్నదన్నమాట. ఇది 1789 ఫ్రెంచి విప్లవం ముందరి అసమానతకు, అంతరానికి మించినది. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలలో “సంపద, ఉత్పత్తి సాధనాలు ఒకేచోట కేంద్రీకరించబడి, తత్ఫలితంగా ఉమ్మడి ప్రయోజనాలు భంగపడేలా జరగకుండా, రాజ్యం ప్రత్యేకంగా తన విధానం ద్వారా ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తుంది” అని చెప్పిన అధికరణం 39 (సి) ఎవరికైనా గుర్తుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *