– నిమ్స్‌లో బాధితురాలికి మంత్రి సీతక్క పరామర్శ
– కుటుంబానికి రూ.5 లక్షల చెక్ అందజేసిన మంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 18: ఖమ్మం జిల్లాలో లైంగిక దాడికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలికకు వైద్యులు గురువారం శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హాస్పిటల్‌కు వెళ్లి బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ జస్టిస్ పంచాక్షరి కూడా మంత్రితో కలిసి బాలికను పరామర్శించారు. బాలికకు అందుతున్న వైద్య సేవలు, శస్త్ర చికిత్స అనంతర పరిస్థితి గురించి నిమ్స్ వైద్యులు మంత్రికి వివరించారు. బాలిక ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని వైద్య బృందం తెలిపింది. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులను కలిసిన మంత్రి సీతక్క వారికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. బాలిక పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన వైద్య చికిత్సను ప్రభుత్వం తరఫున అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును మంత్రి సీతక్క, జస్టిస్ పంచాక్షరి కలిసి అందజేశారు. బాలిక భవిష్యత్తు, విద్య, పునరావాసం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. బాలిక తోబుట్టువులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం రాజీ పడదని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు కఠిన శిక్షలు పడేలా అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయ, వైద్య, ఆర్థికపరమైన సహాయాన్ని సమగ్రంగా అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓఝా, ఆర్.జే.డీ మోతి, నిమ్స్ వైద్యులు, శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





