– విద్యార్థుల భవిష్యత్‌కు పునాదులు వేసేది గురువులే
– ప్రభుత్వ విద్యను ప్రైవేట్‌కు దీటుగా బలోపేతం చేస్తాం
– సీఎం రేవంత్ రెడ్డి
– కొడంగల్‌లో పాఠశాల భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం
కొడంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే అసలైన పునాదులు వేస్తారని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తల్లిదండ్రుల కంటే విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దనే ఎక్కువ సమయం గడుపుతారని, సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన విధంగా సమాజ నిర్మణంలో గురువుల పాత్ర కీలకమైనదని కొనియాడారు. విద్యాభివృద్ధిలో గతంలో 28 వ స్థానంలో ఉంటే ప్రజా ప్రభుత్వం వచ్చాక 17 వ స్థానానికి చేరుకుంది.. ఇది ఉపాధ్యాయుల కృషితోనే సాధ్యమైంది అని అన్నారు.ఈ రెండేళ్లల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 88 వేలు పెరిగిందని, ఈ విజయం మీది.. తెలంగాణ ప్రజలది అని చెప్పారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో 95 శాతం అడ్మిషన్లు జరిగాయన్నారు. సాంకేతిక విద్యలో తెలంగాణ వేగంగా ముందుకెళుతోందన్నారు.
రోడ్డెక్కవద్దు.. సమస్యలు పరిష్కరిస్తా
55 రోజుల్లోనే డీఎస్సీ ద్వారా 10,006 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతోపాటు 25,950 మందికి ప్రమోషన్లు, 34,706 మందికి పారదర్శకంగా బదిలీలు చేపట్టామని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు రోడ్డెక్కడం రాష్ట్రానికి శుభసూచకం కాదని, వారికి ఎలాంటి చిన్న సమస్య రాకుండా చూసుకునే బాధ్యత తనదేనని సీఎం హామీ ఇచ్చారు. ఆర్ధిక వెసులుబాటును బట్టి సమస్యలన్నీ పరిష్కరిస్తానని, విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు తనకు రెండేళ్ల సమయం ఇవ్వాలని కోరారు. ప్రైవేటుకు దీటుగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు. 317 జీవో సమస్యను పరిష్కరించాం.. విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని, కే కేశవరావును సలహాదారుగా నియమించి విద్యాశాఖ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎడ్యుకేషన్ పాలసీని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.. మీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వంపై మీ అభిప్రాయం మార్చుకోవద్దు అని కోరారు. మేం అధికారంలోకి రాగానే పీఆర్సీ ఇచ్చామని, మళ్లీ ఇప్పుడు పీఆర్సీ ఇవ్వాలని శ్రీపాల్ అంటున్నాడని అన్నారు. మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా మీ సర్వీస్ ను 60 ఏళ్లకు గత పాలకులు పెంచారని, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ పెట్టి వెళ్లి ఆయన ఫామ్ హౌస్ లో పడుకున్నారని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ప్రజా ప్రభుత్వం రూ.6 వేల కోట్లు చెల్లించిందని చెప్పారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ ఖర్చులతో విదేశాలకు పంపి విద్యా విధానం అధ్యయనం చేయించారా? తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులను విదేశాలకు పంపింది నిజం కాదా అని అడిగారు. ఉపాధ్యాయుల కు గుర్తింపు ఇవ్వాలని, వారిని గౌరవించాలని 123 మంది టీచర్లకు అవార్డులు అందిస్తున్నామన్నారు.
కొడంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు 
అంతకుముందు కొడంగల్‌లో మండల పరిషత్, జెడ్పీ బాలికల పాఠశాల నూతన భవనం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ క్రిటికల్ కేర్ బ్లాక్, గెస్ట్ హౌస్‌లను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి
కొడంగల్ లోని తన నివాసంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ కలసి రాష్ట్రంలో కాంగ్రెస్ అనుకూల ఓట్లను, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఒక్క పేదవాడి ఓటు కూడా తొలగింపునకు గురికాకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




