– వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2027 చివరికల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, అన్ని రకాల సౌకర్యాలతో కొత్త హాస్పిటల్ ఉండబోతున్నదన్నారు. పేషెంట్లతోపాటు, సిబ్బంది, వైద్యులకు సౌకర్యవంతంగా ఉండేలా హాస్పిటల్ డిజైన్ చేయిస్తున్నామన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం జరిగిన ఉస్మానియా ఎంబీబీఎస్ విద్యార్థుల 175వ స్నాతకోత్సవ కార్యక్రమంలో మంత్రి రాజనర్సింహ పాల్గొన్నారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి విద్యార్థులకు పట్టాలు అందజేశారు. పట్టాలు అందుకుంటున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల బాధను పంచుకుని వారికి ఉపశమనం కలిగించే పవిత్రమైన వృత్తిలోకి అడుగుపెడుతున్నారని విద్యార్థులకు గుర్తు చేశారు. రోగులతో మానవత్వంతో వ్యవహరించాలని, ధనార్జనే ధ్యేయంగా ఉండకూడదని ఉద్బోధించారు. డాక్టర్లకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. దశాబ్దాల ఉస్మానియా కొత్త హాస్పిటల్ కలను తమ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ రోజూ వేలాది మంది రోగులకు సేవలందిస్తోందని, ఇటీవల 18 నెలల చిన్నారికి విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహించడం ఇక్కడి వైద్యుల నైపుణ్యానికి నిదర్శనవని అన్నారు. కొత్త భవనం అందుబాటులోకి రాగానే అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలు, అత్యవసర చికిత్సలు మరింత విస్తృతంగా అందించగలమని మంత్రి పేర్కొన్నారు. వైద్య విద్యను బలోపేతం చేసే దిశగా విద్యార్థుల కోసం గాంధీ, ఉస్మానియా మెడికల్ కాలేజీల్లో అత్యాధునిక వసతులతో హాస్టల్ భవనాల నిర్మాణం కూడా చేపట్టామని గుర్తు చేశారు. ప్రజలకు అందుబాటులో, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, నూతన ఉస్మానియా హాస్పిటల్ రాష్ట్ర వైద్య రంగంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ, డాక్టర్ రమేశ్‌రెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్, ఉస్మానియా ప్రిన్సిపాల్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





