– వాల్ రైటింగ్ క్యాంపెయిన్ ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 10న రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని, ఆయన పర్యటనను జయప్రదం చేసేందుకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని ప్రజలందరూ హాజరు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హిమాయత్‌నగర్ నారాయణగూడాలో స్వయంగా వాల్ రైటింగ్ క్యాంపెయిన్‌ను ప్రారంభించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి వేలాదిగా మహిళలు స్వచ్ఛందంగా తరలివస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటోందని, రాబోయే కాలంలో రాష్ట్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఒక కుటుంబ పాలన నుంచి, అవినీతి పాలన నుంచి తెలంగాణకు విముక్తి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఎక్కడ చూసినా బీజేపీకి అనుకూలమైన పవనాలు వీస్తున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘సిందూర’తో యుద్ధం చేసి ఉగ్రవాదాన్ని దేశంలో తుద ముట్టించారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయని, పేద ప్రజలందరూ మోదీ వైపు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కిషన్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తలందరూ ఐకమత్యంతో పనిచేసి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. 10న జరిగే బహిరంగ సభలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




