‘ఖేలో ఇండియా’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి

– క్రీడాకారులకు ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పించాలి
– కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచనలు

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : ఖేలో ఇండియా గేమ్స్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి దేశవ్యాప్తంగా క్రీడాకారులు, క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. ఈ జాతీయస్థాయి క్రీడా పోటీల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, నిర్ణీత సమయంలో ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేయాలని రాష్ట్ర అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఖేలో ఇండియా గేమ్స్ విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లు, కార్యాచరణ ప్రణాళికపై మాండవీయతో న్యూదిల్లీలో ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని రాష్ట్రంలో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలను ఆయనతో చర్చించారు.

క్రీడల నిర్వహణకు పకడ్బందీ ప్రణాళిక

ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణ అనేది కేవలం క్రీడా పోటీలకే పరిమితం కాకుండా రాష్ట్ర క్రీడా సామర్థ్యాన్ని దేశానికి పరిచయం చేసే గొప్ప అవకాశమని చర్చించారు. క్రీడా వేదికల సిద్ధత, మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారులకు వసతి, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలు, సాంకేతిక ఏర్పాట్లు, పోటీల నిర్వహణకు అవసరమైన సిబ్బంది సమన్వయం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, అధికారులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు. పోటీల నిర్వహణలో పారదర్శకత, సమయపాలన, నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సూచించారు.

ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని ఆహ్వానించాలి : వాకిటి

గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని మన్సుఖ్ మాండవీయకు మంత్రి శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి హాజరైతే గేమ్స్‌కు మరింత జాతీయ ప్రాధాన్యత లభిస్తుందని, దేశవ్యాప్తంగా యువ క్రీడాకారులకు స్ఫూర్తి కలుగుతుందని అభిప్రాయపడ్డారు. క్రీడలను ప్రోత్సహించడంలో కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ క్రీడా సంస్కృతిని మరింత విస్తరించేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు. ఖేలో ఇండియా గేమ్స్‌ను నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి క్రీడా రంగంలో జాతీయస్థాయిలో మరింత గుర్తింపు రావడంతోపాటు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న క్రీడా మౌలిక సదుపాయాలను దేశానికి పరిచయం చేసే అవకాశం లభిస్తుందని మంత్రి వాకిటి వివరించారు.

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ప్రజెంటేషన్

గేమ్స్ నిర్వహణ కోసం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ రూపొందించిన సమగ్ర ప్రణాళికను అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర మంత్రికి వివరించారు. క్రీడల నిర్వహణకు సంబంధించి రూపొందించిన కార్యాచరణ, క్రీడా వేదికల సన్నద్ధత, అవసరమైన మౌలిక సదుపాయాలు, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, క్రీడాకారులకు కల్పించాల్సిన సదుపాయాలు తదితర అంశాలను ప్రజెంటేషన్‌లో వివరించారు. కేంద్ర క్రీడల శాఖ సూచనలకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లను మరింత పటిష్టం చేసుకోవడం, సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో ముందుకు సాగడం, ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీప్రసాద్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర క్రీడల శాఖతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సమష్టి కృషితో ఖేలో ఇండియా గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని సమావేశంలో దిశానిర్దేశం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *