సిటి పోలీస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలు

– 38 కేంద్రాల్లో నిర్వహణ
– సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రారంభించిన డీజీపీ ఆనంద్‌
– పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల మహోన్నత త్యాగాలకు నివాళిగా హైదరాబాద్ సిటీ పోలీస్ గురువారం మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసింది. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులు, తలసేమియా చిన్నారులు, క్యాన్సర్‌ రోగుల అత్యవసర చికిత్సలకు అండగా నిలిచేందుకు నగరవ్యాప్తంగా 38 కేంద్రాల్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టింది. సుమారు 30 బ్లడ్‌ బ్యాంకుల సహకారంతో దాదాపు 5,700 యూనిట్ల రక్తాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుని ఈ శిబిరాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా పేట్లబురుజులోని సీఏఆర్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన కేంద్రాన్ని డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు నగర పౌరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీజీపీ ఆనంద్‌ మాట్లాడుతూ ఈనెల‌ 21 నుంచి 31 వరకు అమరవీరుల స్మరణార్థం రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజ రక్షణ కోసం పండుగలు, సెలవులను సైతం విడిచిపెట్టి పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం త్యాగనిరతి చాటుకుంటున్నారని కొనియాడారు. ప్రాణదానంతో సమానమైన రక్తదానాన్ని ఉద్యమంలా చేపట్టి, సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ హాస్పిట‌ల్స్‌కు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. ముఖ్యంగా తలసేమియా బాధితులకు, ప్రమాదాల్లో గాయపడిన వారికి ఈ రక్తం సంజీవనిలా ఉపయోగపడుతుందన్నారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ అమరుల త్యాగాలను స్మరిస్తూ వారికి నిజమైన నివాళి అర్పించాలనే సంకల్పంతోనే పెద్దఎత్తున ఈ శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మహత్కార్యానికి సహకరించిన ఉస్మానియా, గాంధీ, నిమ్స్, కింగ్ కోఠి, నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్స్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులకు, అలాగే రెడ్ క్రాస్, తలసేమియా ఫౌండేషన్, రోటరీ, లయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలకు, రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ (క్రైమ్) ఎం.శ్రీనివాసులు, అడిషనల్ సీపీ (లా అండ్ ఆర్డర్)  తప్సీర్ ఇక్బాల్ ఐపీఎస్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, డీసీపీ (సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్) ఆర్.వెంకటేశ్వర్లు ఐపీఎస్, శ్రీ.రాహుల్ హెడ్గే ఐపిఎస్ డిసిపి ట్రాఫిక్, విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్యనాయక్ జాదవ్ గారితో పాటు అన్ని జోన్ల డీసీపీలు, ఇతర అధికారులు, బ్లడ్ బ్యాంకులకు చెందిన వైద్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *