– లక్షిత వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే సబ్ ప్లాన్ లక్ష్యం
– ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ
– గిరిజన ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు
– ప్రత్యేక అభివృద్ధి నిధుల ఖర్చులపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి మరింత ఊతమిచ్చేలా ఎస్పీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సమర్థవంతంగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లక్షిత వర్గాలకు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చడంతోపాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా నిధుల వినియోగంలో వేగం పెంచాలని సూచించారు. వ్యవసాయ, ఇంధన, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్యుత్, గృహ వసతి, సామాజిక మౌలిక సదుపాయాలు, వైద్య సేవలు వంటి కీలక రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. రైతు భరోసా, సబ్సిడీ విత్తనాల పంపిణీ, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాల అమలుపై సమీక్ష సందర్భంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు త్రైమాసికాల్లో జరిగిన వ్యయం, అమలవుతున్న సంక్షేమ పథకాలు, లబ్దిదారులకు అందిన ప్రయోజనాలను సమీక్షిస్తూ ప్రజల అవసరాలకనుగుణంగా నిధులు వినియోగించేందుకు కీలక సూచనలు చేశారు. భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ రైతులకు వర్తించే పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను సమగ్రంగా విశ్లేషించాలని, భూమి యాజమాన్యం ఆధారంగా అమలవుతున్న పథకాల కారణంగా ప్రత్యేక అభివృద్ధి నిధుల వినియోగంలో ఏర్పడుతున్న వ్యత్యాసాలను గుర్తించాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వ్యవసాయ పథకాల ద్వారా అందుతున్న సహాయం, సాధారణ పథకాల వ్యయంతో పోలిస్తే ఎంత మేరకు ఉందో స్పష్టమైన గణాంకాలతో నివేదికలు రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల నిబంధనల కారణంగా ప్రత్యేక అభివృద్ధి నిధులను పూర్తిస్థాయిలో వినియోగించలేని పరిస్థితులు ఉంటే వాటిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలన్నారు. అర్హులైన ఎస్సీ రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చే ప్రత్యేక పథకాల రూపకల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. వ్యవసాయ శాఖతోపాటు ఇతర శాఖలు అమలు చేస్తున్న పథకాల లబ్దిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించాలని ఆదేశించారు. సబ్సిడీ విత్తనాలు, వ్యవసాయ యంత్రాల పంపిణీ వంటి పథకాలలో లబ్ది పొందిన రైతుల పేర్లు, గ్రామాలు, సామాజిక వర్గాలు, అందించిన సహాయం తదితర వివరాలతో సమగ్ర జాబితాలను సిద్ధం చేయాలన్నారు. ప్రతి శాఖ తన పరిధిలోని పథకాల కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎంతమేర ప్రయోజనం అందించిందో స్పష్టంగా తెలియజేయాలని, ఈ వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసి నిధుల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ల నుంచి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో సుమారు 1,300 ఎకరాల భూమి అందుబాటులో ఉందని అధికారులు వివరించారు. ఈ భూమిని వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని, ఇప్పటికే గుర్తించిన స్థలాలను అర్హులైన కుటుంబాలకు అందించేందుకు అవసరమైన అనుమతులు, తదుపరి చర్యలను వేగవంతం చేయాలని భట్టి విక్రమార్క సూచించారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన కుటుంబాలకు స్థలాల కొనుగోలు కోసం భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా పరిశీలించాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్లు, శ్మశానవాటికలు వంటి మౌలిక సదుపాయాల అవసరాలను గుర్తించాలన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్య క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి వివిధ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం, మౌలిక సదుపాయాలను విస్తరించడం, విద్యుత్, గృహ వసతి, వైద్య సేవలను మెరుగుపరచడం ద్వారా సమగ్ర అభివృద్ధికి బాటలు వేయాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విద్యుత్ సదుపాయాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలి
ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేందుకు, విద్యుత్ సదుపాయాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూచించారు. విద్యుత్ వైరింగ్, స్తంభాల ఏర్పాటు వంటి పనులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తే ఆయా ఆవాసాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత తోడ్పాటు లభిస్తుందన్నారు. ఏజెన్సీ ఏరియాలో వైద్య సేవల విస్తరణకు మొబైల్ వైద్య యూనిట్ల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. వైద్యులు, అవసరమైన మందులను ప్రజలకు చేరువ చేయడం, అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్య సహాయం అందించడంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఉన్నధికారులు నవీన్ మిట్టల్, సందీప్ కుమార్ సుల్తానియా, సురేంద్రమోహన్, సిక్తా పట్నాయక్, క్రిస్టినా, విజయేంద్ర బోయి, గోపి, గుగులోతు రవి నాయక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





