– ఇతర ఎంపీలను బీజేపీలో చేర్చుకోవడంపై ‘ఆప్’ విమర్శలు
న్యూదిల్లీ, ఏప్రిల్ 24: కమలం పార్టీ ఆపరేషన్ లోటస్‌ను మళ్లీ మొదలుపెట్టిందని ‘ఆప్’ కన్వీనర్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ తన చర్యలతో మరోసారి పంజాబీలను గట్టి దెబ్బ కొట్టిందని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. బీజేపీ ఆపరేషన్ లోటస్‌ను మళ్లీ మొదలుపెట్టిందని ‘ఆప’ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. తమ ఏడుగురు ఎంపీలను ప్రలోభపెట్టడానికి బీజేపీ ఈడీ, సీబీఐలను వాడుకుందని ఆరోపించారు. ఈ రోజు ఏడుగురు ‘ఆప’ ఎంపీలు బీజేపీలో చేరార. తమను మోసం చేసిన వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. రాఘవ్ చడ్డాను పార్టీ ఎమ్మెల్యే, ఎంపీని చేసింది. పంజాబ్ ప్రజలు సందీప్ పాఠక్‌ను ప్రేమతో రాజ్యసభకు పంపారు. రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్నీ, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్.. వీరందరికీ పార్టీ, పంజాబ్ ప్రజలు దిగువస్థాయి నుంచి ఉన్నత స్థానాలకు చేరుకొనే అవకాశం కల్పించారు. వారి ఆశీస్సుల వల్లే హర్భజన్‌సింగ్‌కు కూడా పార్లమెంటులో అడుగుపెట్టే అవకాశం లభించింది. కానీ, ఈ ఏడుగురూ రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారు అని సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో తమ పార్టీ ఉప నేతగా ఉన్న రాఘవ్ చడ్డాపై ‘ఆప్’ వేటు వేసి ఆ హోదాలో మరో ఎంపీ అశోక్ మిత్తల్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చడ్డాతోపాటు ఆయన సైతం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో ‘ఆప్’నకు భారీ ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
‘ఆప్’కు భారీ షాక్.. బీజేపీలోకి రాఘవచద్దా తదితరులు
ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు. వీరిలో ప్రస్తుతం రాజ్యసభ ఆప్ డిప్యూటీ లీడర్ అశోక్ కుమార్ మిట్టల్ కూడా ఉన్నారు. ఇటీవలే రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ ప్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించిన ఆప్ ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించింది. కానీ, ఇప్పుడు ఆయన కూడా పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని రాఘవ్ చద్దా వెల్లడించారు. శుక్రవారం రాఘవ్ చద్దా, అశోక్ కుమార్ మిట్టల్, సందీప్ పాఠక్ డియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాము ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. రాజ్యసభలో మూడింట రెండొంతుల ఆప్ సభ్యులు కలిసి బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అంటే రాజ్యాంగం ప్రకారం ఈ ముగ్గురూ కలిసి ఆమ్ ఆద్మీని బీజేపీలో విలీనం చేస్తారు. ఇలా ఒక సభలో ఒక పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల మంది సభ్యులు అధికార లేదా వేరే ఏ పార్టీలోనైనా చేరవచ్చు. ఇలా చేరితే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదు. దీంతో ఈ ముగ్గురి రాజ్యసభ సభ్యత్వానికి ఢోకా లేకపోవచ్చు. ఇక, వీరు 2022 నుంచి ఆప్ తరఫున రాజ్యసభలో సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం 15 ఏళ్లపాటు చెమట, రక్తం చిందించాను.. ఇప్పుడు ఆ పార్టీ తన సిద్దాంతాలు, విలువలు, నైతిక అంశాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంది.. తన స్వార్ధ ప్రయోజనాల కోసం తప్ప దేశం కోసం, జాతి ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు.. ఇది చాలామంది ఎప్పటినుంచో చెబుతున్నారు.. ఇప్పుడు నేను కూడా అదే అనుకుంటున్నా.. నేను సరైన పార్టీలో లేనని భావిస్తున్నా.. సరైన వ్యక్తిని తప్పుడు పార్టీలో ఉన్నా.. అందుకే ఈ రోజే ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉంటున్నా.. ప్రజల కోసం వెళ్తున్నా‘ అంటూ ప్రకటించారు. తమతోపాటు స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సహ్నే కూడా త్వరలో ఆప్‌ను వీడి బీజేపీలో చేరుతారు అంటూ రాఘవ్ వెల్లడించారు. అలాగే, తాను మోదీ, అమిత్ షా నాయకత్వంలో పనిచేయబోతున్నట్లు వెల్లడించారు. తాజా సమాచారం ప్రకారం.. రాఘవ్ చద్దాకు కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా చోటు దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
—————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





